ఈతలో మోత.. మరి పరుగుపందెంలో?

Katinka Hosszu, Rio 2016

ఫొటో సోర్స్, Getty Images

ఏడాది క్రితం జరిగిన రియో ఒలింపిక్స్ గుర్తున్నాయా.. అందులో ఈత పోటీలు మొదలవగానే రికార్డులు బద్ధలవడం కూడా మొదలైంది.. కేవలం నాలుగు రోజుల్లోనే ఆరు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.. ఒక్క రియో ఒలింపిక్సేంటి ప్రతి ఒలింపిక్స్‌‌లోనూ ఇదే తీరు. మరి రన్నింగ్ వంటి ఇతర పోటీల్లో మాత్రం ఈ స్థాయిలో కొత్త రికార్డులు నమోదు కావెందుకు?

రియో ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల ఈత పోటీలో 'కతింకా హోస్జు'తో కొత్త రికార్డుల వెల్లువ మొదలైంది. ఆ తరువాత రిలే, 100 మీటర్ల పోటీల్లో.. ఇలా అనేక విభాగాల్లో స్విమ్మర్లు పాత రికార్డులను బద్దలు కొట్టారు.

అంతకుముందు లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ ఈత పోటీల్లో ఏకంగా 9 కొత్త రికార్డులు నమోదయ్యాయి. కానీ.. రన్నింగ్‌కు వచ్చేసరికి కేవలం రెండే రెండు కొత్త రికార్డులు సాధ్యమయ్యాయి.

1972 నుంచి జరుగుతున్న ఒలింపిక్స్ చూస్తే ఈతలో సుమారు 40 శాతం రికార్డులు తుడిచిపెట్టుకుపోగా రన్నింగ్‌లో కేవలం 10 శాతం మాత్రమే కొత్తవి నమోదయ్యాయి. 2000 తరువాతైతే రన్నింగ్‌లో కొత్త రికార్డులు బాగా తగ్గిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రియో ఒలింపిక్స్ లో 10వేల మీటర్ల పరుగును 29 నిమిషాల 17.45 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును నమోదు చేసిన ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా

ఈత, పరుగులో ప్రధానంగా 100 మీటర్ల పోటీల్లో రికార్డులు ఎలా మెరుగుపడ్డాయన్నది చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 1912 నుంచి ఇప్పటి వరకు పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఈతలో లక్ష్యం చేరే సమయం 23.85 శాతం మెరుగుపడింది. 1912లో 1.16 నిమిషాలుగా ఉన్న ఈ సమయం ఇప్పుడు 46.91 సెకండ్లకు చేరింది.

పురుషుల 100 మీటర్ల పరుగులో అప్పటికి, ఇప్పటికీ కేవలం 9.62 శాతం సమయమే తగ్గింది. 1912లో 10.6 సెకండ్ల సమయం పట్టగా ప్రస్తుత రికార్డు సమయం 9.58 సెకండ్లుగా ఉంది.

ఈత కొట్టే వేగాన్ని పెంచటం సులభం

కెనడాకు చెందిన స్విమ్మింగ్ ట్రైనర్‌ రిక్ మేడ్జ్ విశ్లేషణ పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. పరుగుతో పోల్చితే ఈతలో శరీర కదలికలు ఎక్కువ. సాధనతో ఈతలో అనేక మార్పులు తీసుకొచ్చి.. లక్ష్యాన్ని త్వరగా చేరవచ్చన్నది ఆయన సిద్ధాంతం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రియోలో 'ఆడమ్ పీటీ' ఏకంగా నిమిషానికి 58 నుంచి 60 స్ట్రోక్‌లు ఇచ్చాడు.

2012లో పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో గెలిచిన 'కేమెరూన్ వేన్ డెర్ బర్గ్' నిమిషానికి 50 నుంచి 52 స్ట్రోక్‌లు ఇచ్చాడు. అప్పటికి అదే అత్యంత వేగవంతమైన రికార్డుగా అందరినీ అబ్బురపరిచింది. కానీ, రియోలో 'ఆడమ్ పీటీ' ఏకంగా నిమిషానికి 58 నుంచి 60 స్ట్రోక్‌లు ఇచ్చాడు.

పరుగుపై పరిస్థితులపై ప్రభావం

కానీ, పరుగు విషయానికొచ్చేసరికి పరిస్థితులు వేరు. ఈత కొలనులో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. పరుగు పోటీలో ఇలా ఉండదు. బయట వాతావరణ ప్రభావం ఉంటుంది. గాలి, ఉష్ణోగ్రత మొదలైనవన్నీ అథ్లెట్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే పరుగులో కొత్త రికార్డులు తక్కువగా నమోదవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

టెక్నాలజీ అండ

పైగా, ఎప్పటికప్పుడు ఒలింపిక్స్‌లో ప్రవేశపెడుతున్న కొత్త సాంకేతికతలు కూడా ఈత కొలనులో రికార్డుల మోతకు కారణమవుతున్నాయి.

2016 రియో ఒలింపిక్స్‌లో ఈతకొలనుల్లో అలలు తక్కువగా ఉండేలా చేయగలిగారు. ఇది ఈతగాళ్ల వేగం పెరగడానికి కారణమైంది.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఏకంగా ఈత పోటీల్లో 19 రికార్డులు బ్రేకయ్యాయి. నీట్లో తేలిపోయేలా, నీటిని చీల్చుకుంటూ పోయే వీలు కల్పించే అత్యాధునిక స్విమ్ సూట్లను వాడడమే అందుకు కారణం.

పరుగు పోటీల్లో ఇన్ని మార్పులు రాలేదు. ట్రాక్ వద్ద ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలా చూస్తే ఆటగాళ్ల పూర్తి సామర్థ్యం బయటపడుతుందన్నది నిపుణుల మాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)