భవిష్యత్‌లో బస్సులు కూడా కాఫీ తాగుతాయా?

  • 2 అక్టోబర్ 2017
రోడ్డుపై డబుల్ డెక్కర్ బస్సు Image copyright PA
చిత్రం శీర్షిక త్వరలో లండన్లో కాఫీ వ్యర్థాలతో నడిచే బస్సు అందుబాటులోకి రానుంది.

కాఫీ తాగే అలవాటుందా..? అయితే, కాలుష్యాన్ని తగ్గించడంలో మీరూ పాలుపంచుకుంటున్నట్లే.. ఎందుకంటే భవిష్యత్‌లో పెట్రోలు, డీజిల్ కాకుండా కాఫీతో నడిచే బస్సులు కూడా వస్తున్నాయి.

లండన్‌లోని బయోబీన్ అనే సంస్థ ఇలాంటి బస్సును రూపొందిస్తోంది.

ప్రపంచ దేశాలన్నీ పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా బయటపడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి చేటు చేయని ఇంధనాల కోసం నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి.

బయోబీన్ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్థర్ కే కూడా ఇలాంటి ఆలోచనతోనే కాఫీ వ్యర్థాల నుంచి తయారయ్యే ఇంధనంతో నడిచేలా ఒక బస్సును రూపొందించారు. కొద్ది నెలల్లో ఇది లండన్ రోడ్లపై తిరగనుంది.

బయోబీన్ సంస్థ కోస్టా వంటి ప్రముఖ కాఫీ దుకాణాల నుంచి వాడేసిన కాఫీ గింజలను సేకరిస్తుంది. అలా సేకరించిన కాఫీ వ్యర్థాల నుంచి ద్రవ ఇంధనం తయారుచేస్తుంది.

కాఫీ వ్యర్థాల్లో 15 నుంచి 20 శాతం ఇంధనం వస్తుంది. ఒక్క బ్రిటన్‌లోనే ప్రజలు ఏటా 5 లక్షల టన్నుల కాఫీ గింజలను వినియోగిస్తారు. దాన్నుంచి వచ్చే వ్యర్థాలతో సుమారు 5 లక్షల మంది నివసించే ఒక నగరానికి విద్యుత్ సరఫరా చేయొచ్చని ఆర్ధర్ కే అంటున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శిలాజ ఇంధన వినియోగం పెరగడం వల్ల కాలుష్యమూ పెరుగుతోంది.

స్వీడన్ స్పీడుగా ఉంది

జీవ ఇంధనాల వినియోగంలో స్వీడన్ చాలా ముందుంది. రాజధాని స్టాక్ హోంలో 15 వేల కార్లు, 300 బస్సులు జీవ ఇంధనాలతోనే నడుస్తున్నాయి.

మొదట్లో ఇక్కడ చెరకు నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్ నుంచి జీవ ఇంధనాలను తయారుచేసేవారు. కానీ.. 1990 నుంచి వారు రూటు మార్చారు. మురుగు నుంచి మీథేన్ ఉత్పత్తి చేసి దాన్ని బయోగ్యాస్‌గా వాడుతున్నారు.

ఇప్పుడు ఆహారవ్యర్థాల నుంచి ఇంధనాలు తయారుచేసే దిశగా సాగుతున్నారు.

Image copyright ENVAC
చిత్రం శీర్షిక స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో వ్యర్థాల నిర్వహణ

వ్యర్థాలతోనే నయం

నిజానికి తొలినాళ్లలో చెరకు మాదిరిగానే మొక్కజొన్న, పలు ఇతర పంటలను ఇథనాల్ తయారీకి వినియోగించినా అవి ఆహార పంటలు కావడంతో వాటిని ఇంధనానికి వాడడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అంతేకాదు... ఇంధనం కోసం పంటలు పండించాలంటే పెద్ద ఎత్తున భూమి అవసరమవుతుంది. దీంతో వాడేసిన కాఫీ గింజలు, కుళ్లిన కూరగాయలు వంటి వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేయడంపై అంతా దృష్టి పెడుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాల వినియోగం దిశగా ప్రపంచ దేశాలన్నీ కదులుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే థర్మల్ పవర్ తగ్గుతూ సోలార్ పవర్ పెరుగుతోంది.

విద్యుత్‌తో నడిచే వాహనాల వినియోగమూ ఎక్కువవుతోంది. వాటితో పాటు ఇలాంటి జీవ ఇంధనాలనూ వినియోగించడం వల్ల వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణానికీ మేలు చేసినట్లవుతుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)