మన టీ-షర్టులు మనకన్నా ఎక్కువ దేశాలు తిరిగాయా?

  • 29 జనవరి 2018
పింక్ డ్రెస్/Pink Dress Image copyright Inditex
చిత్రం శీర్షిక ఈ జారా డ్రెస్ షాప్‌లో అమ్మకానికి వచ్చే ముందు కనీసం ఐదు దేశాలు తిరిగింది

''మేడ్ ఇన్ మొరాకో'' అని ఈ పింక్ రంగు జారా షర్ట్ మీద ఉన్న లేబుల్ చెప్తోంది.

ఈ డ్రెస్‌ను చివరిగా కుట్టింది అక్కడే అయినప్పటికీ అది అప్పటికే చాలా దేశాలు దాటేసి వచ్చింది.

నిజానికి ఈ డ్రెస్ మీకన్నా ఎక్కువగా ప్రయాణం చేసి ఉండొచ్చు.

ఈ డ్రెస్‌ను తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ లయోసెల్ నుంచి వచ్చింది. అది పత్తికి మంచి ప్రత్యామ్నాయం. ఈ పీచును తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు ప్రధానంగా యూరప్‌లో ఉంటాయని లెంజింగ్ అనే సంస్థ చెప్తోంది.

ఆస్ట్రియాకు చెందిన ఈ సరఫరా సంస్థ నుంచే జారా యజమాని ఇండిటెక్స్ లయోసెల్‌ను కొనుగోలు చేస్తుంది.

ఈ పీచును తొలుత ఈజిప్టుకు పంపిస్తారు. అక్కడ దానిని నూలుగా ఒడుకుతారు. ఆ నూలును చైనా పంపించి అక్కడ వస్త్రంగా నేస్తారు. ఆ గుడ్డను స్పెయిన్ పంపించి రంగులు వేస్తారు. ఇక్కడ ఉన్న షర్టుకి గులాబీ రంగు వేశారు.

స్పెయిన్ నుంచి ఆ రంగు వస్త్రాలను మొరాకోకి పంపిస్తారు. అక్కడ దానిని కత్తిరించి వివిధ రకాల దుస్తులుగా కుడతారు.

అనంతరం ఈ దుస్తులను తిరిగి స్పెయిన్‌కు పంపిస్తారు. అక్కడ వాటిని ప్యాకేజ్ చేసి బ్రిటన్, అమెరికా సహా ఇండిటెక్స్ షాపులు ఉన్న 93 దేశాలలో ఎక్కడికైనా పంపిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే డ్రెస్‌లు, టీ-షర్టులు, ట్రౌజర్లు వంటి చాలా రకాల దుస్తులు ఇలా సుదీర్ఘ ప్రయాణాలు పూర్తిచేసి మీ దగ్గరకొస్తాయి.

నిజానికి అవి మరింత ఎక్కువగా ప్రయాణం చేసివుండే అవకాశముంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇండిటెక్స్

  • 6,298 ఫ్యాక్టరీలు
  • 1,725 సరఫరాదారులు
  • 7,000+ దుకాణాలు
  • 93 దేశాలు
  • 60% దుస్తులు స్పెయిన్ ప్రధాన కేంద్రంలోనో లేదా దాని సమీపంలోనో తయారవుతాయి

ఆధారం: ఇండిటెక్స్

ఇండిటెక్స్ కొత్త ట్రెండ్లకు వేగంగా స్పందిస్తుందని ప్రసిద్ధి. దీనికి ప్రధాన కారణం ఆ సంస్థ దుస్తులు చాలా వరకూ స్పెయిన్‌లోని ప్రధాన కార్యాలయం వద్దనో లేదా పోర్చుగల్, మొరాకో, టర్కీ వంటి సమీప దేశాల్లోనో తయారవటమే.

దీని ప్రత్యర్థి సంస్థల సరఫరాదారులు దీనికన్నా కొంత దూర దేశాల్లో ఉంటాయి.

అయితే ఈ ఫ్యాషన్ బ్రాండ్లు ఉపయోగించే చాలా ఫ్యాక్టరీలు వాటి సొంత యాజమాన్యంలోని సంస్థలు కావు. వాటిని తమ అధికారిక సరఫరాదారులుగా ఎంపిక చేసుకుంటాయి. ఈ సరఫరాదారులు కూడా గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి వివిధ పనులను ఇతర ఫ్యాక్టరీలకు సబ్-కాంట్రాక్టు ఇస్తుంటాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మీ కాటన్ చొక్కా ప్రపంచాన్ని చుట్టేముందు టెక్సస్‌లోని ఒక పొలం నుంచి బయలుదేరి ఉండొచ్చు

ఈ వ్యవస్థ వల్ల ఏదైనా ఒక వస్తువు నిర్దిష్టంగా ఎక్కడ పుట్టింది అనే వివరాలను తెలుసుకోవడం కష్టమే. మీ బ్రాండుకు చెందిన ఒక సాధారణ టీ-షర్టు ఎక్కడ పుట్టి ఎక్కడ పూర్తయిందనే ప్రయాణ వివరాలను ఉదాహరణగా ఇవ్వాలని హెచ్ అండ్ ఎం, మార్క్స్, స్పెన్సర్, గ్యాప్, ఆర్కేడియా గ్రూప్ వంటి పలు ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్ల సంస్థలను సంప్రదించాం.

కానీ ఇండిటెక్స్ మాత్రమే ఇచ్చిన గడువులోగా స్పందించి సమాచారం ఇవ్వగలిగింది.

''ఈ సంస్థలకు తాము కొనే మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయనే విషయం తెలియకపోవడం వల్ల అవి స్పందించడం లేదని నేను అనుకుంటున్నా'' అని ఎథికల్ కన్స్యూమర్ సంస్థకు చెందిన టిమ్ హంట్ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. సంస్థల సామాజిక, నైతిక, పర్యావరణ ప్రవర్తనను ఈ సంస్థ పరిశోధిస్తుంది.

ఈ కష్టాలు 2013లో రాణా ప్లాజా అనే బంగ్లాదేశ్ దుస్తుల ఫ్యాక్టరీ కుప్పకూలిన విషాదంలో 1,100 మందికి పైగా చనిపోయి, 2,500 మంది గాయపడినప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి.

కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద బ్రాండ్ల సంస్థలకు కూడా తమ దుస్తులు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయన్న విషయం కూడా తెలియదు.

Image copyright Fashion revolution
చిత్రం శీర్షిక #whomademyclothes ఉద్యమం ఫ్యాషన్ సంస్థలు తమ సరఫరాదారుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేలా ఒత్తడి చేయాలని వినియోగదారులను ప్రోత్సహిస్తుంది

క్రిస్టియన్ ఎయిడ్, బాప్టిస్ట్ వరల్డ్ ఎయిడ్ ఆస్ట్రేలియా సంస్థలు ''బిహైండ్ ద బార్‌కోడ్'' అనే పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం 87 భారీ ఫ్యాషన్ బ్రాండ్ల సంస్థల్లో కేవలం 16 శాతం మాత్రమే తమ దుస్తులను ఎక్కడ కుడతారు అనే పూర్తి జాబితాను ప్రచురిస్తాయి. ఇక తమ దుస్తుల్లో ఉపయోగించే జిప్‌లు, బటన్లు, దారాలు, బట్ట ఎక్కడి నుంచి వస్తాయనేది తెలిసింది కేవలం ఐదు శాతం సంస్థలకు మాత్రమే.

రాణా ప్లాజా ఫ్యాక్టరీ విషాదం అనంతరం ఏర్పాటైన ఫ్యాషన్ రివల్యూషన్ అనే స్వచ్ఛంద సంస్థ.. దుస్తుల సంస్థలు తమ సరఫరాదారులు ఎవరనే విషయంలో మరింత పారదర్శకంగా ఉండేలా ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తూ ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది.

యేటా ఆ విషాద సంఘటనను గుర్తు చేస్తూ #WhoMadeMyClothes (#నా దుస్తులను ఎవరు తయారు చేశారు) అనే ప్రచారం నిర్వహిస్తుంది. ఈ విషయంలో సంస్థలపై ఒత్తిడి తెచ్చేలా వినియోగదారులను ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం.

''ఫ్యాషన్ పరిశ్రమ నుంచి వచ్చే భారీ ఉత్పత్తి డిమాండ్లు, ఫ్యాషన్ క్యాట్‌వాక్‌ల నుండి కొత్త ట్రెండ్ దుస్తులను సాధ్యమైనంత వేగంగా దుకాణాలకు తీసుకురావడం కోసం ఇచ్చే అత్యల్ప గడువుల కారణంగా తయారీ ప్రక్రియలు చాలా చాలా గందరగోళంగా మారాయి'' అని ఫ్యాషన్ రివల్యూషన్ సహ-వ్యవస్థాపకురాలు, క్రియేటివ్ డైరెక్టర్ ఒర్సోలా దె క్యాస్ట్రో పేర్కొన్నారు.

''ఒక టీ-షర్ట్ తయారీలో, దానిని కుట్టడం సహా వేర్వేరు దశల్లో చాలా మంది శ్రమ ఇమిడి ఉంటుంది. అసలు చాలా బ్రాండ్లకు తమ ప్రామాణిక ఉత్పత్తులు ఎక్కడ పుట్టాయో, స్టోర్ చేరేంత వరకూ అవి చేసే ప్రయాణమేమిటో తెలియదు'' అని ఆమె వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పీట్రా రివోలి ఒక ఆరు డాలర్ల టీ షర్టు ప్రయాణాన్ని కనుగొనేందుకు అమెరికా నుంచి చైనా, ఆఫ్రికాలకు ప్రయాణించారు

అయినప్పటికీ ఒక దశాబ్దం కిందట పీట్రా రివోలి అనే మహిళ ఫ్లోరిడాలోని ఒక వాల్‌మార్ట్ సేల్ బిన్ నుంచి ఆరు డాలర్లకు కొన్న ఒక కాటన్ టీ-షర్టు ప్రయాణాన్ని తెలుసుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.

టీ-షర్ట్ వెనుక ఉన్న ట్యాగ్‌తో మొదలుపెట్టి అమెరికా నుంచి ఒక్కో అడుగు వెనుకకు సరఫరాదారుల వరుసను తెలుసుకుంటూ వెళ్లడం ద్వారా ఆ టీ-షర్టు ప్రయాణాన్ని తెలుసుకున్నారు.

వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న ప్రొఫెసర్ రివోలి తన అన్వేషణను 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక టీ-షర్టు ప్రయాణం' అనే పేరుతో ఆమె పుస్తకం కూడా రాశారు. స్వేచ్ఛా వాణిజ్యం అన్ని దేశాలకూ ప్రయోజనం కలిగించిందన్న తన అభిప్రాయం మీద పరిశోధన చేయాలని తాను భావించానని ఆమె చెప్పారు.

Image copyright Pietra Rivoli
చిత్రం శీర్షిక అంతర్జాతీయ వాణిజ్యం మీద ఇప్పుడు వస్తున్న వ్యతిరేకతకు రాజకీయ జోక్యం కారణమని పీట్రా రివోలి అంటారు

ఆమె ప్రయాణం టెక్సాస్‌లో పత్తి పండించే ప్రాంతమైన లుబ్బాక్ నుండి మిషన్‌పై ఆ టీ-షర్టును కుట్టిన చైనా వరకూ సాగింది. చివరికి ఆఫ్రికా తూర్పు తీరంలోని టాంజానియాకు ఆమె చేరారు. అక్కడ సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారం బలంగా ఉంది.

ఈ సంక్లిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ వ్యయం, మార్కెట్ శక్తులను బట్టి నడుస్తుందని ఆమె భావించారు. అయితే పెద్ద బ్రాండ్ల కంపెనీలు సరకులను ఎక్కడ కొనుగోలు చేయాలి, దుస్తులను ఎక్కడ తయారు చేయాలి అనే నిర్ణయాలను రాజకీయపరంగానే తీసుకుంటాయని ఆమె నిర్ధారణకు వచ్చారు.

పత్తి పండించే వారికి అమెరికా అందించే వ్యవసాయ సబ్సిడీలు, కార్మికులు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలిరావడాన్ని ప్రోత్సహించే చైనా వలస విధానాలను ఆమె ఉదాహరణలుగా ఉదాహరిస్తున్నారు.

''ఆ టీ-షర్టు కథ, దాని ప్రయాణం అలా ఎందుకు సాగింది అనే దానిపై నాకు తెలిసిందేమిటంటే.. టీ-షర్టును మరింత వేగంగా, మరింత ఉత్తమంగా, మరింత చౌకగా ఎలా తయారు చేయాలనే విషయంలో కంపెనీలు ఎలా పోటీ పడుతున్నాయి అనే దానికన్నా.. అవి రాజకీయ అనుకూలతలను ఎలా ఉపయోగించుకుంటున్నాయో నాకు బాగా అర్థమైంది' అని ఆమె వివరించారు.

అంతర్జాతీయ వాణిజ్యం మీద ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత ఇటువంటి రాజకీయ జోక్యం ఫలితమేనని ఆమె భావిస్తున్నారు.

'ఈ తరహా వినియోగదారుల ఆగ్రహం చివరికి ఫ్యాషన్ సంస్థలలో మార్పు తీసుకురావచ్చు' అని ఆమె చెబుతున్నారు. ఇప్పుడు చాలా సంస్థలు తమ ప్రత్యక్ష సరఫరాదారుల వివరాలు ఇస్తున్నాయని, సరఫరాదారుల సంఖ్యను తగ్గించే దిశగా, దీర్ఘకాలిక సరఫరా సంబంధాలు నెలకొల్పే దిశగా నడుస్తున్నాయని ఆమె పేర్కొంటున్నారు.

''అటూ ఇటూ గంతులు వేయడం కాస్త తగ్గవచ్చు'' అని ఆమె నవ్వుతూ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై విచారణ కమిషన్: నిందితులు పిస్టల్ లాక్కొని దాడికి దిగినా పోలీసులు గాయపడలేదా: సీజేఐ ప్రశ్న

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?

యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత