జన్యుమార్పిడి నుంచి కృత్రిమ మేధ వరకు... 2050 నాటికి ఇవే పెను సవాళ్లు!

  • 8 అక్టోబర్ 2017
జన్యుమార్పిడి Image copyright iStock

రాబోయే 30 సంవత్సరాలలో మనకు ఎటువంటి సవాళ్ళు ఎదురవబోతున్నాయి? వాటిని పరిష్కరించేందుకు గ్లోబల్ ఎజెండా ఏమిటి? దాని గురించి ముందే చెప్పడం చాలా కష్టమే అయినా సైన్స్, టెక్నాలజీ రంగాలలో వస్తున్న మార్పుల ద్వారా వాటిపై ఒక అంచనాకు రావచ్చు. ఇవీ వాటిలో కొన్ని!

జన్యుమార్పిడి

మనిషి డీఎన్ఏను మార్చే టెక్నాలజీపై శాస్త్రవేత్తలలో చర్చలు మొదలయ్యాయి. దీనిని 'క్రిస్పర్' అని అంటారు. దీనిని క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు.

ఆశ్చర్యంగా ఉందా? ఇంకా వినండి. ఈ టెక్నాలజీ ద్వారా "డిజైనర్ బేబీలను".. అంటే పుట్టబోయే బిడ్డ తెలివితేటలు, శారీరక లక్షణాలు ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకోవచ్చని చెబుతున్నారు.

ఇది అంత పెద్ద సవాలేమీ కాదు కానీ కాలక్రమేణా ఇందులో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించే ప్రతి ప్రయోగశాల నైతిక విలువలను పూర్తిగా పాటించాలి. లేకపోతే ఒకరి డీఎన్ఏను మరొకరి డీఎన్ఏలో కలుపుతూ కొత్త సమస్యలు సృష్టించవచ్చు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వరదలూ సునామీలతో జనజీవనం బాగా ప్రభావితమవుతోంది

వృద్ధుల జనాభా

నేడు వృద్ధుల జనాభా ఎన్నడూ లేనంతగా పెరుగుతోంది. ప్రజలు ఎక్కువ కాలం బతుకుతున్నారు. ఇది మంచి విషయం. వంద సంవత్సరాల వయస్సు గల వారి జనాభా కూడా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఇప్పుడు వందేళ్ల వయస్సు దాటినవారు 5 లక్షల మంది ఉన్నారు.

రాబోయే 80 సంవత్సరాలలో, అంటే 2100 నాటికి వీరి సంఖ్య 2.6 కోట్లకు చేరుతుంది. బ్రిటన్ నుండి జపాన్, చైనాల వరకూ ప్రతీ చోటా 65 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్నవారి సంఖ్య పెరుగుతుంది. వారి బాగోగులు చూసేందుకు జపాన్‌లో ఇప్పుడు రోబోలు కూడా వచ్చేశాయి.

ఇప్పటికే జనాభా పెరుగుతున్న కొద్దీ నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే, పట్టణాలలో వలస ఇలాగే పెరిగిపోతే ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు, సేవలు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది.

పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం

గత దశాబ్దంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన సంభాషణ విధానమే మారిపోయింది. చాలా మంది సోషల్ మీడియా ద్వారానే సమాచారాన్ని పొందుతున్నారు. మరికొందరు ఇదే సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురవుతున్నారు. రాబోయే 30 సంవత్సరాలలో సోషల్ మీడియా ప్రభావం మనపై ఎలా ఉండబోతోందో చూద్దాం.

ఇప్పుడు ప్రపంచంలో ప్రైవసీ అనేదే లేకుండా పోయింది. ఇంటర్నెట్ వేదికగా వేధింపులు, బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలను నియంత్రించడం సోషల్ మీడియా కంపెనీలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జనాభా పెరుగుతున్నకొద్దీ నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది

పెరుగుతున్న సముద్ర మట్టాలు

సముద్ర మట్టాలు పెరగడం వల్ల ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉంది. సముద్ర తీరప్రాంతాలు ముందుకు రావడం వల్ల చాలా నగరాలు మాయమవుతాయి. వాతావరణ మార్పు వల్ల నేడు వరదలు సాధారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచానికి ప్రమాదం తప్పదు. ఎన్నో నగరాలు, ద్వీపాలు, బంగ్లాదేశ్ వంటి లోతట్టు ప్రాంతాలు కనుమరుగైపోతాయి. ఆర్థికంగా చాలా ప్రాంతాలు నష్టపోతాయి. వాతావరణ మార్పు వల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో శరణార్థులుగా మారిపోతారు.

ఇప్పుడు 'ఫేక్ న్యూస్' రూపంలో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకవేళ ప్రజలు ఫేక్‌న్యూస్‌నే నిజమని భావించి, దాన్నే అనుసరిస్తే సమాజం పై భవిష్యత్తులో అది సమాజంపై ఏ రకంగా ప్రభావం చూపుతుందనే విషయం పెద్ద సవాలుగా మారింది.

ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా చోట్ల ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణం ప్రపంచ శాంతి, స్థిరత్వంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించటం, వేలాది శరణార్థులు తమ దేశాలను విడిచిపెట్టడం, హ్యాకర్లు ఇతర దేశాల ఎన్నికలలో జోక్యం చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన తీవ్రవాదం ఇవన్నీ ప్రపంచంలో అలజడిని పెంచి శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. హ్యాకింగ్ పెరిగిపోవడం, అణు క్షిపణులు, ఇతర ప్రమాదకరమైన సాంకేతికత వంటివన్నీ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రైవసీ తగ్గిపోతోంది

సురక్షిత కారు ప్రయాణం

ఒక పక్క పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా, బుల్లెట్ ట్రైన్ల వినియోగం పెరుగుతున్నా, హైపర్‌లూప్ వంటి అద్భుతమైన సాంకేతికతపై చర్చ జరుగుతున్నా, మరో పక్క కార్ల వినియోగం తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంది. రాబోయే కాలంలో మరిన్ని కార్లు రోడ్లపైకి వస్తాయి.

ఇప్పుడయితే డ్రైవర్ లేని కార్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రధాన సాంకేతిక సంస్థలు, వాహన తయారీ కంపెనీలు రాబోయే సంవత్సరాల్లో మానవ రహిత వాహనాలను ప్రవేశ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒక వైపు పెరుగుతున్న మధ్యతరగతి, పర్యావరణ అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెరుగుతున్న జనాభా వీటి మధ్య డ్రైవర్ లేని కార్ల వ్యవహారం రక్షణ కోణంలో చూస్తే ఒక పెద్ద సవాలే. ప్రయాణికుల భద్రత, కాలుష్య నివారణ, రహదారిపై భారీ ట్రాఫిక్ మధ్య ఈ డ్రైవర్ లేని కార్లు ఎలాంటి పరిస్థితిని సృష్టిస్తాయనేది పెద్ద ప్రశ్నే.

Image copyright Getty Images

తగ్గుతున్న సహజ వనరులు

21వ శతాబ్దం టెక్నాలజీ శతాబ్దం. ఒక అంచనా ప్రకారం ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి భూమి లోపల ఉండే 60కి పైగా అరుదైన లోహాల అవసరం ఉంటుంది. అంటే అది సహజ వనరులపై ఒత్తిడి పెంచడమే అవుతుంది. ప్రపంచంలో ఉన్న అరుదైన లోహాలలో 90% కలిగివున్న చైనా రాబోయే రెండు దశాబ్దాల్లో వాటిని కోల్పోనుంది.

ఇతర గ్రహాలలో నివాసం

అంతరిక్ష పర్యాటక సంస్థలు వారి కార్యాకలాపాలు సురక్షితమయినవని ఎలా చెప్పగలరు? మనుషులు ఎలా అంగారక గ్రహాలపైకి వెళ్ళి ఉండగలరు? ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మానవులు భూమిని వదిలి అక్కడికి వెళితే వారు మరో కొన్ని లక్షల సంవత్సరాలు బతకగలరని అంటారు. అంతరిక్ష పర్యాటక సంస్థలకు, కోటీశ్వరులకు అంతరిక్ష ప్రయాణం, అక్కడ నివాసం బాగా అనిపించవచ్చు. కానీ అది ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చే కొద్దీ కొత్త కొత్త సవాళ్ళు ఎదురవుతాయి.

Image copyright NASA

మెదడుకు 'హుషారు'నిచ్చే పదార్థాలు

మెదడు శక్తిని పెంచడానికి నేడు డ్రగ్స్ వాడకం సాధారణమయిపోయింది. కాఫీ లేదా ఇతర పదార్థాల వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు ఔషధ తయారీదారులు మన శక్తికి మించి ఆలోచించగలిగే మందులను తయారు చేస్తున్నారు. ఇంకా టెక్నాలజీ కంపెనీల ఇంప్లాంట్లు మనకు సాధారణ సామర్థ్యం కంటే ఇంకా ఎక్కువగా కేంద్రీకరించగలిగే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల్లో దీని పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇవి పని చేస్తాయనుకున్నా వీటిని కొనగలిగే స్తోమత ఎందరికి ఉంటుంది? ఇది పేదా, ధనిక తేడాలను మరింతగా పెంచదా? ఇలాంటి ప్రయోగాల వెనకున్న నైతిక, చట్టపరమైన అంశాలు కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

మానవ జీవితంలో కృత్రిమ మేధ ఆధిపత్యం

రాబోయే కాలంలో మన జీవితం పై కృత్రిమ మేధస్సు ప్రభావం ఎంత వరకూ ఉండబోతోంది? దీనిపై ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త, ఫ్యూచరిస్ట్ రే కుజ్జ్వెల్ కొన్ని అంచనాలు చేశారు. కుజ్జ్వెల్ అంచనా ప్రకారం కృత్రిమ మేధ ఏదో ఒక రోజున మానవ మేధస్సును దాటిపోతుంది. అయితే కొందరు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య రంగంతో పాటు, ఆర్థిక, సేవా రంగాలలో దీని వినియోగం పెరగనుంది. తద్వారా కృత్రిమ మేధ మరిన్ని పరిమితులను విధించే అవకాశం ఉంది. కనుక కృత్రిమ మేధను అభివృద్ధి చేసే వారు నైతిక మరియు సాంఘిక ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని దానిని అభివృద్ధి చేయాలి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)