సోషల్ మీడియా: పొగ, మద్యం, డ్రగ్స్ కన్నా దారుణం

చేతుల్ని కట్టేసిన మొబైల్ వైరు

ఫొటో సోర్స్, iStock

ఇంటర్నెట్ లేనప్పుడో, లేదా మరే ఇతర కారణంతోనో సోషల్ మీడియాకు దూరంగా ఉంటే విసుగొస్తోందా? ఆఫీస్‌లో త్వరగా పని ముగించుకుని సోషల్ మీడియా ఉపయోగిస్తూ టైం పాస్ చేయాలని ఉందా? అయితే మీరు డిజిటల్ చికిత్స చేయించుకోవాలి.

ఎందుకంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియా బాధితులు. ఇదో వ్యసనం. ఎంత పెద్ద వ్యసనమంటే ఇది మద్యపానం కన్నా, డ్రగ్స్ తీసుకోవడం కన్నా దారుణం.

సోషల్ మీడియాకు దూరంగా ఉండలేమనే భావన తీవ్రంగా ఉండేవాళ్ళు ఇప్పుడు చికిత్స కోసం పరుగెడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వ్యసనం నుండి బయటపడాలనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సోషల్ మీడియా వ్యసనంపై కౌన్సిలింగ్ ఇచ్చే డాక్టర్లు అందుబాటులోకి వచ్చేశారు.

సోషల్ మీడియా విపరీతంగా ఉపయోగించేవారు ఇప్పుడు ఈ వ్యసనం నుండి బయట పడాలని ఈ వైద్యుల వద్దకు వెళుతున్నారు. చికిత్స కోసం వేల రూపాయల ఛార్జి చెల్లించాల్సి ఉన్నా వెనుకాడటం లేదు.

internet

ఫొటో సోర్స్, Getty Images

"ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి డ్రైవింగ్ చేయిస్తూనో లేదా ఈతకొట్టిస్తూనో చికిత్స అందిస్తున్నాం." అని అమెరికాలోని కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్ ప్రాంతంలో ఉన్న మీడియా సైకాలజీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ పమేలా రూట్లెడ్జ్ తెలిపారు. సామాజిక సంబంధాలను మెరుగుపరచుకుంటూ.. కొత్త విషయాలు నేర్చుకొంటూ ఈ సమస్యను అధిగమించగలమని ఆమె పేర్కొన్నారు.

అమెరికాలో సోషల్ మీడియా వ్యసనం 20 శాతం పెరిగిందని టెక్సస్‌కు చెందిన థెరపిస్ట్ నాథన్ డ్రిస్కెల్ తెలిపారు. తమ వద్దకు వచ్చే వారు ఎక్కువగా సోషల్ మీడియా వ్యసనంతో పాటు గేమ్స్ ఆడే వ్యసనం నుండి కూడా బయట పడాలని కోరుకుంటున్నారని అన్నారు.

ఇంటర్నెట్

ఫొటో సోర్స్, Getty Images

ఇది రోగం కాదు

సోషల్ మీడియా వ్యసనం మానసిక రోగమని ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. అయినా సరే సోషల్ మీడియా వ్యసనంతో బాధపడే వారికి చికిత్స అందించే థెరపిస్టులు పెరుగుతున్నారు. ఇతర వ్యసనాలతో బాధపడే వారికి అందించే చికిత్స తరహాలోనే సోషల్ మీడియా వ్యసనంతో బాధపడేవారికి కూడా చికిత్స అందిస్తున్నామని డ్రిస్కెల్ తెలిపారు.

కొన్నిసార్లు ఫేస్‌బుక్, స్నాప్ చాట్ లాంటి సామాజిక మాధ్యమాలు మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతో చికిత్స ఇతర వ్యసనాల చికిత్స కంటే మరింత కష్టంగా ఉంటుందని డ్రిస్కెల్ అన్నారు.

సోషల్ మీడియా వ్యసనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సోషల్ మీడియాపై చాలా ఎక్కువ సమయం గడిపితే మనలో ఉన్న భావాలు అంతమైపోతాయి

"ఈ వ్యసనం మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం కన్నా ప్రమాదకరం. ఎందుకంటే ఈ వ్యసనం పెరుగుతూనే ఉంటుంది. దీనికసలు హద్దే ఉండదు. ఇది తప్పు అని కూడా చాలా మంది భావించరు" అని పేర్కొన్నారు. డ్రిస్కెల్ తన దగ్గర చికిత్స కోసం వచ్చే వారి నుండి గంటకు 150 డాలర్ల చొప్పున.. అంటే దాదాపు 10 వేల రూపాయలు చార్జ్ చేస్తాడు.

ఇలాంటి వ్యసనాల చికిత్స కోసం ఇప్పుడు న్యూయార్క్‌లో స్టార్ట్-అప్ కంపెనీలు కూడా వచ్చేశాయి. ఇందులో భాగంగానే "టాక్ స్పేస్" అనే స్టార్ట్ అప్ కంపెనీ 2016లో మొదలైంది. ఈ కంపెనీ 12 వారాల "సోషల్ మీడియా ప్రోగ్రామ్" ప్రవేశపెట్టింది. ఈ చికిత్సతో బాధితులకు వివిధ కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసాన్ని అందిస్తామని ఈ సంస్థ తెలిపింది.

సహాయం ఇలా కూడా

లండన్ లో ఒరియానా ఫీల్డింగ్ సోషల్ బాధితుల కోసం 2014లో ఒక కంపెనీని స్థాపించారు. ఇప్పుడు మరికొన్ని కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఆ కంపెనీలు తమ తమ ఉద్యోగులను సోషల్ మీడియా వ్యసనం నుండి దూరంగా ఉంచేందుకు ఫీల్డింగ్ కోర్సుల సహాయం తీసుకుంటున్నాయి. ఈ కోర్సులో కొన్ని వీడియోలుంటాయి. ఆ వీడియోల్లో సోషల్ మీడియా వ్యసనానికి గురికాకుండా దానిని ఎలా ఉపయోగించాలో చెబుతాయి.

స్మార్ట్ ఫోన్‌తో యువతి / Girl with smartphone

ఫొటో సోర్స్, Getty Images

సొంతంగా మార్పు రాదా?

సోషల్ వ్యసనానికి సొంతంగా చికిత్స చేసుకునేలా చేస్తామని కొన్ని కంపనీలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. బెర్లిన్‌లో "ఆఫ్ టైం" అనే కంపనీ ఈ కోవలోకే వస్తుంది. ఈ స్టార్ట్ అప్ కొన్ని అప్లికేషన్ల ద్వారా సొంతంగా చికిత్స చేసుకునే సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ నేరుగా మాట్లాడి చికిత్స అందించే సదుపాయం కూడా కల్పిస్తోంది.

‘‘ఎవరో వచ్చి సోషల్ మీడియా వ్యసనం ఉందని చెప్పేదానికన్నా సొంతంగా మనమే మన జీవన శైలిని మార్చుకోవడమే ఉత్తమం’’ అని సైకాలజిస్ట్ అలెగ్జాండర్ స్టెయిన్ హార్ట్ అన్నారు. ‘‘మన జీవన శైలి సరిగా ఉందో లేదో తెలుసుకోవాలి. మంచి టెక్నాలజీ అలవాట్లు అలవర్చుకోవాలి. టెక్నాలజీని అందుకోవడం తప్పు కాదు కానీ దానికన్నా ముందు వినియోగంలో బ్యాలెన్స్ పాటించాలి’’ అని ఆయన చెప్పారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)