మహిళల పీరియడ్స్: నెలసరి సింక్ సిద్ధాంతం నిజమేనా?

  • 2 అక్టోబర్ 2017
మహిళలలో ఒకేసారి పీరియడ్స్ Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక సింక్ అవుతున్న భావన.. కానీ అది కేవలం భావన మాత్రమే కావచ్చు

రుతుస్రావం.. ఇప్పటికీ చాలా దేశాల్లో బాహాటంగా మాట్లాడని విషయం. నెలసరి విషయంలో అనేక అపోహలు, మూఢనమ్మకాలు, నిషేధాలతో పాటు, కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి.

ఒక ఇంట్లో ఉండే మహిళలలో నెలసరి ఒకేసారి అవుతుందనేది వాటిలో ఒకటి.

ఫెరొమోన్స్ పరస్పర స్పందన వల్ల వారిలో రుతుచక్రం ఒకేసారి వస్తుందనేది ఒక సిద్ధాంతం. ఇది నిజమని చాలా మంది మహిళలు నమ్ముతారు.

24 ఏళ్ల ‘ఎమ్మా’ యూనివర్సిటీలో ఐదుగురు అమ్మాయిలతో కలిసుండేవారు. కొద్ది నెలలలోనే వారందరికీ పీరియడ్స్ ఒకేసారి రాసాగాయి. వారందరూ ఒకేసారి టాంపూన్స్ కొనేవారు. వారంతా ఒకే సమయంలో మూడీగా మారిపోయే వారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బయోకల్చరల్ ఆంథ్రొపాలజీ బోధించే అలెగ్జాండ్రా ఆల్వెర్జన్ దీని వెనుక కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.. 'ఇది ప్రజలలో పాతుకుపోయిన విశ్వాసం' అంటారామె.

Image copyright iStock

1971లో ‘నేచర్’ సైన్స్ జర్నల్‌లో ఈ అంశంపై పరిశోధన ఫలితాలు ప్రచురించారు. మార్థా మెక్‌క్లింటాక్ అనే పరిశోధకురాలు అమెరికాలోని ఒక కళాశాలకు చెందిన 135 మంది మహిళల రుతుక్రమాన్ని అధ్యయనం చేశారు.

దీని ఆధారంగా.. ఒకే చోట ఉండే మహిళలలో ఫెరొమోన్స్ పరస్పరం ప్రభావితం కావడం దీనికి కారణమని మార్థా సిద్ధాంతీకరించారు.

1970 దశకంలో ఈ పరిశోధన పత్రం విడుదలైన సమయంలో ప్రపంచంలో ఫెమినిజం ఒక ముఖ్యమైన ఉద్యమంగా ముందుకు వచ్చింది. ఈ సిద్ధాంతానికి బలం చేకూరడానికి ఇది కూడా ఒక కారణమని అలెగ్జాండ్రా అభిప్రాయం.

'కొన్నిసార్లు ఈ సిద్ధాంతం వెనుక సామాజిక విలువలూ దాగున్నాయని నాకనిపిస్తుంది. ఫెమినిస్టు దృక్పథం ప్రకారం, మగ పెత్తనాన్ని ఎదుర్కోవడానికి మహిళలు సహకారం ప్రాతిపదికన దీన్ని ముందుకు తెచ్చి ఉండొచ్చనే సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది' అని ఆమె అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నెలసరి సింక్ సిద్ధాంతం 1970వ దశకంలో ఫెమినిజం ఆవిర్భావానికి ప్రతిఫలమా?

మానవులు, ఇతర క్షీరదాలపై జరిపిన వేరే పరిశోధనల్లోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి.

అయితే, ఇలా నెలసరి సింక్ కావటానికి తగిన రుజువులేవీ లేవని తేల్చిన అధ్యయనాలూ ఉన్నాయి. గతంలో చేసిన పరిశోధనలలో లోపాలను కొందరు బయటపెట్టారు.

అధ్యయనానికి ఎంపిక చేసినవారి విషయంలో లోపాలున్నట్టు విమర్శకులు గమనించారు. వారిలో నెలసరి ఎప్పటి నుంచి సింక్ కావడం మొదలైందనే నిర్వచనం కూడా బలహీనంగా ఉందని వారన్నారు.

1971లో మార్థా చేసిన అధ్యయనంలో మహిళలలో రుతుచక్రం సింక్ కావడమనేది యాదృచ్ఛికం కావచ్చనే అంశాన్ని పట్టించుకోకపోవడం ప్రధానమైన లోపమన్నది విమర్శకుల మాట.

Image copyright iStock

‘ఆ విషయంలో నేను ఒక టీమ్ ప్లేయర్’

'నెలసరిలో ఉన్న ఏ మహిళతో కొద్ది సేపు గడిపినా నాకు పీరియడ్ మొదలవుతుంది' అంటారు 26 ఏళ్ల ఇనేజ్. తన గర్భం ఒక పెద్ద టీమ్ ప్లేయర్ అని ఆమె చమత్కరిస్తారు. తన స్నేహితురాలు సుజేన్ విషయంలోనూ ఇలానే జరుగుతుందని ఆమె చెప్తారు.

కానీ తన రూమ్మేట్లతో మాత్రం తనకు ఇలా సింక్ కాదని చెప్పడంతో ఇనేజ్ సిద్ధాంతం వీగిపోతుంది.

మహిళలలో నెలసరి కలిసి రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అలెగ్జాండ్రా అంటారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 'నెలసరిలో ఉన్న ఏ మహిళతో కొద్ది సేపు గడిపినా నాకు పీరియడ్ మొదలవుతుంది'

అయితే పీరియడ్స్ ఇలా ఒకేసారి రావడాన్ని యాదృచ్ఛికంగానే భావించాలని ఇటీవల కొందరు పరిశోధకులు నిర్ణయించారు. సమీప బంధువులు, తోబుట్టువులకు సంబంధించిన ఆరేళ్ల డాటాను పరిశీలించిన తర్వాత వారీ నిర్ణయానికి వచ్చారు.

పీరియడ్స్ సింక్ కావడం విషయంలో భవిష్యత్తులోనూ మరిన్ని పరిశోధనలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మాత్రం చాలా మంది పరిశోధకులు దీనిపై అనుమానాలతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు