పంగ్యే-రి పర్వత సొరంగాల్లో ఉత్తర కొరియా అణు పరీక్షలు

ఉత్తర కొరియాలోని పంగ్యే-రి అణు పరీక్ష కేంద్రానికి చెందిన ఈ డిజిటల్ గ్లోబ్ సాటిలైట్ చిత్రాన్ని 2013 ఫిబ్రవరి 11న తీశారు.

ఫొటో సోర్స్, Reuters

ఉత్తర కొరియా 2006 నుండి ఇప్పటివరకూ ఆరు అణుపరీక్షలు జరిపింది. ఇందుకు ప్రతిసారీ పంగ్యే-రి పరీక్షా కేంద్రాన్నే ఉపయోగించింది.

ఈశాన్యంలో పర్వతసానువుల్లో గల ఈ స్థావరాన్ని ఉత్తర కొరియా ప్రధాన అణు కేంద్రంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో క్రియాశీలంగా ఉన్న ఏకైక అణు పరీక్షా కేంద్రం ఇదే.

ముఖ్యంగా ఈ కేంద్రానికి సంబంధించిన సాటిలైట్ చిత్రాలు, ఈ ప్రాంతంలో పరికరాల కదలికలను పసిగట్టే చిత్రాల ఆధారంగానే నిపుణులు దీని గురించి అంచనా వేయగలుగుతున్నారు.

మరి మనకు తెలిసిందేమిటి?

పంగ్యే-రి కేంద్రానికి సమీపంలోని మౌంట్ మాంటాప్ అనే పర్వతం కింద తవ్విన సొరంగాల వ్యవస్థలో అణు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ దేశం మరో అణు పరీక్షకు సిద్ధమవుతోందా అనేది పసిగట్టడం కోసం ఈ సొరంగాల తవ్వకాల వ్యవహారాలను పరిశీలకులు అధ్యయనం చేస్తున్నారు.

సెప్టెంబర్ 3వ తేదీన అణు పరీక్ష నిర్వహించడానికి ముందు.. ఆగస్టులో సేకరించిన సాటిలైట్ చిత్రాలు ఈ కేంద్రం పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని కొందరు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Geoeye

ఫొటో క్యాప్షన్,

అణు పరీక్ష జరగబోతోందని పేలుడుకు కొన్ని రోజుల ముందటి సాటిలైట్ చిత్రాలు సూచించాయి

ఈ ఏడాది ఆరంభంలో సొరంగాల తవ్వకం పనులు పెరిగాయని, ఒక సొరంగం వెలుపల గుర్తుతెలియని సామగ్రి ఉంచారని గుర్తించారు.

సొరంగం అడుగున లోతైన ప్రాంతంలో పరీక్షా సామగ్రిని పాతిపెడతారు. అణుధార్మికత లీకవకుండా సొరంగాన్ని మళ్లీ మూసేసి ఆ సామగ్రిని పేల్చుతారు.

సమీపంలో ఏముంది?

ఉత్తర కొరియాలోని ఈ పరీక్షా కేంద్రానికి సమీపంలో నివసించే ప్రజల గురించి ఎక్కువ వివరాలు తెలియవు. సరిహద్దులో ఉన్న చైనా నగరాలు, పట్టణాల గురించిన వివరాలే ఎక్కువ తెలుసు.

అణు పరీక్ష నిర్వహించిన సమయంలో భూగర్భంలో కదలికల వల్ల పుట్టిన ప్రకంపనలు తమ వరకూ వచ్చాయని సరిహద్దులోని చైనా నగరాలు కొన్ని ప్రకటించాయి.

ఉత్తర కొరియా సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న యాంజీ నగరంలో భూప్రకంపనలతో ఆందోళన చెందిన స్కూల్ విద్యార్థులు ఆరుబయటకు పరుగులు తీశారని గ్లోబల్ టైమ్స్ కథనం.

ఈ పరీక్షా కేంద్రానికి అతి సమీపంలోనే పంగ్యే-రి గ్రామం ఉంది. ఉత్తర కొరియాకు చెందిన చోంగ్జిన్ నగరం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారా లేక ముందస్తుగా ఏ రకమైన జాగ్రత్తలు, హెచ్చరికలు జారీ చేశారా అన్నది తెలియదు.

అణుధార్మికత ప్రమాదం నిజంగా ఉందా?

తాజా పరీక్ష నిర్వహించినపుడు అణుధార్మికత ఏదీ లీకవలేదని ఉత్తర కొరియా పేర్కొంది.

ఈ పరీక్షలు జరిగిన వెంటనే చైనాకు చెందిన అణు భద్రత పరిపాలన, దక్షిణ కొరియాకు చెందిన భద్రత, రక్షణ కమిషన్‌లు అణుధార్మికతను పసిగట్టేందుకు అత్యవసర పర్యవేక్షణ చర్యలు చేపట్టాయి.

ఉత్తర కొరియా అణు పరీక్షలో న్యూక్లియర్ రియాక్షన్ ఫలితంగా వాతావరణంలోకి రేడియోన్యూక్లైడ్స్ విడుదలయ్యాయని, 2013లో నిర్వహించిన మరొక అణు పరీక్షకూ వీటికీ లింకు ఉందని.. ఆ దేశపు అణు కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించే 38 నార్త్ అనే విశ్లేషణ సంస్థకు చెందిన నిపుణులు వివరించారు.

అలాగే రెండో భూకంప సంబంధిత ఘటనను కూడా వారు ప్రస్తావించారు. అణు పరీక్ష నిర్వహించినపుడు తొలి భూకంప ఘటనను సెన్సర్లు గుర్తించిన కొద్ది నిమిషాల తర్వాత మరొక చిన్న ఘటన కూడా సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 4.6 గా నమోదైంది.

అణు పరీక్ష కేంద్రం వద్ద సొరంగం కూలిపోయి ఉండొచ్చునని, అలాంటి ఘటన రేడియోన్యూక్లైడ్ వాయువు విడుదల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు.

గతంలో నిర్వహించిన అణు పరీక్షల తర్వాత పొరుగు దేశాల్లో అణుధార్మిక అణువులు, వాయువులు స్వల్ప మొత్తంలో విడుదలైనట్లు అధికారులు సాధారణంగా చెప్పేవారు. అయితే ఉత్తర కొరియా లోపల ఈ స్థాయిలను లెక్కించే దారి లేదు.