వింత అలవాట్లతో తెలివొచ్చేస్తుందా?

  • జారియా గోర్వెట్
  • బీబీసీ
ఐన్‌స్టీన్/Einstein

ఫొటో సోర్స్, Science Photo Library

పది గంటలకు పైగా నిద్ర పోవడం, సాక్సులు వాడకపోవడం... ఈ అలవాట్లేనా ఆయన జీనియస్‌ కావడం వెనుకున్న సీక్రెట్స్?

ప్రఖ్యాత పరిశోధకుడు, భౌతికశాస్త్రవేత్త నికోలా టెస్లా రోజూ రాత్రి కాలి వేళ్లతో కసరత్తు చేసేవాడట. ఒక్కో కాలి వేళ్లను వరుసగా 100 సార్లు 'స్క్విష్' చేస్తానని ఆయన తనతో చెప్పినట్లు మార్క్ జె సీఫర్ అనే రచయిత పేర్కొన్నారు.

ఆయన ఆ కసరత్తు ఎలా చేసేవారో మనకు స్పష్టంగా తెలీదు కానీ తన మెదడు కణాలను ఉత్తేజపరచడానికి అది సాయపడిందని టెస్లా అన్నారట.

20వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్దోస్ వేరే రకం ఉత్ప్రేరకాన్ని ఎంచుకున్నారు. అది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించే యాంఫిటామైన్ అనే ఔషధం. 20 గంటల పాటు అంకెలతో కుస్తీపట్టేటపుడు ఆయన దీనిని ఉపయోగించేవారట. దీనిని వాడకుండా నెల రోజులు ఉండలేవని పాల్ స్నేహితుడొకరు 500 డాలర్ల పందెం కట్టారట. ఆ పందెంలో పాల్ నెగ్గారు. కానీ 'నువ్వు గణితాన్ని నెల రోజులు వెనక్కు నెట్టేశావు' అంటూ ఆయన తన స్నేహితుడిని తప్పుపట్టారు.

ఇక బ్రహ్మచర్యం ప్రయోజనాల గురించి న్యూటన్ చాలానే చెప్పారు. ఆయన 1727లో చనిపోయే నాటికి భౌతిక ప్రపంచం గురించిన మన అవగాహననే మార్చివేశారు. కోటి పదాల రాత ప్రతులు మనకు మిగిల్చివెళ్లారు. అయితే మరణించేనాటికి ఆయన అన్ని రకాలుగానూ వర్జినే. (టెస్లా కూడా బ్రహ్మచారే. కాకపోతే ఆయన ఒక పావురంతో ప్రేమలో పడ్డానని ఆ తర్వాత చెప్పారు.)

ప్రపంచంలో అత్యద్భుతమైన శాస్త్రవేత్తలు చాలా మంది అంతే ఆశ్చర్యకరంగా వింత మనుషులు కూడా. బీన్స్‌ పై పైథాగరస్ నిర్ద్వంద్వ నిషేధం నుంచి బెంజమిన్ ఫ్రాంక్లిన్ నగ్న 'వాయు స్నానా'ల వరకూ.. గొప్పదనానికి మార్గం నిజంగా వింతైన అలవాట్లతో సాగింది.

ఇలాంటి విషయాలు ఆసక్తిగా ఉన్నా అర్థరహితమని కొట్టేయడం పరిపాటి. కానీ వీటి వెనుక లోతైన అంశాలుంటే? మేధస్సు అనేది మనం మామూలుగా భావిస్తున్నట్లు కేవలం జన్యుపరమైన అదృష్టం కాదని పరిశోధకులు కనుగొంటున్నారు. ఆధారాల తాజా విశ్లేషణ ప్రకారం.. పెద్దయ్యాక మేధావులను, మందబుద్ధులను వేరు చేసే అంశాల్లో 40 శాతం మన చుట్టూ వాతావరణానికి సంబంధిచినవే.

మీకు నచ్చినా నచ్చకపోయినా, మన రోజు వారీ అలవాట్లు మన మెదళ్ల మీద బలమైన ప్రభావం చూపుతాయి. మెదళ్ల నిర్మాణాన్ని రూపొందించడంలో మనం ఆలోచించే పద్ధతిని మార్చడంలో వాటి పాత్ర చాలా ఉంది.

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్,

మనకు ఎప్పటికీ తెలియదు, బహుశా ఫొటోలో కనిపించడం లేదేమో, నికోలా టెస్లా తన కాలివేళ్లను స్క్విష్ చేస్తుండొచ్చు

చరిత్రలోని గొప్ప మేధావుల్లో.. గొప్ప మేధస్సుతో అసాధారణ అలవాట్లను కలగలిపిన ప్రవీణుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అనడంలో సందేహం లేదు. మన మేధస్సును పెంచుకోవడానికి మెదడుకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడే కిటుకులు తెలుసుకోవడానికి ఇంతకంటే ఉత్తమ వ్యక్తి ఎవరుంటారు? అణువుల నుంచి శక్తిని పిండటం ఎలా అనేది ఆయన మనకు బోధించారు.

అలాగే అశాశ్వతమైన మన చిన్నచిన్న మెదళ్ల నుంచి మంచి తెలివితేటలను పొందడం ఎలాగో రెండు మూడు చిట్కాలు కూడా ఆయన చెప్తారేమో మరి. ఐన్‌స్టీన్ నిద్ర, ఆహారం, ఫ్యాషన్‌లను అనుసరిస్తే ఏమైనా లాభాలుంటాయా!?

10 గంటల నిద్ర... ఒక సెకను కునుకు

మన మెదడుకి నిద్ర చాలా మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఐన్‌స్టీన్ ఈ సలహాని చాలా సీరియస్‌గా పాటించారు. ఆయన రోజుకు కనీసం 10 గంటల పాటు నిద్రపోయేవారని చెప్తారు. ఇది నేడు సగటు భారతీయుడి సగటు నిద్రా సమయం (సుమారు 6.30 గంటలు) కన్నా దాదాపు 3:30 గంటలు ఎక్కువ. మరి మీ మెదడు పదునుదేరడం కోసం మీరూ ఇలా మొద్దు నిద్రపోగలరా?

ఆవర్త క్రమపట్టిక, డీఎన్ఏ నిర్మాణం, ఐన్‌స్టీన్ విశిష్ట సాపేక్ష సిద్ధాంతంతో సహా మానవ చరిత్రలో చాలా విప్లవాత్మక ఆవిష్కరణలన్నీ సదరు ఆవిష్కర్తలు అపస్మారకంగా ఉన్నప్పుడే తట్టాయని కూడా చెప్తుంటారు. ఐన్‌స్టీన్ ఆవుల గురించి కల కంటున్నపుడు ఆయనకు విశిష్ట సాపేక్ష సిద్ధాంతం తట్టిందట. ఇది నిజంగా నిజమా?

2004లో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ల్యూబెక్ శాస్త్రవేత్తలు ఈ విషయం మీద చిన్న ప్రయోగం చేశారు. మొదట కొందరు వలంటీర్లకు ఒక నంబర్ గేమ్ ఆడటంలో శిక్షణనిచ్చారు. చాలా మంది సాధన ద్వారా దాని కిటుకు తెలుసుకున్నారు. కానీ ఇందులోని అంతర్గత నియమాన్ని తెలుసుకోగలిగితే ఇంకా వేగంగా రాణించవచ్చు. ఆ విద్యార్థులను ఎనిమిది గంటల తర్వాత మళ్లీ పరీక్షించినపుడు.. నిద్రపోకుండా మెలకువగా ఉన్న వారికన్నా నిద్రపోయిన వారు రెండు రెట్లు అధికంగా ఆ నియమాలను తెలుసుకోగలిగారు.

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్,

భౌతికశాస్త్రవేత్త నీల్స్ బోర్‌తో ఐన్‌స్టీన్ కాలక్షేపం

మెదడులో లోతైన నిర్మాణాల నుంచి ర్యాపిడ్ ఫైరింగ్ ద్వారా జనితమైన విద్యుత్ శక్తి తరంగాలతో ఈ స్పిండిల్ ఈవెంట్లు మొదలవుతాయి. ఇందులో ప్రధాన ముద్దాయి.. మెదడులో ప్రధాన 'స్విచ్ కేంద్రం'గా పనిచేసే అండాకార ప్రాంతమైన పర్యంకం (థాలమస్). అది తనకు చేరే సంవేదనాత్మక సందేశాలను సరైన దిశలో పంపించే పని చేస్తుంది.

మనం నిద్రలో ఉన్నపుడు అది అంతర్గత చెవి బిరడాగా పనిచేస్తుంది. మనం నిద్రలోనే ఉండేలా సాయం చేయడం కోసం బాహ్య సమాచారాన్ని వేరే దిశలకు పంపిస్తుంది. స్పిండిల్ ఈవెంట్ సమయంలో ఈ తరంగం మెదడు ఉపరితలానికి, అక్కడి నుంచి వెనుకకు ప్రయాణించి ఒక మెలికను పూర్తిచేస్తుంది.

ఎక్కువ స్పిండిల్ ఈవెంట్లు ఉన్న వారిలో పాదరసం లాంటి మేధస్సు - కొత్త సమస్యలను పరిష్కరించగల, కొత్త పరిస్థితుల్లో తర్కాన్ని ఉపయోగించగల, నిర్మాణ రీతులను గుర్తించగల సామర్థ్యం - ఎక్కువగా ఉంటుంది. ''విషయాలు, అంకెలను గుర్తుపెట్టుకోగల సామర్థ్యం వంటి ఇతర రకాల మేధస్సులతో వీటికి సంబంధం ఉన్నట్లు కనిపించదు. ఇవి ప్రత్యేకంగా తార్కిక నైపుణ్యాలకు సంబంధించివి'' అని ఫోగల్ అంటారు.

''మీరు పుస్తకాల్లో వెదుక్కోగల విషయాన్ని దేనినైనా గుర్తుంచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించవద్దు'' అన్న ఐన్‌స్టీన్ సలహాకు, సంప్రదాయ విద్య పట్ల ఆయన తిరస్కారానికి ఈ విశ్లేషణ సరిగ్గా సరిపోతుంది.

అయితే.. మీరు ఎంత ఎక్కువగా నిద్రపోతే మీ మెదడులో అంత ఎక్కువగా స్పిండిల్ ఈవెంట్లు ఉంటాయి కాబట్టి అధిక నిద్ర లాభమేనని ఖచ్చితంగా చెప్పలేం. ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్న లాంటిదే: కొందరు తెలివైన వారు కాబట్టి వారికి స్పిండిల్ ఈవెంట్లు ఎక్కువగా ఉంటాయా? లేక వారికి ఎక్కువ స్పిండిల్ ఈవెంట్లు ఉంటాయి కాబట్టి వారు తెలివైన వారా? ఈ సమస్య ఇంకా తేలలేదు.

అయితే రాత్రి నిద్ర మహిళల్లోనూ, పగటి కునుకు పురుషుల్లోనూ తార్కికంగా ఆలోచించడాన్ని, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచగలవని ఇటీవలి ఒక అధ్యయనం చెప్తోంది. ముఖ్యంగా మేధస్సు పెరుగుదలకు స్పిండిల్ ఈవెంట్లు ఏర్పడటానికి సంబంధముంది. ఇవి మహిళల్లో రాత్రి నిద్రలో, పురుషుల్లో పగటి కునుకుల్లో మాత్రమే ఏర్పడతాయి.

ఐన్‌స్టీన్ అదృష్టమేమిటంటే ఆయన తరచుగా కునుకులు తీసేవారు. ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం.. ఎక్కువ సేపు నిద్రపోకుండా ఉండడం కోసం ఆయనొక జాగ్రత్త కూడా తీసుకునేవాడని చెబుతారు. అదేమిటంటే.. ఐన్‌స్టీన్ పడక కుర్చీలో విశ్రమించేటపుడు ఒక చేతిలో స్పూన్ పట్టుకుని, సరిగ్గా దానికింద ఒక లోహపు పళ్లెం పెట్టి పడుకునేవాడు. ఒక సెకను పాటు మగత నిద్రలోకి జారుకునేవాడు. అంతలోనే ఆయన చేతిలోని స్పూన్ జారిపోయి కింద పళ్లెం మీద పడి ఠంగ్ మని శబ్దం చేస్తుంది. దాంతో ఆయన నిద్ర లేచేవాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నడవండి! ఐన్‌స్టీన్ సిఫారసు చేస్తున్నారు

రోజు వారీ నడక

రోజు వారీ నడక ఐన్‌స్టీన్‌కి చాలా పవిత్రమైనది. ఆయన న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నపుడు ఒకటిన్నర మైళ్ల దూరం నడిచి వెళ్లివచ్చేవాడు. నడకలో ఆయన డార్విన్ వంటి వారి అడుగుజాడలను అనుసరించాడని చెప్పొచ్చు. డార్విన్ కూడా రోజుకు మూడు సార్లు 45 నిమిషాలు నడిచేవాడు.

నడక వల్ల కేవలం శారీరక దృఢత్వం కోసమే కాదు - జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతాయనేందుకు గుట్టల కొద్దీ సాక్ష్యాలున్నాయి.

నడవడమనేది మెదడును మస్తిష్క క్రియల నుండి మళ్లించి, ఒక అడుగు తర్వాత మరొక అడుగు వేయడం మీద, పడిపోకుండా ఉండడం మీద కేంద్రీకరించేలా ఒత్తిడి చేస్తుంది. మెదడులోని కొన్ని భాగాలలో - ప్రత్యేకించి జ్ఞాపకశక్తి, నిర్ణయాత్మకత, భాష వంటి ఉన్నత ప్రక్రియల్లో భాగం పంచుకునే అగ్రలంబికల్లో (ఫ్రంటల్ లోబ్స్‌లో) ఒత్తిడిని తాత్కాలికంగా తగ్గిస్తుంది. దీనినే సాంకేతిక భాషలో 'ట్రాన్సియంట్ హైపోఫ్రంటాలిటీ' అని వ్యవహరిస్తారు.

మెదడు చర్యలను కొంత వరకు తగ్గించడం ద్వారా అది పూర్తిగా భిన్నమైన ఆలోచనా శైలిని అవలంబిస్తుంది - ఆఫీస్‌లో పని చేసేటపుడు అర్థంకాని విషయాన్ని సరికొత్తగా అవగాహన చేసుకోవడానికి అది సాయపడవచ్చు. నడక ప్రయోజనాలకు సంబంధించిన ఈ వివరణకు ఇంకా ఎలాంటి ఆధారమూ లేదు. అయినా ఇది ఆకర్షణీయమైన ఆలోచన.

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్,

ధూమపానం మంచిది కాదు, దానితో వచ్చే ప్రమాదాల గురించి ఐన్‌స్టీన్‌కి తెలిసివుండే అవకాశం లేదు

సాక్సులకు నో

సాక్సులంటే ఐన్‌స్టీన్‌కు గల అయిష్టతను ప్రస్తావించనిదే ఆయన వింత అలవాట్ల జాబితా పరిపూర్ణం కాదు. ''నా చిన్నప్పుడు కాలి బొటన వేలు ఎప్పుడూ సాక్సుకు రంధ్రం చేస్తుంటుంది. అందుకే నేను సాక్సులు వేసుకోవడం మానేశా'' అని ఆయన తన కజిన్‌కు, ఆ తర్వాత తన భార్య ఎల్సాకు రాసిన లేఖల్లో వివరించారు. అనంతర కాలంలో ఐన్‌స్టీన్‌కు తన శాండిల్స్ కనిపించనప్పుడు ఎల్సా బెల్టు చెప్పులు తొడుక్కునేవారు.

అయితే కొత్త ఫ్యాషన్‌ను పాటిస్తున్నట్లు కనిపించడం ఆయనకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. విచారకరమైన విషయం ఏమిటంటే సాక్సులు వేసుకోకపోవడం మీద ప్రత్యేకంగా ఎలాంటి అధ్యయనాలూ జరగలేదు. కానీ అమూర్త ఆలోచనల (అబ్‌స్ట్రాక్ట్ థింకింగ్) మీద జరిపిన పరీక్షలు.. లాంఛనమైన దుస్తులు కాకుండా సాధారణ దుస్తులు ధరించడానికి, రాణించలేకపోవడానికి సంబంధం ఉందని సూచించాయి.

చివరగా ఐన్‌స్టీన్ స్వయంగా ఇచ్చిన సలహాతో దీనిని ముగిద్దాం. ''ప్రశ్నించడాన్ని మానకపోవడం ముఖ్యమైన విషయం; జిజ్ఞాస మనుగడకు తనదైన కారణం ఉంది'' అని ఆయన 1955లో లైఫ్ మేగజైన్‌తో చెప్పారు.

అది చేయలేకపోతే, కాలి వేళ్లతో కొన్ని కసరత్తులు చేసి చూడొచ్చు. ఎవరికి తెలుసు - అవి పని చేయవచ్చేమో. తెలుసుకోవాలన్న ఆత్రుత మీకు లేదా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)