ఇప్పుడు హింస ఆగిపోయింది: రోహింగ్యా సంక్షోభంపై సూచీ

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రఖైన్ రాష్ట్రంలో శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సూచీ చెప్పారు

మయన్మార్‌లో రోహింగ్యా సంక్షోభం విషయంలో ‘అంతర్జాతీయ పరిశీలన’కు తాను భయపడటం లేదని ఆ దేశ వాస్తవ అధినేత్రి ఆంగ్ సాన్ సూచీ పేర్కొన్నారు.

రోహింగ్యా ముస్లింలు చాలా మంది దేశాన్ని విడిచిపోలేదని, హింస ఆగిపోయిందని ఆమె చెప్పారు.

రఖైన్ రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి ఆమె మంగళవారం తొలిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మానవ హక్కుల ఉల్లంఘనలన్నిటినీ ఆమె ఖండించారు. రఖైన్‌లో అత్యాచారాలకు కారకులెవరైనా చట్టం ముందు నిలబెడతామన్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న రఖైన్ రాష్ట్రంలో గత ఆగస్టులో పోలీస్ శిబిరాలపై రోహింగ్యా మిలిటెంట్లు దాడులు చేశారని మయన్మార్ చెప్తోంది.

ఈ మిలిటెంట్లపై చర్య పేరుతో రఖైన్ రాష్ట్రంలో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ హింస కారణంగా 4,00,000 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కి శరణార్థులుగా వలస వెళ్లారు.

తమ గ్రామాలను ఎలా దగ్ధం చేస్తున్నారో.. సైన్యం చేతుల్లో తాము ఎన్ని బాధలకు గురవుతున్నామో ఆ శరణార్థులు వివరిస్తున్నారు.

రఖైన్ రాష్ట్రంలో తమ ఆపరేషన్లు మిలిటెంట్లను ఏరివేయడానికే పరిమితమని, తాము పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని సైన్యం చెప్తోంది.

ఆ ప్రాంతాన్ని సందర్శించడంపై మయన్మార్ ఆంక్షలు విధించింది. అయితే ప్రభుత్వ నియంత్రణలో బీబీసీ విలేకరులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

ముస్లింలు తమ సొంత గ్రామాలను తామే దగ్ధం చేసుకుంటున్నారన్న అధికారిక వాదనలో నిజం లేదనేందుకు బీబీసీ బృందానికి ఆధారాలు లభించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మానవ హక్కుల ఉల్లంఘనలను సూచీ ఖండించారు

రఖైన్‌లో జరుగుతున్నది ‘జాతి నిర్మూలన’ అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఈ సంక్షోభం విషయంలో సూచీ ప్రతిస్పందనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

హక్కుల ఉల్లంఘనను ఖండిస్తున్నాం...

ఈ నేపథ్యంలో సూచీ తాజాగా దేశ రాజధాని నే ప్యీ తావ్‌లో చేసిన ప్రసంగం టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమయింది.

ఈ వారంలో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తాను పాల్గొనలేకపోతున్నానని.. కాబట్టి ఈ ప్రసంగం చేస్తున్నానని సూచీ చెప్పారు.

మయన్మార్‌లో పరిస్థితిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఏం చేస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.

‘‘మానవ హక్కుల ఉల్లంఘనలన్నిటినీ, చట్టబద్ధంకాని హింసను మేం ఖండిస్తున్నాం. రాష్ట్రమంతటా శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

అయితే సైన్యం మీద వచ్చిన ఆరోపణల గురించి ఆమె ప్రస్తావించలేదు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ‘‘సాయుధ ఘర్షణలు కానీ, ఖాళీ చేయించే ఆపరేషన్లు కానీ జరగడం లేదు’’ అని మాత్రం పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్,

‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’ రోహింగ్యాలు

సంక్షోభానికి మూలం తెలుసుకుంటాం...

కానీ అత్యధిక ముస్లింలు రఖైన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని, దీనిని బట్టి పరిస్థితి అంత తీవ్రంగా లేదని తెలుస్తోందని సూచీ వ్యాఖ్యానించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు.

ఈ సంక్షోభానికి మూలం ఏమిటనేది తెలుసుకోవడం కోసం వలస వెళ్లిన ముస్లింలతోనూ, రాష్ట్రంలోనే ఉన్న ముస్లింలతోనూ మాట్లాడాలని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.

సూచీ ఇంతకుముందు ఈ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ‘‘తప్పుడు సమాచారం’’ ద్వారా విషయాన్ని వక్రీకరిస్తున్నారని, ఉగ్రవాదుల ప్రయోజనాలను ప్రచారం చేయడం ద్వారా ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.

మయన్మార్‌లో పౌర ప్రభుత్వానికి వాస్తవాధినేత సూచీ అయినప్పటికీ, రఖైన్ రాష్ట్రంలో వాస్తవాధికారం సైన్యం చేతుల్లో ఉంది. ఎందుకంటే అంతర్గత భద్రత అధికారం సైన్యానిదే.