ఆంక్షలు మమ్మల్ని అడ్డుకోలేవు: ఉత్తర కొరియా హెచ్చరిక

ఉత్తర కొరియా North Korea

ఫొటో సోర్స్, AFP/GETTY

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా రెండు సార్లు జపాన్ మీదుగా క్షిపణులను ప్రయోగించింది

ఐక్య రాజ్య సమితి విధించిన ఆంక్షల పట్ల ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తాజా ఆంక్షలు విద్వేషపూరితంగా, అనైతికంగా, అమానవీయంగా, శత్రుత్వపూరితంగా ఉన్నాయని అది పేర్కొంది.

మరోవైపు కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ అమెరికాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఉత్తర కొరియా అంశంపై ప్రధానంగా చర్చకు వస్తుందని భావిస్తున్నారు.

గత శుక్రవారం జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష చాలా కీలకమైందని ఉత్తర కొరియా పేర్కొంది.

ఈ పరీక్షకు కొద్ది రోజుల ముందు ఉత్తర కొరియాపై యూఎన్ మరో దఫా ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా వైఖరిని యూఎన్ భద్రతా మండలి ఏకగ్రీవంగా ఖండించింది. ఉత్తర కొరియా నిర్వహించిన తాజా అణు పరీక్ష రెచ్చగొట్టే చర్య అని భద్రతామండలి పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP/GETTY

ఫొటో క్యాప్షన్,

'ఆంక్షల లక్ష్యం వినాశనే'

ఉత్తర కొరియా ఏమంటోంది?

ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రకటనను ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ వెబ్‌సైట్‌పై ప్రచురించారు. అమెరికా, దాని ఆధీనంలో పని చేసే శక్తులు తమపై విధిస్తున్న ఆంక్షలతో తమ దేశం అణ్వాయుధ సంపన్న దేశంగా మారడంలో మరింత మద్దతు లభిస్తుందని ఆ ప్రకటనలో ఉంది. తాము ఈ ఆంక్షలకు లొంగేది లేదని కూడా ఉత్తర కొరియా తెలిపింది.

సెప్టెంబర్ 11న తమపై విధించిన తాజా ఆంక్షల లక్ష్యం తమ దేశాన్ని వినాశనం వైపు నెట్టెయ్యడమేనని ఉత్తర కొరియా పేర్కొంది. ఆంక్షలతో ఉత్తర కొరియా ప్రభుత్వాన్నీ, ప్రజలనూ నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఉత్తర కొరియా ఆ ప్రకటనలో తెలిపింది.

ఇంధన సరఫరాల్ని అడ్డుకోవడం, ఆదాయ వనరుల్ని దెబ్బతీయడం, చమురు దిగుమతులపై నిషేధం విధించడం, వస్త్ర ఎగుమతుల్ని అడ్డుకోవడమే ఈ ఆంక్షల లక్ష్యమని ఉత్తర కొరియా అభివర్ణించింది.

ఉత్తర కొరియా ఈ నెలలో అత్యంత శక్తిమంతమైన అణు పరీక్షను నిర్వహించిందన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఉత్తర కొరియాపై ఆంక్షలలో ఔచిత్యాన్ని విమర్శకులు కూడా తప్పు పడుతున్నారు. ఉత్తర కొరియా ఇప్పటికీ అంతర్జాతీయ వ్యాపారం చేస్తోందని వారంటున్నారు. చైనాతో ఉత్తర కొరియాకు వ్యాపార సంబంధాలున్నాయనీ, దాని వల్లనే ఉత్తర కొరియా 3.9 శాతం ఆర్థిక ప్రగతిని సాధించగలిగిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.