ఐరాసలో ట్రంప్ ప్రసంగంపై విమర్శల వెల్లువ

  • 20 సెప్టెంబర్ 2017
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్న ట్రంప్ / Trump speaking in United Nations Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్ ప్రసంగం మీద ‘అనుచిత వేదికలో అనుచిత సమయంలో అనుచిత ప్రసంగం’ అని విమర్శలు వచ్చాయి

అమెరికాను, తమ మిత్ర దేశాలను రక్షించుకోవాల్సి వస్తే ఉత్తర కొరియాను సర్వనాశనం చేసేందుకు సిద్ధమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను 'రాకెట్ మ్యాన్'గా గేలి చేస్తూ, ఆయన 'ఆత్మహత్యా కార్యక్రమం'లో తలమునకలుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

అణ్వాయుధాలు ఉన్న ''కొన్ని దుష్ట దేశాలు'' ప్రపంచానికి ముప్పుగా మారాయని ఆరోపించారు. ఆ జాబితాలో ఇరాన్‌ను కూడా చేర్చారు. ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులా మీదా చర్యలకు సిద్ధమన్నారు.

అమెరికాతో సై అంటే సై అంటున్న ఉత్తరకొరియా ట్రంప్ హెచ్చరికలపై ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇరాన్, వెనిజులా, బొలీవియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టాయి. ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై స్పందనలు ఇవీ...

ట్రంప్ ప్రసంగంపై విమర్శల వెల్లువ

ఇరాన్‌లో అరాచక పాలన: ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్‌పై నిప్పులు చెరిగారు. అక్కడ ప్రజాస్వామ్యం పేరుతో అరాచక, అవినీతి, నియంతృత్వ పాలన నడుస్తోందని ఆరోపించారు. 2015లో ఇరాన్‌తో ప్రపంచ శక్తులు చేసుకున్న అణు ఒప్పందం చాలా చెత్త ఒప్పందమని అభివర్ణించారు. అది పూర్తిగా ఏకపక్షంగా జరిగిందన్నారు.

అవి మధ్యయుగపు మాటలు: ట్రంప్ ప్రసంగం అవివేకంగా, విద్వేషపూరితంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారాఫ్ అభివర్ణించారు. ఆయన ఇంకా మధ్యయుగంలోనే ఉన్నట్లు కనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు.

Image copyright UN / EVN
చిత్రం శీర్షిక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తున్నపుడు (కుడి నుంచి ఎడమకు) ఇజ్రాయెల్, సిరియా, ఇరాన్, సౌదీ అరేబియా ప్రతినిధుల హావభావాలు

వెనిజులాపై చర్యలకు సిద్ధం: వెనిజులాను కూడా ట్రంప్ వదల్లేదు. అక్కడ అవినీతిమయ సోషలిస్టు నియంతృత్వ పాలన సాగుతోందని అభివర్ణించారు. ఆ దేశంపై చర్యలకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

సొంత సర్కారును చక్కదిద్దుకో: ట్రంప్ 'బెదిరింపుల'ను వెనిజులా విదేశాంగ మంత్రి జార్జ్ అరియాజ్ ఖండించారు. ట్రంప్ ప్రపంచానికి అధ్యక్షుడు కాదని, ఆయన తన సొంత ప్రభుత్వాన్ని చక్కదిద్దుకుంటే చాలని ఎద్దేవా చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడారు

అది 'అనుచిత ప్రసంగం': ట్రంప్‌ది ''అనుచిత ప్రదేశంలో.. అనుచిత సమయంలో.. అనుచిత ప్రసంగం'' అని స్వీడన్ విదేశాంగ మంత్రి మార్గట్ వాల్‌స్టామ్ బీబీసీతో పేర్కొన్నారు.

ట్రంప్‌కది అలవాటే: వందల కోట్లకు అధిపతైన ట్రంప్ సోషలిజంపై దాడి చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరాలెస్ వ్యాఖ్యానించారు. తమది సైద్ధాంతిక, ఆచరణాత్మక పోరాటమని ఆయన ట్వీట్ చేశారు.

రద్దు చేస్తే పెద్ద తప్పు: ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ సమర్థించారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేయడమంటే పెద్ద పొరపాటు చేయడమేనని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు.

ట్రంప్‌కు నెతన్యాహు మద్దతు: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఇరాన్‌ ఒప్పందాన్ని సవరించడమో, రద్దు చేయడమో జరగాలన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్ ప్రపంచ దృక్పథంలో చాలా వైరుధ్యాలున్నాయనేది విశ్లేషకుల మాట

ట్రంప్ దృక్పథంలో వైరుధ్యాలు

ఇదిలావుంటే.. 'అమెరికా ప్రధానం' అనే తన సిద్ధాంతానికి అనుగుణంగా ట్రంప్ ప్రసంగం ఉందని.. అంతర్జాతీయ వ్యవస్థకు 'జాతీయ సార్వభౌమత్వా'న్ని మూల స్తంభంగా ఆయన పరిగణిస్తున్నారని బీబీసీ న్యూస్ సీనియర్ పాత్రికేయుడు జొనాథన్ మార్కస్ అభిప్రాయపడ్డారు.

అయితే ట్రంప్ ప్రపంచ దృక్పథంలో చాలా వైరుధ్యాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘జాతీయ సార్వభౌమత్వానికి, ఉమ్మడి చర్యకు మధ్య సరిహద్దు ఎక్కడుంది? అమెరికా కొత్త విదేశాంగ విధానపు కార్యాచరణవాదం.. ఇరాన్, వెనిజులాల్లో ప్రజాస్వామ్య పున:స్థాపన పిలుపులకు మాత్రమే పరమితమా? లేక ఈ విషయంలో ఏదైనా కార్యాచరణ చేపట్టడానికి కూడా వర్తిస్తుందా?‘ అన్నది అస్పష్టమని వ్యాఖ్యానించారు.