మహిళలను డ్రైవింగ్‌కి అనుమతించిన సౌదీ ప్రభుత్వం

సౌదీ మహిళలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సౌదీ మహిళల ఆనందం

సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతిస్తూ ఆ దేశ పాలకుడు సాల్మన్ ఆదేశం జారీ చేసినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది.

ఈ ఆదేశం 2108 జూన్ నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకూ మహిళలు వాహనాలు నడపడానికి అనుమతి లేని దేశం సౌదీ అరేబియా ఒక్కటే.

ఇక్కడ ప్రస్తుతం పురుషులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తారు. మహిళలు ఎవరైనా బహిరంగంగా వాహనాలు నడిపితే వారిని అరెస్ట్ చేసి, జరిమానా విధిస్తారు. కొందరు మహిళలను జైలులో కూడా పెట్టారు.

సౌదీ సమాజంలో పెను మార్పు

సౌదీ అరేబియాకు ఈ డిక్రీ చాలా ప్రధానమైనదని బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్ ఫ్రాంక్ గార్డెనర్ చెప్తున్నారు.

సౌదీ మహిళలు చాలా మంది చాలా ఉన్నత విద్యావంతులు. ఎంతో ఉత్సాహవంతులు. దేశ ఆర్థిక వ్యవస్థలో పూర్తిస్థాయిలో భాగస్వాములయ్యే అవకాశం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు.

అయితే మహిళల ప్రయాణం కోసం దక్షిణాసియా, ఆగ్నేయాసియాల నుంచి వలస వచ్చే డ్రైవర్లను నియమించుకుని, వారికి నివాస, భోజన వసతులు కల్పించడం, బీమా చేయించడం వంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబంపై ఆర్థిక భారంగా మారేది.

ప్రస్తుతం సౌదీలో మహిళలు ప్రయాణించే వాహనాలు నడిపేందుకు 8,00,000 మంది విదేశీ డ్రైవర్లు ఉన్నారని అంచనా.

మహిళలకు డ్రైవింగ్ అనుమతి ఇవ్వడానికి ఇంత కాలం పట్టడానికి కారణం.. మతపరమైన సంప్రదాయవాదుల నుంచి వస్తున్నత వ్యతిరేకతే. వారు ‘‘మహిళలకు వాహనాలు నడిపేంత తెలివి లేదు‘‘ అనే దగ్గరి నుంచి ‘‘సహించరాని స్థాయిలో స్త్రీ, పురుషులు కలయికకు దారితీస్తుంది‘‘ అనే వరకూ విభిన్న వాదనలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కారులో సౌదీ హక్కుల కార్యకర్త మనాల్ అల్ షారిఫ్

సౌదీ రాజ్యంలో మహిళలకు వాహనాలు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని హక్కుల సంఘాలు చాలా ఏళ్లుగా ఉద్యమిస్తున్నాయి. తాజా రాచాజ్ఞతో ఆ అనుమతి లభించింది.

''పురుషులు, మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడంతో సహా ట్రాఫిక్ చట్టాల విధివిధానాలను ఈ రాచాజ్ఞ అమలు చేస్తుంది'' అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.

సంరక్షకుల అనుమతీ అవసరంలేదు

''ఇది చరిత్రాత్మకమైన రోజు. సరైన సమయంలో సరైన నిర్ణయం'' అని అమెరికాలో సౌదీ రాయబారి ప్రిన్స్ ఖాలెద్ బిన్ సల్మాన్ అభివర్ణించారు.

అలాగే మహిళలు డ్రైవింగ్ శిక్షణ పొందడానికి తమ పురుష సంరక్షకుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, వారు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వాహనాలు నడుపుతూ వెళ్లవచ్చునని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మహిళా డ్రైవింగ్‌పై సౌదీలో భిన్న వాదనలు

ప్రతిస్పందన ఎలా ఉంది?

''ఇది చరిత్రాత్మకమైన రోజు. సరైన సమయంలో సరైన నిర్ణయం'' అని అమెరికాలో సౌదీ రాయబారి ప్రిన్స్ ఖాలెద్ బిన్ సల్మాన్ అభివర్ణించారు.

అలాగే మహిళలు డ్రైవింగ్ శిక్షణ పొందడానికి తమ పురుష సంరక్షకుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, వారు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వాహనాలు నడుపుతూ వెళ్లవచ్చునని ఆయన వివరించారు.

ఈ నిర్ణయం ''సరైన దిశలో గొప్ప ముందడుగు'' అంటూ అమెరికా విదేశాంగ శాఖ ఆహ్వానించింది.

సౌదీ కార్యకర్త లౌజైన్ అల్-హత్‌లోల్‌కు.. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించినందుకు 2017లో 73 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. తాజా ప్రకటన వెలువడగానే ''థాంక్ గాడ్'' అని ఆమె ట్వీట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విజన్ 2030లో భాగంగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు

ఉమెన్2డ్రైవ్ ఉద్యమ నిర్వాహకురాలు మనాల్ అల్-షరీఫ్ కూడా వాహనం నడిపి జైలుకు వెళ్లారు. ''సౌదీ అరేబియా ఇక సమూలంగా మారిపోతుంది'' అని ఆమె ట్వీటర్‌లో స్పందించారు.

జెడ్డాలో కార్యకర్త సహర్ నాసిఫ్ బీబీసీతో మాట్లాడుతూ ''చాలా చాలా ఆనందంగా ఉంది. సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నా'' అని చెప్పారు.

''నా డ్రీమ్ కార్ కన్వర్టబుల్ ముస్తాంగ్ కొనుక్కుంటా. బ్లాక్ అండ్ ఎల్లో కలర్'' అని తెలిపారు.

అయితే దీనిపై అందరూ సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వం ‘‘షరియా వాక్యాలను అతిక్రమిస్తోంది’’ అంటూ సంప్రదాయ గళాలు ఆరోపించాయి.

‘‘నాకు తెలిసినంత వరకూ మహిళలు వాహనాలు నడపడం హరామ్ (నిషిద్ధం) అని షరియా స్కాలర్లు చెప్పారు. అకస్మాత్తుగా అది హలాల్ (అనుమతించదగ్గది) ఎలా అయింది?‘‘ అని ఒక విమర్శకుడు ట్వీట్ చేశారు.

సౌదీ మహిళలకు లైఫ్‌స్టైల్ పరిమితులు

సౌదీ చట్టం వహాబిజం అనే కఠినమైన సున్నీ ఇస్లాం రూపాన్ని అమలు చేస్తుంది. స్త్రీ, పురుషులను వేర్వేరుగా ఉంచే నిబంధనలకు ఇది ప్రసిద్ధి.

మహిళలు దుస్తుల నియమవాళికి ఖచ్చితంగా కట్టుబడాలి. సంబంధం లేని పురుషులను కలవకూడదు. వారు ప్రయాణం చేయాలన్నా, పని చేయాలన్నా, చివరికి ఆస్పత్రికి వెళ్లాలన్నా వారి వెంట ఒక సంరక్షుకుడు ఉండాలి. లేదా ఆ సంరక్షకుడి నుండి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలి.

సౌదీ సర్కారు.. జాతీయ దినోత్సవ వేడుకల్లో మహిళలు పాల్గొనడానికి ఈ ఏడాదే తొలిసారి అనుమతి ఇచ్చింది. దీని మీద సంప్రదాయ వాదుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆ వేడుకల్లో బాణసంచా పేలుడు, లైట్ షోలతో పాటు రాజధాని రియాద్‌లోని కింగ్ ఫాహెద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

విజన్ 2030లో భాగంగా..

సౌదీ సమాజాన్ని ఆధునీకరించడానికి, మరింతగా మిగతా ప్రపంచం తరహాలో నవీకరించడానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అమలు చేస్తున్న విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు పునాది చమురు, గ్యాస్ నిల్వలు. అయితే కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమవడంతో సౌదీ ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి మార్గాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి.

ఏదో రోజు చమురు బావులు ఎండిపోతాయని, దానికన్నా ముందే ఎలక్ట్రిక్ కార్లు పెరుగుతాయని సౌదీ పాలకుడికి తెలుసు. ఆ క్రమంలోనే విదేశీ కన్సల్టెంట్లను సంప్రదిస్తూ గత ఏడాది విజన్ 2030 కి రూపకల్పన చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖకూ కార్యాచరణను నిర్దేశించారు.

ఆ ప్రణాళిక అమలులో భాగంగా సమాజంలోనూ, ప్రజల జీవన విధానాల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల భారీ జీతాలు, విలాసాలకు కోతపెట్టారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)