కార్పొరేట్ పన్నును 35 నుంచి 20 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ప్రణాళిక

  • 29 సెప్టెంబర్ 2017
రిపబ్లికన్ నేతలతో ట్రంప్ భేటీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా పన్ను నియమావళిని పునర్‌వ్యవస్థీకరించడానికి ఒక ప్రణాళికా రచన కోసం రిపబ్లికన్లు కొన్ని నెలలుగా సమావేశమవుతున్నారు

అమెరికా పన్ను వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలన్న రిపబ్లికన్ పార్టీ దీర్ఘకాల ప్రయత్నంలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు పన్ను కోతలను ప్రతిపాదించారు.

రిపబ్లికన్లు తాజాగా విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళికలో కార్పొరేట్ కంపెనీలపై పన్నును 35 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడం కీలకమైనది.

ఈ తగ్గింపు అమెరికాలో వాణిజ్యం పెరగడానికి దోహదపడుతుందని, మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే ఇది ధనికులకు తాయిలాలు ఇచ్చే ప్రణాళిక అని డెమొక్రటిక్ పార్టీ విమర్శించింది.

కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల వచ్చే లోటును భర్తీ చేయడానికి ఎటువంటి పన్ను రాయితీలను తొలగిస్తారనేది ఈ ప్రణాళికలో వివరించలేదు. రాయితీల తొలగింపుపై సంప్రదింపులు కష్టమవుతాయని భావిస్తున్నారు.

ఈ పన్ను తగ్గింపు సంస్కరణ కోసం ఒత్తిడి చేస్తున్న వాణిజ్య సంస్థల బృందం చాంబర్ ఆఫ్ కామర్స్.. రానున్న ‘కఠిన నిర్ణయాల’ సమయంలో తాము చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది.

రిపబ్లికన్ పన్ను ప్రణాళికలో ’కోతలు‘ ఇవీ..

వ్యాపారాలకు:

  • వాణిజ్య పన్ను రేటు 35 శాతం నుంచి 20 శాతానికి తగ్గింపు
  • విదేశీ లాభాల మీద పన్ను మార్పు
  • పరిమిత లయబిలిటీ కార్పొరేషన్ వంటి సంస్థలకు అత్యధికంగా 25% పన్ను రేటు

కుటుంబాలకు:

  • వ్యక్తులు, కుటుంబాలకు లభించే పన్ను మినహాయింపు మొత్తం రెట్టింపు. 12,000 డాలర్ల నుంచి 24,000 డాలర్లకు పెంపు
  • పిల్లలకు పన్ను క్రెడిట్ పెంపు
  • పిల్లలు కాని, ఆధారపడ్డవారి కోసం కొత్తగా పన్ను క్రెడిట్ అమలు
  • వారసత్వ ఆస్తులపై పన్ను రద్దు

‘పన్ను వ్యవస్థకు కాలం చెల్లింది’

వ్యవస్థను సరళీకరించాలని, మధ్య తరగతి కుటుంబాలపై భారం తగ్గించాలని, అమెరికాను మరింతగా పోటీపడగలిగేలా చేయాలని మాత్రమే తాను కోరుకుంటున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

‘‘అమెరికాలో కాలం చెల్లిన, సంక్లిష్టమైన, చాలా బరువైన పన్ను నియమావళిని గణనీయంగా మార్చనిదే మన దేశం, మన ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లాల్సిన విధంగా ముందుకు పోదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పన్ను బ్రాకెట్ల (స్లాబుల) సంఖ్యను కూడా మూడుకు - 12%, 25%, 35% - తగ్గించాలని రిపబ్లికన్ల ప్రణాళికలో ప్రతిపాదించారు.

అయితే ఏ పన్ను రేటు కిందకు ఎంత ఆదాయం వస్తుందనేది వివరించలేదు.

ప్రస్తుతం అతి తక్కువ పన్ను రేటు 10 శాతంగా ఉంటే అత్యధిక పన్ను రేటు 40 శాతంగా ఉంది.

ఈ మార్పులు మధ్యతరగతి కుటుంబాలకు, ప్రత్యేకించి అల్పాదాయ వర్గాలు, పిల్లలతో ఉన్న ఒంటరి తల్లి, తండ్రులకు హాని చేస్తుందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.

‘‘ఆయన మాటలు చెప్తున్నారు. కానీ ఆచరించడంలేదు’’ అని ట్రంప్‌ను ఉద్దేశించి డెమక్రటిక్ పార్టీ సీనియర్ నేత, న్యూయార్క్ సెనేటర్ చక్ ష్కూమర్ పేర్కొన్నారు.

ఈ పన్ను కోతల వల్ల లోటు పెరుగుతుందని, మెడికేర్ (వైద్య సేవ), సోషల్ సెక్యూరిటీ (సామాజిక భద్రత) వంటి పథకాల అమలు ప్రమాదంలో పడతాయని ఆయన చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ పన్ను కోతల వల్ల లోటు పెరుగుతుందని, మెడికేర్, సోషల్ సెక్యూరిటీ వంటి పథకాలు ప్రమాదంలో పడతాయని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు

లోటు భర్తీ ప్రణాళిక ఏదీ?

ప్రతిపాదిత పన్ను కోతల వల్ల అమెరికా ప్రభుత్వం దశాబ్ద కాలంలో 2.2 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం కోల్పోతుందనేది ప్రాథమిక అంచనాగా కమిటీ ఫర్ ఎ రెస్పాన్సిబుల్ ఫెడరల్ బడ్జెట్ (బాధ్యతాయుతమైన సమాఖ్య బడ్జెట్ కోసం కమిటీ) అనే స్వచ్ఛంద మేధో బృందం పేర్కొంది.

అయితే, లోపాలను సరిదిద్దడం ద్వారా ఈ ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చునని ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. కానీ, ఎటువంటి ప్రయోజనాలను రద్దు చేస్తారనేది ఈ ప్రణాళికలో చెప్పలేదు.

ఇంటి యాజమాన్యం, ఉద్యోగ విరమణ, విద్య, పరిశోధన - అభివృద్ధిలకు పన్ను రాయితీలను కొనసాగించాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

పలు ఇతర చర్యలతో పాటు రాష్ట్ర, స్థానిక పన్నుల మినహాయింపును తొలగించాలని తాము భావిస్తున్నట్లు అధ్యక్ష భవనం శ్వేతసౌథం అధికారులు చెప్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇప్పటికే 20 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయిన అమెరికా అప్పు ఈ పన్ను కోతల వల్ల ఇంకా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు

అప్పు ఇంకా పెరుగుతుంది..

వాణిజ్య పన్నును తగ్గించడం వల్ల అభివృద్ధి వేగవంతమవుతుందని, అది లోటును భర్తీ చేయడానికి ఉపయోగపడుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు.

అయితే, లోటును తగ్గించడానికి వృద్ధి సరిపోదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇప్పటికే 20 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయిన అమెరికా అప్పు.. ఈ పన్ను కోతల ప్రణాళిక వల్ల ఇంకా పెరుగుతుందని వారు భావిస్తున్నారు.

‘‘పన్ను సంస్కరణలు ద్రవ్య బాధ్యతాయుతంగా ఉండాలంటే చాలా కృషి అవసరమన్నది విస్పష్టం. జాతీయ రుణం రికార్డు స్థాయిలో అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో లోటును పెంచే పన్నుల కోతను దేశం భరించలేదు’’ అని కమిటీ ఫర్ ఎ రెస్పాన్సిబుల్ ఫెడరల్ బడ్జెట్ పేర్కొంది.

విధాన విజయం కోసం..

అమెరికా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని సంస్కరించడానికి చేసిన ప్రయత్నంలో విఫలమైన రిపబ్లికన్లు ఇప్పుడు విధానపరమైన విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆగస్టు చివరికి పన్ను సంస్కరణలను అమలు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది.

కానీ, బుధవారం విడుదల చేసిన విస్తృత లక్ష్యాలపై అంగీకారానికి రావడమే చాలా కష్టంగా మారింది. ఇందులోని చాలా అంశాలు గత ప్రతిపాదనల్లోనివే.

రిపబ్లికన్లు బుధవారం సమైక్యంగా కనిపిస్తూ.. ఇటు అధ్యక్షభవనంలోనూ అటు కాంగ్రెస్ (పార్లమెంటు)లోనూ తమ పట్టు ఉన్నపుడే, ఈ ఏడాదే ఈ మార్పులను అమలు చేస్తామని బలంగా చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)