రోహింగ్యాల సమస్యపై ఐక్యరాజ్య సమితి వైఫల్యం

  • 29 సెప్టెంబర్ 2017
బంగ్లాదేశ్‌లో రోహింగ్యా శరణార్థి శిబిరం Image copyright AFP
చిత్రం శీర్షిక లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు

రోహింగ్యాల హక్కుల అంశాన్ని మయన్మార్ ప్రభుత్వం ఎదుట లేవనెత్తకుండా నిలువరించేందుకు మయన్మార్‌లోని ఐక్యరాజ్య సమితి (ఐరాస) అధికారులు ప్రయత్నించారని ఐరాస వర్గాలు, సహాయ బృందాలు బీబీసీకి వెల్లడించాయి.

మానవ హక్కుల కార్యకర్తలు సున్నితమైన రోహింగ్యా ప్రాంతాలను సందర్శించకుండా అడ్డుకునేందుకు మయన్మార్ (బర్మా)లోని ఐరాస ప్రధానాధికారి ప్రయత్నించారని ఆ అంతర్జాతీయ సంస్థ మాజీ అధికారి ఒకరు తెలిపారు.

బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన విషయాలతో ఐరాస మయన్మార్‌ విభాగం ‘‘తీవ్రంగా విభేదించింది’’.

మయన్మార్ సైన్యం ఆరంభించిన దాడుల కారణంగా 5,00,000 మందికి పైగా రోహింగ్యాలు ఆ ప్రాంతం నుంచి శరణార్థులుగా వలసపోయిన విషయం తెలిసిందే. వారిలో చాలా మంది బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

ఇటీవల రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వెళ్లడం ఆరంభించినప్పటి నుండీ వారికి సాయం అందించడంలో, మయన్మార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయడంలో ఐరాస ముందువరుసలో నిలిచింది.

యూఎన్‌సీటీ అధినేత ఏం చేశారు?

కానీ ప్రస్తుత సంక్షోభానికి ముందు నాలుగేళ్ల పాటు యునైటెడ్ నేషన్స్ కంట్రీ టీమ్ (యూఎన్‌సీటీ) అధినేత, కెనడా పౌరురాలు రెనెటా లాక్-దెస్సాలియన్:

- మానవ హక్కుల కార్యకర్తలు రోహింగ్యా ప్రాంతాలను సందర్శించకుండా అడ్డుకున్నారు

- ఈ విషయం మీద బహిరంగంగా గొంతెత్తకుండా నొక్కివేసే ప్రయత్నం చేశారు

- జాతి నిర్మూలన ముంచుకురావచ్చని హెచ్చరించేందుకు ప్రయత్నించిన సిబ్బందిని ఏకాకులను చేశారు

అని మయన్మార్ లోపలా బయటా ఉన్న ఐరాస, సహాయ సంస్థల వర్గాలు బీబీసీకి చెప్పాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక రఖైన్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు గ్రామాలను దగ్ధం చేశారు

ప్రమాద ఘంటికలను పసిగట్టినా...

ఇక్కడ జాతి నిర్మూలన ప్రమాద ఘంటికలను కరోలిన్ వాండెనేబీల్ అనే ఒక సహాయ కార్యకర్త ముందే పసిగట్టారు. 1993-94 ల్లో రువాండాలో జరిగిన జాతి నిర్మూలన (జీనోసైడ్)కు ముందు ఆ దేశంలో కూడా పనిచేసిన ఆమె.. మొదటిసారి మయన్మార్ వచ్చినపుడు ఆందోళనకరమైన సారూప్యతలను గమనించారు.

‘‘ఒక విదేశీయుల బృందం - బర్మా వాణిజ్యవేత్తలు రఖైన్ గురించి, రోహింగ్యాల గురించి మాట్లాడుకుంటున్నపుడు నేను ఉన్నాను. బర్మా వాళ్లలో ఒకరు ‘వాళ్లందరినీ కుక్కల్ని చంపినట్లు చంపాలి‘ అన్నారు. మనుషులను ఈ రకంగా అమానవీయంగా చూడడం సమాజంలో మామూలు విషయంగా అంగీకరించే స్థాయికి చేరిందనేందుకు ఇది సంకేతమని నా అభిప్రాయం‘‘ అని ఆమె వివరించారు.

వాండెనేబీల్ అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, రువాండా, నేపాల్ వంటి దేశాల్లో పనిచేశారు. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న ఆమె 2013-15 మధ్య మయన్మార్‌ యూఎన్‌సీటీలో రెసిడెంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో రఖైన్ రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల విషయంలో ఐరాస ప్రతిస్పందన ఎలా ఉందో చాలా దగ్గరి నుండి చూశారు.

అంతకుముందు 2012లో రోహింగ్యా ముస్లింలు - రఖైన్ బౌద్ధులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది చనిపోయారు. మరో లక్ష మందికి పైగా రోహింగ్యా ముస్లింలు రాష్ట్ర రాజధాని సిట్వె చుట్టూ శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐరాస సాయానికి అడ్డంకులు...

అప్పటి నుంచీ తరచుగా ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. గత ఏడాది కాలంగా రోహింగ్యా తీవ్రవాద బృందం పుట్టుకొచ్చింది. రోహింగ్యాలకు సాయం అందించేందుకు ఐరాస చేస్తున్న ప్రయత్నాలను రఖైన్ బౌద్ధులు వ్యతిరేకిస్తున్నారు. సాయాన్ని అడ్డుకోవడం, సాయంతో వెళ్లే వాహనాలపై దాడులు చేయడం కూడా జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో రోహింగ్యాలకు కనీస సాయం అందించాలంటే ఐరాస సహాయ సంస్థలకు ప్రభుత్వ సహకారం, బౌద్ధుల సహకారం అవసరం. అదే సమయంలో రోహింగ్యాల మానవ హక్కుల గురించి, వారికి దేశ పౌరసత్వం లేకపోవడం గురించి తాము మాట్లాడితే చాలా మంది బౌద్ధుల్లో వ్యతిరేకత వస్తుందని ఐరాస సిబ్బందికి తెలుసు.

కాబట్టి దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. రఖైన్ రాష్ట్రంలో దీర్ఘకాలిక అభివృద్ధికి ఐరాస, అంతర్జాతీయ సమాజం ప్రాధాన్యమిచ్చాయి. తద్వారా సంపద పెరుగుతుందని, దానివల్ల రోహింగ్యాలు - బౌద్ధుల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చాలా మంది రోహింగ్యాలు తమ సర్వస్వాన్నీ వదిలిపెట్టి రాత్రికి రాత్రి బంగ్లాదేశ్‌కు పారిపోయారు

‘‘హక్కుల ప్రస్తావన అసాధ్యం...’’

ఈ నిర్ణయం ఫలితంగా రోహింగ్యాల గురించి ఐక్యరాజ్యసమితి సిబ్బంది బాహాటంగా మాట్లాడటం ఒక నిషిద్ధ తప్పుగా మారిపోయింది. రఖైన్ గురించి ఐరాస విడుదల చేసిన మీడియా ప్రకటనలు ఆ మాటను పూర్తిగా పక్కనపెట్టాయి. బర్మా ప్రభుత్వం రోహింగ్యా పదాన్ని కూడా వాడదు. వారిని విభిన్న బృందంగా గుర్తించదు. వారిని ‘బెంగాలీలు’గా అభివర్ణిస్తుంది.

మయన్మార్‌లోని యూఎన్ విభాగం అంతర్గత పనితీరుపై జరిపిన దర్యాప్తులో.. ఆంతరంగిక సమావేశాల్లో సైతం రోహింగ్యా సమస్యల ప్రస్తావనను పక్కన పెట్టేసినట్లు వెల్లడైంది.

మయన్మార్‌‌లో జరిగే ఉన్నతస్థాయి ఐరాస సమావేశాల్లో రోహింగ్యాల మానవ హక్కులను గౌరవించాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వాన్ని కోరే ప్రశ్నే దాదాపు అసాధ్యమైపోయిందని అక్కడి ఐరాస వర్గాలు బీబీసీకి చెప్పాయి.

సీనియర్ ఐరాస సమావేశాల్లో రోహింగ్యాల సమస్యలను ప్రస్తావించడం, జాతి నిర్మూలన గురించి హెచ్చరించడం ఆమోదనీయం కాదని చాలా త్వరగానే అందరికీ అర్థమైపోయిందని వాండెనాబీల్ పేర్కొన్నారు.

‘‘ప్రస్తావిస్తే తప్పించేస్తారు...’’

‘‘అలా చేస్తే ప్రతికూల పర్యవసానాలుంటాయి. అలా లేవనెత్తిన వారిని ఇక సమావేశాలకు పిలవరు. వారి ప్రయాణాలకు అనుమతినివ్వరు. సమావేశాల్లో అవమానిస్తారు. కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు కూడా. ఆ విషయాల గురించి మాట్లాడలేని వాతావరణాన్ని సృష్టించారు’’ అని ఆమె వివరించారు.

ఐరాస కో-ఆర్డినేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ (యూఎన్ఓసీహెచ్ఏ) అధినేత ఇలా పలుమార్లు ఆ అంశాన్ని లేవనెత్తడంతో ఉద్దేశపూర్వకంగా చర్చల నుంచి తప్పించారని ఆమె తెలిపారు. ఈ విషయం మీద బీబీసీతో మాట్లాడటానికి యూఎన్ఓసీహెచ్ఏ అధినేత నిరాకరించారు. అయితే ఈ విషయాన్ని మయన్మార్‌లోని ఐరాస విభాగానికి చెందిన పలు వర్గాలు ధృవీకరించాయి.

అలాగే రోహింగ్యాల జాతి నిర్మూలన ప్రమాదం ఉందని తాను పదే పదే హెచ్చరించినందుకు.. తాను చిక్కులు తెచ్చిపెడుతున్నానని ముద్రవేసి, తన ఉద్యోగాన్ని స్తంభింపజేశారని వాండెనాబీల్ తెలిపారు. ఈ వాదనలతో ఐరాస విభేదించలేదు.

ప్రస్తుతం ఉత్తర కొరియాలో మానవ హక్కుల విషయంలో ఐరాస ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న తామస్ క్వింటానా 2014కు ముందు ఆరేళ్ల పాటు మయన్మార్‌లో అదే విధులు నిర్వర్తించారు. తాను ఒకసారి మయన్మార్ వెళ్లినపుడు యాంగాన్ విమానాశ్రయంలో దెస్సాలియన్ తనను కలిశారని ఆయన బీబీసీకి చెప్పారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి తాము కష్టపడుతున్నామని బంగ్లాదేశ్ చెప్తోంది

‘‘రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దన్నారు...’’

‘‘రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని ఆమె నాకు సలహా ఇచ్చారు. ఎందుకు వెళ్లొద్దని నేను అడిగాను. దానికి ఆమె నుంచి సమాధానం రాలేదు‘‘ అని ఆయన తెలిపారు. అయినా తాను రఖైన్ రాష్ట్రానికి వెళ్లానని, తన కార్యక్రమంతో సంబంధంలేదని దెస్సాలియన్ పేర్కొన్నారని క్వింటానా వివరించారు.

రఖైన్‌ విషయంలో యూఎన్‌సీటీ వైఖరిని 2015 నాటి ఐరాస అంతర్గత నివేదిక కూడా తీవ్రంగా తప్పుపట్టింది.

బీబీసీకి లీకైన ఈ నివేదిక.. ‘‘మానవ హక్కుల విషయంలో యూఎన్‌సీటీ వ్యూహం.. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే అదే ఉద్రిక్తతలను తగ్గిస్తుందనే ఆశ మీద ఆధారపడింది. కానీ వివక్షాపూరిత ప్రభుత్వం నడుపుతున్న వివక్షాపూరిత నిర్మాణాన్ని బలోపేతం చేయడం వివక్షను మరింత బలోపేతం చేస్తుందన్న విషయాన్ని గుర్తించడంలో విఫలమైంది’’ అని పేర్కొంటోంది.

‘‘పూర్తిగా అచేతనమైపోయింది...’’

ఆంటోనియో గుటెరస్ ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టినపుడు మయన్మార్ మీద రూపొందించిన రెండు పేజీల సంక్షిప్త అంచనాలో కూడా ఆ దేశంలోని ఐరాస విభాగం ‘‘పూర్తిగా అచేతనమైంద’’ని తప్పుపట్టింది.

అనంతరం కొద్ది వారాలకు దెస్సాలియన్‌ను అక్కడి నుంచి మార్చుతున్నట్లు ఐరాస ప్రకటించింది. కానీ ఆమె స్థానంలో నియమించేందుకు ప్రతిపాదించిన ఐరాస అధికారిని మయన్మార్ తిరస్కరించడంతో ఆ పదవిలో ఆమె కొనసాగుతున్నారు.

ఈ కథనంపై బీబీసీతో మాట్లాడేందుకు దెస్సాలియన్ నిరాకరించారు.

మయన్మార్‌లో తమ వైఖరి ’’సంపూర్ణంగా అందరినీ భాగస్వామ్యం చేసేద‘‘ని, సంబంధిత నిపుణులందరూ ఇందులో పాలుపంచుకునేలా చూస్తుందని అక్కడి ఐరాస విభాగం పేర్కొంది. ‘‘అంతర్గత చర్చను రెసిడెంట్ కో-ఆర్డినేటర్ ‘నిరోధించార‘న్న ఆరోపణతో మేం తీవ్రంగా విభేధిస్తున్నాం’’ అని యాంగాన్‌లో ఐరాస అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)