ఇన్‌స్టంట్ బ్లడ్‌టెస్ట్: 20 నిమిషాల్లోనే గుండెపోటు నిర్ధరణ

  • 1 అక్టోబర్ 2017
ఛాతీలో గుండె ప్రతీకాత్మక చిత్రం Image copyright Science Photo Library

లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌ టీమ్.. వేలాది మంది పేషెంట్లపై పరీక్షలు నిర్వహించిన అనంతరం, సీఎమ్‌వైసీ పరీక్ష మరో ఐదేళ్లలో అందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.

ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే.., గుండెపోటో, ఛాతీ నొప్పో నిమిషాల్లో తేల్చేసి పేషెంట్లను ఇంటికి పంపేయొచ్చు. దీనివల్ల యేటా కోట్లాది రూపాయలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు.

గుండెపోటా? ఛాతి నొప్పా?

ఛాతి నొప్పి వచ్చే రోగులలో మూడింట రెండొంతుల మందికి గుండెపోటు వచ్చే అవకాశం లేదు.

ప్రస్తుతం ఈసీజీ ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తెలుసుకుంటున్నారు.

ఛాతి నొప్పి అనుమానం కలిగి, ఈసీజీ క్లియర్‌గా ఉంటే, వారికి ట్రోపోనిన్‌ అనే రక్తపరీక్ష నిర్వహిస్తున్నారు. కానీ గుండె కండరాలు దెబ్బ తిన్న విషయం తెలుసుకోవాలంటే.. ఈ పరీక్షను ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ మళ్లీ చేయాలి.

గుండెపోటు తర్వాత ట్రోపోనిన్‌ ప్రొటీన్లకన్నా, రక్తంలోని సీఎమ్‌వైసీ (కార్డియాక్ మయోసిన్-బైండింగ్ ప్రొటీన్ సి) స్థాయి చాలా వేగంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

సీఎమ్‌వైసీ పరీక్ష ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందో లేదో వెంటనే నిర్ధారించవచ్చని పరిశోధకులు 'సర్క్యులేషన్' పత్రికలో తెలిపారు.

సీఎమ్‌వైసీ పరీక్ష భేష్

స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్‌ దేశాలలో ఛాతి నొప్పితో బాధపడుతున్న సుమారు రెండు వేల మంది రోగులపై ట్రోపోనిన్‌, సీఎమ్‌వైసీ రక్త పరీక్షలు నిర్వహించారు.

ఈ కొత్త పరీక్ష ద్వారా మొదటి మూడు గంటల్లోనే ఎవరెవరికి గుండెపోటు వచ్చే అవకాశం లేదో నిర్ధారించేశారు.

''ఈ కొత్త విధానం ద్వారా పేషెంట్లు తమ విలువైన కాలాన్ని ఆసుపత్రి బెడ్లపై వృధా చేసే బాధ తప్పుతుంది'' అని లండన్‌లోని సెయింట్‌ థామస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ టామ్ కైయర్ అన్నారు.

ఈ పరీక్షలతో 15-30 నిమిషాల్లో విశ్వసనీయమైన ఫలితాలు వస్తాయన్నారు.

సీఎమ్‌వైసీ పరీక్షల ద్వారా ఆయన పని చేస్తున్న హాస్పిటల్‌లోనే సుమారు రూ. 70 కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా. అదే దేశవ్యాప్తంగా లెక్కిస్తే అది లక్షల కోట్లలోకి చేరుతుంది.

బ్రిటిష్ కార్డియో వాస్క్యులర్ సొసైటీకి చెందిన ప్రొ. సైమన్ రే.. ట్రోపోనిన్‌ పరీక్ష స్థానంలో కొత్త పరీక్షను ప్రవేశపెట్టే ముందు మరికొంత పరిశోధన జరగాలని సూచిస్తున్నారు.

''గుండెపోటు సూచనలు కనిపించిన వెంటనే ఈ పరీక్షను నిర్వహించవచ్చు. ఇది గుండెపోటా లేక కేవలం ఛాతీ నొప్పా? అన్నది కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు. అదీ అన్నిటికన్నా ముఖ్యం'' అని రే అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)