పాక్ దైవదూషణ చట్టంలో మార్పులపై సన్నగిల్లిన ఆశలు

పాకిస్తాన్లో దైవదూషణ చట్టం అమలు తీరుపై చాలా విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగత ద్వేషాలను తీర్చుకునేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు.
మర్దన్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు ఏప్రిల్‌లో దారుణ హత్యకు గురైన తర్వాత ఈ చట్టాన్ని ప్రభుత్వం సవరిస్తుందని, ఈ దిశగా అడుగులు పడతాయనే ఆశలు కలిగాయి.
అయితే, ఈ హత్య జరిగి ఆరు నెలలవుతున్నాపురోగతి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, రెండు కీలకమైన దైవదూషణ ఉదంతాలపై పరిశీలన జరిపి అందిస్తున్న కథనం ఇది.
ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తిని కలిసేందుకు ఇటీవల పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు వాయవ్య దిశలో ఉన్న హరీపూర్ అనే చిన్న పట్టణానికి వెళ్లాను.
దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆయన కుమారుడు మషల్ ఖాన్‌ను అతడు చదివే విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే క్రూరంగా చంపేశారు.
ఇక్బాల్‌ను కలవడం ఇదే తొలిసారి. ఇక్బాల్‌కు అసాధారణమైన గుండెనిబ్బరం ఉంది. తన కుమారుడి హత్య జరిగిన రోజు క్షణ కాలం కూడా ఆయన సంయమనం కోల్పోలేదు.
ఆ రోజు మీడియాతో మాట్లాడుతున్నప్పడు ఒక్క కన్నీటి బొట్టునూ బయటకు రానీయకుండా ఆయన తనను నియంత్రించుకొన్న తీరు ఇప్పటికీ గుర్తుంది.
ఇక్బాల్‌ను హరీపూర్ జైలు వెలుపల కలిశాను. మషల్ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన అక్కడకు వచ్చారు. హత్య జరిగాక ఆరు నెలల కాలంలో న్యాయపరంగా జరిగిన తొలి పరిణామం ఈ విచారణే.
ఈ కేసులో దాదాపు 57 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. కేసు పరిష్కారమయ్యే సరికి సంవత్సరాలు పట్టొచ్చు.
న్యాయాన్ని హత్య చేయనివ్వకూడదనే పోరాటం: ఇక్బాల్
ఏం జరిగినా సరే, తన కుమారుడి హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాడాలని ఇక్బాల్ సంకల్పించుకొన్నారు.
‘‘ఈ దేశ చరిత్రలో ఎన్నడూ న్యాయం జరగలేదు. మషల్ మాదిరే న్యాయం కూడా హత్యకు గురికాకూడదనే పోరాడుతున్నా. ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఇదో పరీక్ష. ఇప్పడు న్యాయం జరిగితే మార్పుకు నాంది అవుతుంది. దేశ ప్రతిష్ఠ కచ్చితంగా పెరుగుతుంది’’ అన్నారు ఇక్బాల్.
1991లో మరణ శిక్షను ప్రవేశపెట్టాక పాక్‌లో దైవదూషణ సంబంధ హింస వల్ల సుమారు 2,500 మంది హత్యకు గురయ్యారు.
గిట్టనివారిపై వ్యక్తిగత ద్వేషాన్ని తీర్చుకునేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు.
ఈ చట్టానికి వ్యతిరేకంగా నినదిస్తూ, దీనిని సమూలంగా మార్చాలని డిమాండ్ చేస్తున్న బాధితుల్లో ఇక్బాల్ ఒకరు.
జైల్లో మగ్గుతున్న ఆసియా బీబీ
దైవదూషణకు సంబంధించిన కీలకమైన కేసుల్లో ఒకటి తొమ్మిదేళ్లుగా న్యాయస్థానాల్లో నడుస్తోంది. ఇది ఆసియా బీబీ అనే క్రైస్తవ మహిళకు సంబంధించినది.
ఆమెకు ఐదుగురు సంతానం. ఆమె పండ్ల తోటలో పనిచేసేవారు. ఒకే గ్లాసుతో నీళ్లు తాగే విషయమై ముస్లింలైన కొందరు తోటి పనివారికీ, ఆమెకు గొడవ అయ్యింది.
కొన్ని రోజుల తర్వాత స్థానిక మసీదుకు చెందిన మతపెద్ద ఒకరు.. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అనుచితంగా మాట్లాడావంటూ ఆసియా బీబీపై ఆరోపణలు చేశారు. ఆమెపై దైవదూషణ కేసు పెట్టించారు.
పాక్‌లో ఉన్న చట్టం ప్రకారం మహ్మద్ ప్రవక్తపై దైవదూషణకు పాల్పడితే మరణ శిక్ష పడుతుంది. స్థానిక కోర్టు ఆసియా బీబీకి మరణ శిక్ష విధించింది.
ఆమె లాహోర్ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. మరణ శిక్షను హైకోర్టు సమర్థించింది. తర్వాత ఆసియా బీబీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. రెండేళ్లుగా ఆమె అప్పీలు పెండింగ్‌లో ఉంది.
న్యాయ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఆసియా బీబీని జైల్లో ఒంటరిగా ఉంచారు. కుటుంబం అజ్ఞాతంలో తలదాచుకొంటోంది.
నేను ఇంతకుముందు చివరిసారిగా 2015 జనవరిలో ఆసియా బీబీ భర్త ఆషిక్ మసిహ్‌ను కలిశాను. తన మాటలు తన భార్యకు ప్రాణాపాయాన్ని కలిగించవచ్చనే ఆందోళనతో ఆయన ఆచితూచి మాట్లాడారు.
ఇప్పుడు ఆషిక్లో నిస్పృహ కనిపిస్తోంది. ఒక అజ్ఞాత ప్రదేశంలో ఆయన్ను కలిశాను. ‘‘ఈ తొమ్మిదేళ్లలో మాకు న్యాయం చేసుండాల్సింది. మన వేదనను ఎవరూ పట్టించుకోకపోతే ఇంకా బాధగా ఉంటుంది’’ అన్నారాయన.
కావాలనే జాప్యం: ఆషిక్
ఆషిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్నా, కుటుంబంలో ఎంతో స్థైర్యాన్ని నింపగలిగారు. అయితే రాజ్యవ్యవస్థ తమకు న్యాయం అందించడంలో విఫలమైందని ఆయన అనుకొంటున్నారు.
‘‘నిజంగా న్యాయపరమైన కారణాల వల్లే కేసు పరిష్కారం ఆలస్యమవుతోందా, లేక మతపెద్దల ఒత్తిడికి అధికార యంత్రాంగం తలొగ్గుతోందా అన్నది చెప్పలేను. నాకైతే, కావాలనే జాప్యం చేస్తున్నారనిపిస్తోంది’’ అన్నారు.
ఇక్బాల్, ఆషిక్ ఇద్దరూ ఒకే విధమైన పోరాటం చేస్తున్నారు. కానీ వారిద్దరి కేసుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది.
2011లో ఆసియా బీబీకి మద్దతు తెలిపేందుకు ప్రయత్నించిన పంజాబ్ అప్పటి గవర్నర్ సల్మాన్ తజీర్ను ఆయన గన్‌మ్యానే చంపేశాడు. ఇది జరిగి ఆరేళ్లు దాటిపోయింది. అయినా మషల్ హత్యకు వ్యతిరేకంగా పాక్ పౌర సమాజం నినదిస్తూనే ఉంది. దైవదూషణ కేసులో నిందితుడైన వ్యక్తికి మద్దతుగా వీధుల్లోకి వచ్చింది.
నాడు ఖండించిన నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్
అప్పట్లో మషల్ హత్య అధికారంలో ఉన్నవారినీ ఆలోచింపజేసింది. ఈ చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత గురించి పార్లమెంటేరియన్లు తొలిసారిగా సభలో గళం విప్పారు.
దైవదూషణ ఆరోపణలకు సంబంధించి ఏ మాత్రం విచక్షణ లేకుండా జరుగుతున్న ‘మూక న్యాయం’ తనకు దిగ్ర్భాంతి, తీవ్రమైన విచారం కలిగిస్తోందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాడు ఒక ప్రకటనలో స్పష్టంగా చెప్పారు.
మషల్ హత్యను మొదట్లోనే ఖండించినవారిలో మతపెద్దల మద్దతుకు ప్రయత్నించిన విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు.
ఇది ఆశ్చర్యకరమేమీ కాదు: మానవ హక్కుల కార్యకర్త
హత్య జరిగి ఆరు నెలలు కావొచ్చే సరికి, దైవదూషణ చట్టాన్ని సవరించాలనే చర్చ పక్కకు వెళ్లిపోయింది. ఇలా జరగడం ఆశ్చర్యకరమేమీ కాదంటున్నారు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త హుస్సేన్ నఖీ.
‘‘దైవదూషణ కేసులు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. ప్రాణాపాయం వెంటాడటమే దీనికి కారణం. న్యాయస్థానాలకూ భయం ఉంటుంది. అత్యంత శక్తిమంతమైన భద్రతా వ్యవస్థల్లోనూ అతివాద మద్దతుదారులు, సానుభూతిపరులు ఉన్నారు. వారు బాహాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. వారికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు’’ అని హుస్సేన్ నఖీ తెలిపారు.
మతపరమైన మైనారిటీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అయితే పట్టించుకునే నాథుడే లేడు.
ఇలాంటి కేసుల్లో ఎవరికీ మరణ శిక్ష పడకపోయినా, నిందితులుగా ఉన్నవారు పదుల సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్నారు.
మార్పు సూచనలు లేవు
మషల్ హత్యపై ప్రజాగ్రహం పెద్దయెత్తున పెల్లుబికినా, అది దైవదూషణ చట్టం విషయంలో పాక్ సమాజంలో కీలకమైన మార్పును తీసుకురానుందనే సూచనలేవీ ప్రస్తుతం కనిపించడం లేదు.
తన కుమారుడు మషల్ ఎన్నటికీ తిరిగిరాడని ఇక్బాల్‌కు తెలుసు. ఆయన పరిమిత వనరులతో కాలం వెళ్లదీస్తున్నారు. మరెంతో మంది తన కుమారుడి మాదిరి బలవ్వకుండా చూసేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)