విమాన ప్రయాణాల వివాదం: మూల్యం చెల్లించుకున్నప్రైస్

  • 30 సెప్టెంబర్ 2017
టామ్ ప్రైస్ Image copyright Alex Wong/Getty Images)
చిత్రం శీర్షిక టామ్ ప్రైస్

విధి నిర్వహణకు ఖరీదైన ప్రైవేటు విమానాలను ఉపయోగించినందుకు విమర్శలను ఎదుర్కొన్న అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి టామ్ ప్రైస్ తన పదవికి రాజీనామా చేశారు.

నిబంధనల ప్రకారం, జాతీయ భద్రత వ్యవహారాలను చూసే ప్రభుత్వ అధికారులు తప్ప ఎవరైనా విధి నిర్వహణకు సంబంధించిన ప్రయాణాలకు సాధారణ వాణిజ్య విమానాలనే ఉపయోగించాలి.

ఈ ఏడాది మే నుంచి ఇటీవలి వరకు దాదాపు రూ.2.61 కోట్ల (నాలుగు లక్షల డాలర్ల) ప్రజాధనాన్ని వెచ్చించి 26 సార్లు అధిక ఖర్చుతో కూడిన ప్రైవేటు విమాన ప్రయాణాలు చేసినందుకు ప్రైస్ ఇంతకుముందు క్షమాపణలు చెప్పారు. ప్రైవేటు విమాన ప్రయాణాలకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లిస్తానన్నారు.

అమెరికా వెలుపల ప్రయాణాలకు ఉపయోగించిన సైనిక విమాన ఖర్చు కూడా ఈ వ్యయంలో ఉంది. ఈ ప్రైవేటు విమానాల వ్యయం కాకుండా మరో రూ.4.89 కోట్ల (7.5 లక్షల డాలర్లు)కు పైగా ప్రజాధనాన్ని ప్రయాణాల కోసం ప్రైస్ వెచ్చించినట్లు పొలిటికల్ న్యూస్ వెబ్‌సైట్ పొలిటికో తెలిపింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ‌ృందంలో ప్రైవేటు విమానాలను ఉపయోగించిన మరో ముగ్గురి విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈ ముగ్గురిలో అంతర్గత వ్యవహారాల మంత్రి ర్యాన్ జింకే, ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ నుచిన్, పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ చీఫ్ స్కాట్ ప్రూయిట్ ఉన్నారు.

Image copyright Mark Wilson/Getty Images
చిత్రం శీర్షిక ర్యాన్ జింకే

ప్రైస్ ప్రైవేటు విమానాల ప్రయాణ ఖర్చుపై అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు అసంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రైస్ రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరోగ్య శాఖ ఉప సహాయ మంత్రిగా ఉన్న డాన్ జే రైట్‌‌‌ను తాత్కాలిక మంత్రిగా నియమించినట్లు చెప్పింది.

ఒబామా కేర్ స్థానంలో రిపబ్లికన్ ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్‌ ఆమోదాన్ని సాధించలేకపోతే ప్రైస్‌ను పదవి నుంచి తొలగిస్తానని ట్రంప్ జులైలో సరదాగా అన్నారని బీబీసీ న్యూస్ వాషింగ్టన్ ప్రతినిధి ఆంథోనీ జుర్చర్ తెలిపారు.

ఒబామా కేర్ రద్దు ప్రయత్నాల్లో ఈ వారంలో కూడా ట్రంప్ బృందానికి ప్రతికూల పరిణామం చోటుచేసుకొందని బీబీసీ ప్రతినిధి చెప్పారు. ఇంతలో ప్రైవేటు విమాన ప్రయాణాల వివాదంలో ప్రైస్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.

ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఒబామా కేర్ రద్దును ప్రైస్ సాధించి పెట్టి ఉంటే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చేది కాదేమోనని అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)