రెఫరెండం నేపథ్యంలో కుర్దిస్తాన్‌కు ఇరాక్ షాక్

  • 30 సెప్టెంబర్ 2017
ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం Image copyright Getty Images

కుర్దిస్తాన్‌కు అంతర్జాతీయ విమాన రాకపోకలను ఇరాక్ నిలిపివేసింది. ఇర్బిల్, సులైమనియా విమానాశ్రయాలపై కుర్దులు పట్టు విడిచే వరకు కేవలం దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని ఇరాక్ ప్రభుత్వం షరతులు విధించింది.

ఇరాక్ నుంచి విడిపోయేందుకు కుర్దిస్తాన్‌ ప్రాంత ప్రజలు పట్టబుడుతున్నారు. తాజాగా నిర్వహించిన రెఫరెండం పోల్స్‌లో వేర్పాటువాదానికి అనుకూలంగా 92 శాతం మంది కుర్దిష్ ప్రజలు ఓటేశారు. దాంతో ఇరాక్ సెంట్రల్ సర్కారుపై ఒత్తిడి పెరిగింది.

అయితే ఆ రెఫరెండం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాది వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెంటనే విమాన సర్వీసులను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కుర్దిస్తాన్‌ స్పయంపాలిత ప్రాంతమైనా.. విమానాల రాకపోకల నియంత్రణ మాత్రం ఇరాక్ పౌర విమానయాన శాఖ ఆధీనంలోనే ఉంటుంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఇరాక్ నిర్ణయంతో అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.

శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి అంతర్జాతీయ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ఇరాక్ వెల్లడించింది. సహాయ, మిలిటరీ, దౌత్యపరమైన అవసరాల కోసం వినియోగించే విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

అయితే ఇరాక్ చేస్తున్న డిమాండ్‌‌ అన్యాయమైందని కుర్దిస్తాన్‌ ప్రభుత్వం పేర్కొంది. రెఫరెండంలో ప్రజలు తమ ఆకాంక్షను స్పష్టంగా వెల్లడించారని, ఇప్పుడు ఇరాక్‌తోపాటు, పొరుగు దేశాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కుర్దిష్ నాయకులు అంటున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు