అంతుచిక్కని దాడులతో అమెరికా దౌత్య సిబ్బందికి అనారోగ్యం

  • 1 అక్టోబర్ 2017
హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయం Image copyright ADALBERTO ROQUE/AFP/Getty Images
చిత్రం శీర్షిక హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయం

క్యూబా రాజధాని హవానాలోని తమ దౌత్య కార్యాలయం నుంచి సగానికి పైగా సిబ్బందిని అమెరికా వెనక్కు రప్పిస్తోంది. దౌత్య సిబ్బంది లక్ష్యంగా కొన్ని అంతుచిక్కని దాడులు జరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. అత్యవసర సిబ్బందిని మాత్రమే అక్కడ కొనసాగిస్తోంది.

వినిపించకపోవడం, తలతిప్పడం, వికారంగా అనిపించడం, స్వల్పంగా బ్రెయిన్ ట్రామా లాంటి సమస్యలు తలెత్తినట్లు కనీసం 21 మంది అమెరికా దౌత్య సిబ్బంది చెప్పారు.

ఇవి కూడా చదవండి

కనీసం ఇద్దరు కెనడియన్లపైనా దాడుల ప్రభావం పడింది.

ఈ దాడులు శబ్ద తరంగాలతో చేసిన దాడులు(సోనిక్ అటాక్స్) అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఇందులో తమకు ఎలాంటి పాత్రా లేదని క్యూబా చెప్పింది.

వీసా ప్రక్రియ నిలిపివేత

కొన్ని దాడులు హోటళ్లలో జరగడంతో క్యూబాను సందర్శించవద్దని అమెరికన్లను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. క్యూబాలో వీసా జారీ ప్రక్రియను నిరవధికంగా నిలిపివేసింది.

దాడులకు అమెరికా క్యూబా ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదు. వీటిపై అమెరికా, క్యూబా సంయుక్తంగా దర్యాప్తు జరుపుతాయని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్‌సన్ తెలిపారు. దౌత్య సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దాడులు ఎలా జరుగుతున్నాయో తెలియడం లేదని అమెరికా విదేశాంగ అధికారి ఒకరు శుక్రవారం చెప్పారు. తమ దౌత్య సిబ్బందికి క్యూబా ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రత కల్పించే వరకు అత్యవసర సిబ్బందిని మాత్రమే కొనసాగిస్తామన్నారు.

దౌత్య సిబ్బందిని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించడం తొందరపాటు చర్యని క్యూబా వ్యాఖ్యానించింది. ఇది దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని చెప్పింది. అయితే అమెరికాకు సహకారాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)