ఐర్లాండ్లో అబార్షన్ చట్టాన్ని మార్చాలంటూ నిరసనలు

  • 1 అక్టోబర్ 2017
డబ్లిన్‌లో ర్యాలీ తీస్తున్న ప్రజలు Image copyright RTÉ
చిత్రం శీర్షిక యూరప్‌లోని అత్యంత కఠిన చట్టాల్లో అబార్షన్ చట్టం ఒకటి.

అబార్షన్ చట్టాన్ని సవరించాలంటూ ఐర్లాండ్‌లో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. డబ్లిన్‌ వీధుల్లో వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు.

ఐర్లాండ్‌లోని అత్యంత కఠినమైన చట్టాల్లో గర్భస్రావ నియంత్రణ చట్టం ఒకటి. తల్లికి, కడుపులోని బిడ్డకు సమాన ప్రాధాన్యమిస్తూ 1983లో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

ఈ చట్టం ప్రకారం తల్లి ప్రాణానికి ముప్పు ఉందని తేలితేనే గర్భస్రావానికి అనుమతిస్తారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా అబార్షన్ చేయించుకున్నట్లు తేలితే 14 ఏళ్ల వరకూ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

దీంతో ఏటా ఐర్లాండ్ నుంచి వేల మంది గర్భస్రావం చేయించుకునేందుకు విదేశాలకు వెళ్తున్నారు.

Image copyright RTÉ

రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టంలో మార్పులు చేయాలంటూ దేశంలో డిమాండ్ పెరుగుతోంది. శనివారం ఐర్లాండ్ పార్లమెంటు వద్ద వేలాదిమంది ఆందోళన నిర్వహించారు. అబార్షన్ చేయించుకునే హక్కును అందరికీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

లండన్‌లోని ఐర్లాండ్ ఎంబసీ వద్ద కూడా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అబార్షన్ కోసం బ్రిటన్‌కు వచ్చే ఐర్లాండ్ మహిళల సంఖ్య మూడు దశాబ్దాలుగా భారీగా పెరుగుతూనే ఉండటం కూడా దీనికో కారణం.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అబార్షన్ చట్టంలో మార్పులు తేవొద్దంటూ వివిధ సంఘాల ప్రచారం

చట్టంలో మార్పులొద్దు

మరోవైపు, చట్టాన్ని మార్చొద్దంటూ పలు సంఘాలు దేశ వ్యాప్తంగా పోటీ ఆందోళనలు చేపట్టాయి. తల్లికి, ఆమె కడుపులోని బిడ్డకు సమాన హక్కులు కల్పిస్తున్నచట్టాన్ని మార్చే సాహసం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇలాంటి డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నాయి.

చట్టాన్ని మార్చాలా? వద్దా? అన్నది నిర్ణయించేందుకు వచ్చే ఏడాది రెఫరెండం నిర్వహించాలని ఐర్లాండ్ నిర్ణయించింది. దానికి సంబంధించి పార్లమెంటరీ సలహా కమిటీని నియమించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)