ఆస్ట్రియాలో బురఖా ధారణపై నిషేధాన్ని ఖండించిన ముస్లింలు

  • 1 అక్టోబర్ 2017
బురఖా ధరించిన మహిళ Image copyright Getty Images

ఆస్ట్రియాలో ముఖం మొత్తాన్ని కనిపించకుండా ఉంచే బురఖాను, నిఖాబ్‌ను బహిరంగ ప్రదేశాల్లో ధరించడాన్ని నిషేధించే చట్టం ఆదివారం అమల్లోకి వచ్చింది.

నుదురు నుంచి చుబుకం వరకు ముఖమంతా తప్పక కనిపించేలా వస్ర్తధారణ ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఇది ఆస్ట్రియా విలువల పరిరక్షణకు సంబంధించిన చట్టమని ప్రభుత్వం చెబుతోంది.

బహిరంగ ప్రదేశాల్లో మెడికల్ మాస్కులు ధరించడం, క్లోన్ మేకప్ వేసుకోవడంపైనా ఈ చట్టం ఆంక్షలు పెడుతోంది.

ఈ నెలలో ఆస్ట్రియాలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో మితవాద భావజాలమున్న ‘ఫ్రీడమ్ పార్టీ’ మంచి ఫలితాలు సాధించే అవకాశముంది.

ముస్లిం గ్రూపులు ఈ చట్టాన్ని ఖండించాయి. ఆస్ట్రియాలోని ముస్లింలలో కొంత మందే ఇలాంటి బురఖాలు ధరిస్తారని ప్రస్తావించాయి.

ఆస్ట్రియాలో ముఖాన్ని పూర్తిగా కప్పేసే బురఖాను దాదాపు 150 మంది మహిళలు ధరిస్తారనే అంచనా ఉంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యపై ఈ చట్టం ప్రభావం చూపుతుందని పర్యాటక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.

యూరప్‌లోని ఫ్రాన్స్, బెల్జియం బురఖాపై 2011లో నిషేధం విధించాయి. నెదర్లాండ్స్‌లోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జర్మనీలోనూ చట్టపరంగా వీలైన చోటల్లా ముఖం మొత్తం కనిపించకుండా ఉంచే బురఖాను ధరించడంపై నిషేధం విధించాల్సి ఉందని జర్మనీ ఛాన్సలర్ ఏంగెలా మెర్కెల్ చెప్పారు.

యూకేలో బురఖా, నిఖాబ్‌లపై నిషేధం లేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)