అవార్డులను వెనక్కు ఇవ్వడానికి నేనేమీ అమాయకుడిని కాను: ప్రకాశ్ రాజ్

 • 3 అక్టోబర్ 2017
Image copyright Getty Images

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

‘డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ బెంగళూరులో అక్టోబర్ 1న నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యను ప్రస్తావిస్తూ మోదీని ఇలా విమర్శించారు..

 • "గౌరిని హత్య చేసిన వాళ్ల గురించి మనకు తెలియదు. కానీ, వాళ్లెవరో తెలిసిన వాళ్లు మాత్రం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వీళ్ళను ప్రధాన మంత్రి కూడా ఫాలో చేస్తున్నారు."
 • "ఈ విషయంలో ప్రధాన మంత్రి కళ్ళు మూసుకొని ఉన్నారు. యూపీలో ఉన్నది పూజారా? లేక ముఖ్యమంత్రా? అనేది కూడా మనకు తెలియదు."
 • " నాకు ఐదు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని మీకందరికీ తెలుసు. వీటిని నేను తిరిగిచ్చేయాలి. నేను ప్రముఖ యాక్టర్‌ని. మీరు యాక్టింగ్ చేస్తున్నారని నేను తెలుసుకోలేననుకుంటున్నారా. కనీసం నన్నైనా గౌరవించండి. "
 • " నేను ఒక యాక్టర్‌ని, ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో నాకు తెలుసు."

ఈ వీడియో అదేరోజు మధ్యాహ్నం సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీంతో ప్రకాష్ రాజ్ తన అవార్డులు తిరిగిచ్చేస్తారనే ప్రచారం జరిగింది.

Image copyright Twitter

ప్రకాష్ రాజ్ వివరణ

ఆ తర్వాత జాతీయ అవార్డుల్ని తిరిగిచ్చేస్తారనే ప్రచారం పై ఓ వీడియో ద్వారా ప్రకాష్ రాజ్ వివరణనిచ్చారు. ట్విటర్‌లో పెట్టిన ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే..

 • "నేను అవార్డు తిరిగిచ్చేస్తాననే న్యూస్ చానళ్ల ప్రచారం చూస్తే నవ్వొస్తోంది. అవార్డు తిరిగిచ్చేంత మూర్ఖుడిని కాదు నేను.‘‘
 • "ఈ అవార్డులు నా నటనకు దక్కాయి. ఈ అవార్డులు పొందినందుకు నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు పనికొచ్చే విషయం మాట్లాడతా".
 • "గౌరి లంకేశ్‌ను అమానుషంగా హత్య చేయడంతో నేను చాలా బాధపడ్డాను. దీనిపై నేను స్టేజ్‌పై కూడా స్పందించాను. ఎవరు హత్య చేశారో తెలియదు. కానీ కొందరు దీనిపై సంతోషం వ్యక్తం చేశారు."
 • "ఇలాంటి వాళ్లపై నాకు కోపం వచ్చింది. నా స్పందనతో సోషల్ మీడియాలో నన్ను గేలి చేశారు. అయినా నేను దాన్ని అంగీకరించాను."
 • " నా ప్రశ్నఏమిటంటే ఇలాంటి వాళ్ళను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫాలో చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మౌనంగా ఉండటం ఒక దేశ పౌరుడిగా నాకు ఆందోళన కలిగిస్తోంది."
 • "నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నాకు ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడాలని కూడా లేదు."
 • "భారత దేశ పౌరుడిగా నేను ప్రధాన మంత్రి మౌనంపై మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు ఈ విషయంలో మౌనంగా ఉండటం నాకు బాధ కలిగిస్తోంది."
 • "కానీ నేను అవార్డు తిరిగిచ్చేస్తాననే ప్రచారం నిజం కాదు."

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు