లాస్ వెగాస్ కాల్పులు: అమెరికాకు వచ్చిన పాడాక్ ప్రియురాలు

  • 5 అక్టోబర్ 2017
లాస్ వెగాస్ కాల్పులు
చిత్రం శీర్షిక పాడాక్ ప్రియురాలు డాన్లీ గతంలో కసీనోలో పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు

లాస్ వెగాస్ ఘటనలో సరికొత్త కోణం… సంగీత విభావరిపై తూటాల వర్షం కురిపించిన స్టీఫెన్ పాడాక్ కు ఒక ప్రియురాలు ఉందట.

ఆమె పేరు మెరిలో డాన్లీ (62). కాల్పులకు తెగబడే ముందు స్టీఫెన్ ఆమె ఖాతాకు సుమారు రూ.65 లక్షలు ( లక్ష డాలర్లు) పంపించాడని వార్తలు వినపడుతున్నాయి.

ఫిలిప్పీన్స్ నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఆమె నేరుగా పోలీసుల వద్దకు వెళ్లారు.

విచారణకు ఆమె స్వచ్ఛందంగానే అంగీకరిస్తారని పోలీసులు భావిస్తున్నట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ వెల్లడించింది. ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్నఆమె 20 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు.

ఇవి కూడా చూడండి

ఆమెను అనుమానించొచ్చా?

లాస్ వెగాస్ లో జరిగిన దుర్ఘటనకు ఈమెకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. ఘటనకు ముందు ఆమె ఖాతాకు స్టీఫెన్ నగదు పంపినట్లు ఫిలిప్పీన్స్ 'నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్' వెల్లడించినట్లు వార్తా ఏజెన్సీ ఏఎఫ్ పీ తెలపడం అనుమానాలకు తావిస్తోంది.

చిత్రం శీర్షిక పాడాక్ తనను పిచ్చిగా ప్రేమించాడని డాన్లీ చెబుతోంది

అనుమానించదగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆమెను పోలీసులు పరిగణిస్తున్నారు. సెప్టెంబరు చివర్లో ఆమె ఫిలిప్పీన్స్ కు వెళ్లి అక్కడే ఉన్నట్లు స్థానిక పత్రికలు కథనాలు వెలువరించాయి.

డాన్లీని… స్టీఫెన్ అకస్మాత్తుగా ఫిలిప్పీన్స్ కు పంపాడని, ఆమెకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని డాన్లీ సోదరీమణులు ఆస్ట్రేలియా వార్తా సంస్థ 7న్యూస్ కు వెల్లడించారు. సెప్టెంబరు 28న మాండలే బే హోటల్ లో స్టీఫెన్ దిగాడు. డాన్లీ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా తన వెంట తీసుకొచ్చినట్లు సమాచారం.

ఎలాంటి బంధం?

స్టీఫెన్ పాడాక్ సోదరుడు ఎరిక్ పాడాక్ న్యూయార్క్ టైమ్స్ కు తెలిపిన వివరాల ప్రకారం.. మెరిలో డాన్లీ అంటే స్టీఫెన్ కు పిచ్చి ప్రేమని తెలుస్తోంది. స్టీఫెన్ కు జూదం అలవాటు ఉంది. అందుకోసమే నెవడాలో నివాసముంటున్నాడు. ఆ సమయంలోనే అక్కడ పని చేసే డాన్లీతో అతనికి పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. అయితే వారి మధ్య అంత సఖ్యత లేదని లాస్ ఏంజెల్స్ టైమ్స్ కథనం చెబుతోంది. మెస్కీట్ (నెవడా)లో ఒక కాఫీ షాపు వద్ద బహిరంగంగానే ఆమెను స్టీఫెన్ దుర్భాషలాడినట్లు కొందరు చెప్పారని ఆ పత్రిక వెల్లడించింది.


ఎవరీ మెరిలో డాన్లీ?

ఫిలిప్పీన్స్ లో పుట్టిన మెరిలో డాన్లీకి 1980లో ఓ ఆస్ట్రేలియన్ తో వివాహం అయింది. ఆ తరువాత అమెరికా వెళ్లి గేరీ డాన్లీని ఆమె పెళ్లి చేసుకున్నారు. 2015లో అతనితో విడిపోయారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్, అమెరికా మీడియా అవుట్ లెట్స్ కథనాల ఆధారంగా ఈ విషయాలు తెలుస్తున్నాయి.


ఇప్పటికీ అంతు చిక్కని అంశం

తాను ఉన్న మాండలే బే హోటల్ గది లోపల బయటా అనేక కెమెరాలను స్టీఫెన్ అమర్చాడు. రెండు కెమెరాలు హాలులో ఉంచగా, పోలీసులు వస్తుంటే గమనించేందుకు మరో కెమెరాను తలుపులో బిగించాడు.

దాదాపు 58 మందిని పొట్టన పెట్టుకుని తనను తాను కాల్చుకున్న స్టీఫెన్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో మాత్రం పోలీసులకు ఇంకా అంతుచిక్కకుండా ఉంది.

19 తుపాకులు

నెవడాలోని అతని ఇంట్లో అనేక రకాల ఆయుధాలు బయటపడినట్లు తెలుస్తోంది. 19 తుపాకులు, వేల రౌండ్ల బుల్లెట్లు, పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం