కొడుక్కి టీకాలు వేయించలేదని తల్లికి జైలు శిక్ష

రెబెకా బ్రెడో

ఫొటో సోర్స్, WXYZ

ఫొటో క్యాప్షన్,

పిల్లలకు టీకాలు వేయించడానికి నేను వ్యతిరేకం

తన కొడుక్కి టీకాలు వేయించలేదని, మిషిగన్ కోర్టు, రెబెకా బ్రెడో అనే మహిళకు 7రోజుల జైలుశిక్షను విధించింది.

రెబెకా బ్రెడో 2008లో తన భర్తతో విడిపోయింది. అయితే పిల్లలకు టీకాలు వేయించే విషయంలో, ఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు ఉండేవి. అప్పట్లో ఆ విషయాన్ని తాత్కాలికంగా వదిలేశారు.

కానీ, కొడుక్కి తప్పనిసరిగా టీకాలు వేయించాల్సిందేనని రెబెకా మాజీ భర్త పట్టుపట్టారు. దీంతో పిల్లాడికి టీకాలు వేయించేందుకు ఒప్పుకుంటూ భర్తతో ఓ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ టీకాలు వేయించలేదు. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అమెరికాలో చాలామంది తల్లిదండ్రులు, పిల్లలకు వ్యాక్సిన్ వేయించరు. ఈ టీకాల వల్ల పిల్లల్లో బుద్దిమాంద్యం వస్తుందని వారి నమ్మకం.

ఈ నేపథ్యంలో, తన పిల్లాడి తండ్రితో చేసుకున్న ఒప్పందం మీరినందుకుగానూ ఓక్‌ల్యాండ్ కోర్టు రెబెకాకు 7రోజుల జైలుశిక్షను విధించింది. రెబెకాకు ఇద్దరు పిల్లలు.

అగ్రిమెంట్ ప్రకారం, టీకాలు వేయించేందుకు పిల్లాడిని తండ్రికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

తనకు జైలుశిక్ష విధించినప్పటికీ, రెబెకా అభిప్రాయం మారలేదు.

‘నేను పిల్లలకు టీకాలు వేయించే విషయంలో అవగాహన వున్న తల్లిని. నాకు నమ్మకం లేని టీకాలను వేయించడంకంటే జైలు ఊచలను లెక్కపెట్టడం మేలు’ అంటూ ఘాటుగా స్పందించింది.

వ్యాక్సినేషన్ అంశంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో, మిషిగన్ 43వ స్థానంలోవుంది.

వ్యాక్సిన్ వేయించనందుకు తల్లిదండ్రులు జైలుకెళ్లడం ఇది మొదటిసారి కాదని, నేషనల్ వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధ్యక్షురాలు బార్బరా లోయ్ బీబీసీకి తెలిపారు.

అమెరికా ప్రభుత్వం, వ్యాక్సిన్ వేయించడాన్ని చట్టబద్దం చేయలేదు. ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకు, వదిలేస్తుంది.

కానీ పాఠశాలలు మాత్రం, వ్యాక్సినేషన్‌ను చేయించుకోని పిల్లలను తరగతులకు అనుమతించవు. క్రమశిక్షణా చర్యలలో భాగంగా, పిల్లల తల్లిదండ్రులను జైలుకు పంపే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ కారణంతో వ్యాక్సినేషన్ చేయించని తల్లిదండ్రులు, తమ పిల్లలను స్కూల్స్‌కు పంపకుండా ఇంట్లోనే చదివిస్తున్నారని బార్బరా ఫిషర్ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)