అణ్వాయుధాల వ్యతిరేక పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి

  • 6 అక్టోబర్ 2017
నోబెల్ శాంతి బహుమతి Image copyright Getty Images

అణ్వాయుధాల నిర్మూలన కోసం అంతర్జాతీయ ఉద్యమం (ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ - ఐసీఏఎన్)కు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది.

అణ్వాయుధాలను నిర్మూలించే దిశగా ఆ సంఘం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ఛైర్మన్ బెరిట్ రెయిస్-అండర్సెన్ అన్నారు.

ఉత్తర కొరియా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మునుపెన్నడూ లేని విధంగా అణ్వాయుధాల వాడకం పెరిగిపోయింది. అణు ప్రపంచంలో బతుకుతున్నాం’’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని దేశాలూ అణ్వాయుధాలను నిర్మూలించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు.

స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా కొన్ని వందల స్వచ్ఛంద సంస్థలు పదేళ్ల క్రితం ఐసీఏఎన్‌ అనే సంఘాన్ని ఏర్పాటు చేశాయి.

నోబెల్ బహుమతితో పాటు దాదాపు 7.18 కోట్ల రూపాయల నగదు ఈ గ్రూప్‌కి డిసెంబర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అందనుంది.

Image copyright FABRICE COFFRINI/Getty images

క్రమంగా అణ్వాయుధాలను విడనాడేందుకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి ఒడంబడికకు ఈ ఏడాది జులైలో 122 దేశాలు అంగీకారం తెలిపాయి. కానీ, అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధ సంపత్తి కలిగిన 9 దేశాలు మాత్రం ఆ జాబితాలో లేవు.

ఏ దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నాయి?

రష్యా 7,000
అమెరికా 6,800
ఫ్రాన్స్ 300
చైనా 270
బ్రిటన్ 215
పాకిస్తాన్ 120-130
భారత్ 110-120
ఇజ్రాయిల్ 80
ఉత్తర కొరియా 10కంటే తక్కువ
మొత్తం 14,900

ఆధారం: ఐసీఏ‌ఎన్/అమెరికన్ శాస్త్రవేత్తల ఫోరం 2017

అణ్వాయుధాలకు ప్రత్యామ్నాయ మార్గం

విశ్లేషణ: బీబీసీ ప్రతినిధి జొనాథన్ మార్కస్

నోబెల్ కమిటీ నిర్ణయం అణ్వాయుధాల నిర్మూలన ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది.

ఉత్తరకొరియా అణు సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయి. అమెరికా, రష్యాలు అణ్వాయుధాలను ఆధునీకరించే పనిలో ఉన్నాయి.

అణు సామర్థ్యమున్న ఆయుధాలను విడనాడే ఒడంబడికకు ఇప్పటికే పలు దేశాలు అంగీకరించాయి. ఇక నుంచి అణ్వాయుధాలు తయారు చేయబోమని ప్రకటించాయి.

కానీ.. తమ ఆయుధగారాలను వదిలేసేందుకు మాత్రం ఆ దేశాలు ముందుకు రావడంలేదు. అందుకు ప్రత్యామ్నాయ మార్గంగా అణ్వాయుధాల ప్రభావం గురించి అవగాహణ పెంచి, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్న ఆలోచనతో ఐసీఏఎన్ ఏర్పడింది.

ఆంక్షలకు లొంగేది లేదు: ఉత్తర కొరియా

ట్రంప్: ఉత్తర కొరియాతో చర్చలు దండగ

Image copyright Getty Images

నోబెల్ విజేత ఎంపిక ఎలా జరుగుతుంది?

  • ఏటా ఫిబ్రవరి 1లోగా ప్రపంచ దేశాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
  • నార్వే పార్లమెంటు నియమించే ఐదుగురు సభ్యుల కమిటీ ఆ నామినేషన్లను పరిశీలించి 20 నుంచి 30 మందిని షార్ట్లిస్ట్ చేస్తుంది.
  • పై జాబితాలోని అభ్యర్థుల గురించి అంతర్జాతీయ సలహాదారుల బృందం విడివిడా రిపోర్టులు ఇస్తుంది. ఆ రిపోర్టుల ఆధారంగా కమిటీ అభ్యర్థులపై ఓ అవగాహనకు వస్తుంది. జాబితా నుంచి కొందరిని తొలగిస్తుంది.
  • సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరిగే ఆఖరి సమావేశంలో కమిటీ విజేతను ఎంపిక చేస్తుంది.
  • ఒకవేళ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, ఓటింగ్ నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత విజేతను ప్రకటిస్తారు. డిసెంబర్ 10న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది.

నోబెల్: ఆయన చావు వార్తను ఆయనే చదువుకున్నారు!!

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionడైనమైట్‌ను కనుగొన్నందుకు నోబెల్‌ను ‘మృత్యువ్యాపారి’ అని నిందించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)