వరల్డ్‌ కప్ 2022 నిర్వహించేందుకు ఖతార్ సిద్ధమేనా?

  • డాన్ రాన్
  • బీబీసీ స్పోర్ట్స్ ఎడిటర్
నిర్మాణంలో ఉన్న వరల్డ్ కప్ స్టేడియం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం అత్యాధునిక సదుపాయాలతో కూడిన 9 కొత్త స్టేడియంలను నిర్మించాలని ఖతార్ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

ఖతార్‌లో జరగాల్సిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022కు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు క్రీడల నిర్వహణకు అవరోధంగా మారుతున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది.

కార్నర్‌స్టోన్ గ్లోబల్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ రిపోర్టును బీబీసీ సంపాదించింది.

ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఖతార్ వ్యవహరింస్తోందంటూ కొన్నాళ్లుగా ఆ దేశంతో పొరుగు దేశాలు దౌత్య పరమైన సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే.

వరల్డ్ కప్‌పై విదేశీ సంబంధాల ప్రభావం ఎలా ఉంటుందో ఈ రిపోర్టులో పేర్కొన్నారు.

ఖతార్‌లో దాదాపు 13 లక్షల కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టులు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని నిర్మాణ సంస్థలను ఆ రిపోర్ట్ హెచ్చరించింది.

ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు దోహా ఆతిథ్యం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని స్థానిక నిపుణులు అభిప్రాయపడినట్లు అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Warren Little/Getty images

ఫొటో క్యాప్షన్,

ఖతార్ రాజధాని దోహా

ఇబ్బందులేం లేవు: ఖతార్

ఖతార్ 2022 ప్రపంచకప్ నిర్వహణ కమిటీ మాత్రం ఈ అనుమానాలను తోసిపుచ్చింది.

‘‘మధ్య ప్రాశ్చంలో తొలిసారిగా నిర్వహించనున్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు’’ అని స్పంష్టం చేసింది. దౌత్యపరమైన సంక్షోభం ప్రభావం క్రీడల ఏర్పాట్లపై ఏ మాత్రం లేదని బీబీసీతో చెప్పారు.

ప్రామాణికత లేని స్థానిక మీడియా, వూరుపేరులేని వ్యక్తులు చెప్పిన వివరాలతో కార్నర్‌స్టోన్ సంస్థ రిపోర్టు తయారు చేసిందని సుప్రీం కమిటీ విమర్శించింది.

ఖతార్‌లో నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నామని బీబీసీ స్పోర్ట్స్‌కు ఫిఫా తెలిపింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)