కెన్యాలో గాడిద దొంగలు

  • 8 అక్టోబర్ 2017
చైనా స్వీటు Image copyright TAOBAO
చిత్రం శీర్షిక గాడిద చర్మం, మాంసంతో తినుబండారాలు

గుర్రాలకన్నా ముందు మనిషిని మోసిన గాడిదకు ఇప్పుడు కష్టమొచ్చింది. చైనాలో వీటి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.

ఇక్కడ, వీటి చర్మాలను ఒలిచి ఔషధాలను, పౌష్టికాహారాలను తయారు చేస్తున్నారు.

చైనాలో గాడిద మాంసానికి మంచి గిరాకీ ఉంది. వీటి చర్మాలకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది.

మరోవైపు గాడిదల్లో పునరుత్పత్తి కూడా కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ఇలా చైనాలో గాడిదలు తగ్గిపోవడంతో వ్యాపారులు వాటి కోసం విదేశాలవైపు చూస్తున్నారు.

ఇప్పుడు వీరి చూపు, ఆఫ్రికా ఖండం మీద పడింది. ఆఫ్రికాలోని పేద దేశాల్లో, గాడిదలతో వ్యవసాయం చేస్తారు. అక్కడ గాడిదలను రవాణాకు వాడుతూ బతికే పేదవారు చాలా మంది ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జింబాంబ్వేలో 1,50,000 డాలర్లతో ఒక గాడిదల కబేళాను ప్రారంభించనున్నారు.

ఆఫ్రికాలో గాడిదలకు డిమాండ్ పెరగడంతో, వీటి ఖరీదు రెట్టింపు అయ్యింది. దీంతో, వ్యాపారులే కాదు, దొంగలు సైతం ఈ గాడిదల వెంటపడుతున్నారు. గాడిదలను కోల్పోయిన పేదలు, మరో గాడిదను కొనలేక, పూట గడవక నానా అవస్థలూ పడుతున్నారు.

'రాత్రికి రాత్రే గాడిదలు మాయం'

కెన్యాలో, బండిపై నీళ్ళను అమ్ముతూ పొట్టపోసుకునే ఆంథొనీ మాప్ వాన్యామాకు కార్లోస్ అనే గాడిద ఉండేది. ఓ చిన్న నీళ్ల ట్యాంకును కార్లోస్‌కు తగిలించి, నీళ్లు అమ్ముతూ బాగానే సంపాదించేవాడు. తన ఆదాయంతో కొంత భూమి కూడా కొన్నాడు. ఒక ఇల్లు కొన్నాడు. పిల్లల స్కూలు ఫీజులూ కట్టాడు.

మొత్తానికి, తన కుటుంబాన్ని బాగానే చూసుకున్నాడు. చివరకు గాడిద పేరే ఆయనకు ముద్దుపేరు అయ్యింది. బయటివాళ్లు ఆంథొనీని కార్లోస్ అని పిలిచేవారు. ఇదలా ఉండగా ఓ రోజు ఆంథోనీ గాడిదను ఎవరో చంపి.. చర్మం ఒలుచుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆంథోనీ మాట్లాడుతూ.. 'ఓ రోజు ఉదయాన్నే లేచి చూస్తే, కార్లోస్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికాను. ఎక్కడా కనిపించలేదు. చివరికి, ఓ చోట పడి ఉండటం చూశాను. ఎవరో చర్మాన్ని ఒలుచుకుపోయారు'' అని తన ఆవేదనను వెళ్లగక్కారు.

తన బండిని లాగడానికి ఆంథొనీ, ఇప్పుడు ఓ గాడిదను అద్దెకు తీసుకున్నాడు. కానీ, తన రోజువారీ ఆదాయంలో సగం డబ్బు అద్దెకే సరిపోతోంది.

చిత్రం శీర్షిక ఆంథోనీకి గాడిద పేరే ముద్దుపేరు అయ్యింది

''ఇప్పడు నాదగ్గర డబ్బు లేదు. అప్పులు ఉన్నాయి. నా పిల్లల స్కూలు ఫీజూ కట్టలేదు. ప్రస్తుతం నాదగ్గర కార్లోస్ లేదు.. కుటుంబం నామీద ఆధారపడింది. నేను వారిని చూసుకోవాలి '' అని ఆంథొనీ అంటున్నారు.

మరొక కార్లోస్‌ను కొనడానికి ఆంథొనీ వద్ద డబ్బు లేదు.

గాడిదల ఎగుమతి వ్యాపారం - నిజాలు

చిత్రం శీర్షిక యేటా 10లక్షల 80వేల గాడిద చర్మాల వ్యాపారం జరుగుతోంది
  • ఏటా 10 లక్షల 80వేల గాడిద చర్మాల వ్యాపారం జరుగుతున్నట్టు ఇంగ్లండ్‌లోని ' ది డాంకీ సాంక్చుయరీ' చెబుతోంది.
  • చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం, 1990లో గాడిదల సంఖ్య 1కోటి 10లక్షలు ఉంటే, ప్రస్తుతం 30లక్షలకు తగ్గింది.
  • గాడిద చర్మాలను బాగా ఉడికించడంతో గోధుమ రంగులో జిగురు పదార్థం వస్తుంది. దీన్ని ఎజియావో అంటారు.
  • ఈ పదార్థాంతో చైనా సంప్రదాయ ఔషధాన్ని తయారు చేస్తారు. ఒక కిలో ఎజియావో విలువ దాదాపు రూ.25,400/-
  • ఉగాండా, టాన్జానియా, బోత్స్వానా, నైజీరియా, బర్ఖినా ఫాసో, మాలి, సెనెగల్ దేశాలు చైనాకు గాడిదలను ఎగుమతి చేయడాన్ని నిషేధించాయి.

విషాదం

కెన్యాలో ఈ మధ్యనే మూడు కబేళాలను ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారం ఊపందుకుంది. ఒకవైపు గాడిదలకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపున ఈ వ్యాపారంలో ధనప్రవాహమూ కొనసాగుతోంది.

ఒక్కో కబేళాలో రోజుకు 150 గాడిదలను వధిస్తారు. వీటి మాంసాన్ని ప్యాక్ చేసి, ఫ్రీజర్లలో నిలువ చేస్తారు. వీటి చర్మాలను ఎగుమతి చేస్తారు.

కెన్యాలోని నాయివష లోఉన్న 'స్టార్ బ్రిలియంట్ డాన్కీ ఎక్స్‌పోర్ట్' కబేళాలో ప్రాణాలతోఉన్న గాడిదలను తూకం వేసి అమ్ముతారు.

చిత్రం శీర్షిక చైనా వ్యాపారులు, ఈ గాడిదల ప్యాకింగ్ విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు

ఒక బోల్ట్‌గన్ తో వీటి తలకు గురిపెట్టి కాల్చి చంపుతారు. ఆ తర్వాత వీటి చర్మం ఒలిచి.. మాంసం ప్యాక్ చేస్తారు.

కెన్యాలో గాడిదల కబేళాకు మొదటిసారిగా ప్రభుత్వ అనుమతి లభించింది తనకేనని ఛీఫ్ఎగ్జిక్యూటివ్ కరియుకి చెబుతున్నారు.

గాడిదలకు అంతగా డిమాండ్ లేని రోజుల్లో, తమ అవసరాలకోసం ఆవులను, మేకలను అమ్మేవారని కరియుకి చెబుతున్నారు.

కానీ, ఆవుల కంటే ఇప్పుడు గాడిదలనే ఎక్కువగా అమ్ముతున్నారని ఆయన వివరించారు.

చిత్రం శీర్షిక డజను పైచిలుకు దేశాలు, గాడిదల వర్తకాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నాయి

''చైనా మార్కెట్‌తో మేం సంతోషంగా ఉన్నాం. ఒకప్పుడు గాడిదల నుండి పెద్దగా లాభం ఉండేదికాదు. కానీ ఈరోజు చాలామంది గాడిదలతో లాభపడుతున్నారు'' అని తెలిపారు.

చైనా వ్యాపారులు, ఈ గాడిదల ప్యాకింగ్ విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు.

గాడిద చర్మాలను ఉడికించడం వల్ల తయారయ్యే పదార్థాన్ని సాంప్రదాయక ఔషధం తయారీ, పౌష్టికాహార తయారీలో కూడా వాడతారు.

చిత్రం శీర్షిక సాంప్రదాయక చైనా ఔషధాల్లో ఎజియాఓను వాడతారు. ఒక కిలో ఎజియాఓ విలువ దాదాపు 25,400/-

కానీ, కబేళాల్లో గాడిదల పట్ల వ్యవహరించే తీరు మాత్రం విమర్శలకు గురవుతోంది.

కబేళాల్లో ఉన్న గాడిదల దయనీయ స్థితిని ఒక బ్రిటిష్ సంస్థ, కొందరు దక్షిణాఫ్రికా విలేకరులు కలిసి వెలుగులోకి తెచ్చారు.

ప్రస్తుత పరిస్థితులు, ఆందోళనకరంగా ఉన్నాయని, పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చేవరకూ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నాయని ఇంగ్లండ్ లోని గాడిదల సంరక్షణశాలకు చెందిన మైక్ బేకర్ అన్నారు.

''గతంలో ఎప్పుడూ చూడనంతగా లక్షలాది గాడిదలను కబేళాకు తరలిస్తున్నారు. అక్కడ వాటి దుస్థితి వర్ణనాతీతం''.

చిత్రం శీర్షిక ఒక్కో కబేళాలో రోజుకు 150 గాడిదలను వధిస్తారు

''గాడిదల చర్మం ఒలవడం సులువవుతుందన్న కారణంతో, వాటికి ఆహారం ఇవ్వకుండా ఆకలితో మాడుస్తున్నారు. దుడ్డుకర్రతో, చచ్చే వరకూ బాదుతున్నారు''.

ఉగాండా, టాన్జానియా, బోత్స్వానా, నైజీరియా, బర్ఖినా ఫాసో, మాలి, సెనెగల్ దేశాలు గాడిద మాంసాన్ని చైనాకు ఎగుమతి చేయడాన్ని నిషేధించాయి.

డజను పైచిలుకు దేశాలు, గాడిదల వర్తకాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నాయి. తమ దేశ జంతు సంపద క్షీణిస్తోందని, ప్రజల్లో అంతర్లీనంగా జంతువుల పట్ల క్రౌర్యం పెరుగుతోందని ఈ దేశాలు భావిస్తున్నాయని బేకర్ చెబుతున్నారు.

సంబంధిత అంశాలు