అమెరికా తీరంలో నేట్ తుపాను బీభత్సం

  • 8 అక్టోబర్ 2017
నేట్ తుపాను Image copyright Getty Images

లాటిన్ అమెరికాలో విధ్వంసం సృష్టించిన నేట్ హరికేన్, ఇప్పుడు ఉత్తర అమెరికాను భయపెడుతోంది. మిస్సిసిప్పిలోని బైలోక్సి నగరం వద్ద తీరం దాటిన ఈ పెను తుపాను ఉత్తరం దిశగా దూసుకెళ్తోంది.

సముద్రం అల్లకల్లోలంగా మారింది. మిస్సిసిప్పి, లూసియానా, అలబామా రాష్ట్రాలతో పాటు ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు తుపాను హెచ్చరికలు జారీ చేశారు.

సముద్ర మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దాంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గంటకు 137కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో పాటు కుండపోత వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమిస్సిసిప్పిలో భవనం నుంచి బాలికను రక్షిస్తున్న సహాయక బృందాలు

ముందుజాగ్రత్తగా గల్ఫ్ కోస్ట్‌తో పాటు, ఐదు పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. వేగంగా కదులుతున్న ఈ తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు.

అయితే గత నెలలో వచ్చిన ఇర్మా, మారియా హారికేన్లతో పోల్చితే ఇది కాస్త తేలికైనదని బైలోక్సి నగర మేయర్ బీబీసీతో అన్నారు.

శనివారం లూసియానాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యల కోసం ఫెడరల్ బలగాల పంపిస్తామన్నారు. ఇప్పటికే వెయ్యి మందికిపైగా సైనిక బలగాలను రంగంలోకి దింపామని లూసియానా గవర్నర్ ఎడ్వార్డ్స్ తెలిపారు.

Image copyright Sean Gardner/gettyimages

ఇదే తుపాను మొన్న లాటిన్ అమెరికాలోని నికరాగ్వే, కోస్టారికా ప్రాంతాల్లో సృష్టించిన తీవ్ర విధ్వంసానికి 25 మంది మరణించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు