ప్రథమ మహిళ నేనే.. కాదు నేనే-ఇవాన, మెలానియా

  • 10 అక్టోబర్ 2017
ట్రంప్ భార్యల మధ్య కీచులాట! Image copyright Getty Images/EPA
చిత్రం శీర్షిక ప్రథమ మహిళ నేనే.. కాదు నేనే-ఇవాన, మెలానియా

‘ట్రంప్ మొదటి భార్యను నేను. కాబట్టి నేనే అమెరికా ప్రథమ మహిళను.’ ఏబీసీ గుడ్‌ మార్నింగ్‌ అమెరికా కార్యక్రమంలో ట్రంప్ మాజీ భార్య ఇవాన చెప్పిన మాటలివి.

వైట్‌హౌస్‌లో ఉన్న ట్రంప్‌తో మాట్లాడేందుకు తనకు డైరెక్ట్ ఫోన్‌లైన్ ఉందని ఇవాన చెప్పారు. ట్రంప్‌తో కనీసం 15 రోజులకోసారైనా మాట్లాడుతానని తెలిపారు.

కానీ తాను ఎవరికీ ఎలాంటి అసూయ కలిగించాలని కోరుకోవడం లేదని కూడా ఇవానా అన్నారు.

ఇవాన 1977లో డొనాల్డ్ ట్రంప్‌ను పెళ్లి చేసుకున్నారు. మార్ల మేపుల్స్ అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా 1990లో ట్రంప్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు.

ట్రంప్-ఇవానకు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్ ట్రంప్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇవాన రాసిన "రైజింగ్ ట్రంప్" పుస్తకం మంగళవారం విడుదల కాబోతోంది. ఆ పుస్తకం ప్రమోషన్‌లో భాగంగా ఏబీసీ గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

అయితే, ఇవాన వ్యాఖ్యలను ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా తిప్పికొట్టారు.

ఆమె తరఫున వైట్‌హౌజ్‌ ప్రతినిధి స్టిఫనీ గ్రిషామ్ మీడియాతో మాట్లాడారు. అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఇవాన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

మెలానియా వాషింగ్టన్‌ డీసీలో ఉండేందుకు ఇష్టపడతారని, అమెరికా ప్రథమ మహిళ బాధ్యతను గౌరవిస్తారని స్టిఫనీ చెప్పారు.

ఇవాన తన హోదాను వాడుకుని పుస్తకాలు అమ్ముకోవాలని చూస్తున్నారని వైట్‌హాస్ ప్రతినిధి అన్నారు. ట్రంప్ మాజీ భార్య వ్యాఖ్యల్లో పస లేదు. అందరి దృష్టిని ఆకర్షించాలనే ఇలా చేస్తున్నారని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడి భార్య, మాజీ భార్య మధ్య పబ్లిక్‌గా గొడవ జరగడం ఇదే తొలిసారని భావిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు