ప్రాథమిక పాఠ్య పుస్తకాల నిండా లింగ వివక్షే: నిపుణులు

  • వాలెరియా పెరాసో
  • బీబీసీ సామాజిక వ్యవహారాల కరెస్పాండెంట్
బలమైన బాలురు, అందమైన బాలికలు

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ప్రపంచమంతటా బడి పుస్తకాల్లో మహిళలను పూర్తిగా విస్మరించడమో లేదంటే మూసపాత్రల్లో చిత్రీకరించడమో జరుగుతోంది. ఇది స్కూళ్లలో లింగ అసమానత్వాన్ని పెంచుతోందని ఒక పరిశోధనలో వెల్లడైంది.

హైతీలోని ఒక ప్రాథమిక పాఠశాల టెక్ట్స్ బుక్‌.. అమ్మలు "పిల్లల సంరక్షణ చూసుకుంటూ అన్నం వండుతారు" అని.. తండ్రులేమో "ఆఫీసుల్లో" పనిచేస్తారని పిల్లలకు నేర్పిస్తుంది.

ఇక పాకిస్తాన్‌లోని ఒక పాఠ్యపుస్తకంలో శక్తిమంతమైన, అధికారం గల రాజకీయవేత్తలందరినీ పురుషులుగానే చిత్రీకరించారు.

టర్కీలో ఒక బాలుడు తాను డాక్టర్ కావాలని కలగంటున్నట్లు చిత్రీకరించిన పాఠ్యపుస్తకం.. బాలిక తాను భవిష్యత్తులో తెల్ల గౌను ధరించిన పెళ్లికూతురుగా కలగంటున్నట్లు చూపుతోంది.

బాలిబాలికల ఆలోచనారీతులను చిన్న వయసు నుంచే వివక్షాపూరితంగా ప్రభావితంచేసే ఇలాంటి పాఠ్యాంశాల జాబితాకు అంతులేదు. ఈ జాడ్యానికి భౌగోళిక సరిహద్దులూ లేవు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ప్రాథమిక పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో లింగ వివక్ష చాలా తీవ్రంగా ఉంది. దిగ్భ్రాంతికరంగా భూమి మీద ప్రతి ఖండంలోనూ దాదాపు ప్రతి దేశంలోనూ ఇది ఒకే రీతిన ఉందని నిపుణులు చెప్తున్నారు.

ఇది "కళ్ల ముందే ఉన్నా కనిపించని" సమస్య.

"స్త్రీపురుషులకు వారి వారి జెండర్‌ను బట్టి సమాజంలో చిరకాలంగా ఖాయం చేసిన పాత్రలు ఉన్నాయనే ముసుగులో వారి వారి మూస నమూనాలను చిన్నారుల మెదళ్ల లోకి ఎక్కిస్తున్నారు" అని ప్రొఫెసర్ రే లెస్సర్ బ్లూమ్‌బర్గ్ పేర్కొన్నారు.

యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన సోషియాలజిస్ట్ బ్లూమ్‌బర్గ్.. ప్రపంచ వ్యాప్తంగా స్కూళ్లలో పాఠాలు చెప్పేందుకు ఉపయోగించే పాఠ్య పుస్తకాలను దశాబ్ద కాలంగా అధ్యయనం చేస్తున్నారు. ఆ పుస్తకాల్లో మహిళలను ప్రణాళికాబద్ధంగా విస్మరించడమో వారిని పరాధీన పాత్రల్లో చిత్రీకరించడమో చేస్తున్నారని ఆమె తెలిపారు.

"విద్యాంశాల్లో లింగ వివక్ష గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే.. లక్షలాది మంది పిల్లలు స్కూలు విద్యకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో అది పతాక శీర్షికలకు ఎక్కే విషయం కాదని భావిస్తున్నారు" అని ఆమె వివరించారు.

2000 సంవత్సరం నుంచీ స్కూళ్లలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఇంకా ఆరు కోట్ల మందికి పైగా పిల్లలు ఎన్నడూ బడిలో అడుగు పెట్టలేదని.. అందులో 54% మంది బాలికలేనని యునెస్కో చెప్తోంది.

"ఈ పుస్తకాలు లింగ అసమానత్వాన్ని ప్రచారం చేస్తాయి. భావి ప్రపంచపు బాలికలకు గత కాలపు పుస్తకాలతో పాఠాలు చెప్పకూడదు" అని ప్రొఫెసర్ బ్లూమ్‌బర్గ్ అంటారు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

పూర్తి విస్మరణ లేదా మూసపాత్రలు

ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యారంగ సంస్థ యునెస్కో గత ఏడాది విస్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. (http://unesdoc.unesco.org/images/0024/002467/246777E.pdf)

పాఠ్యపుస్తకాల్లో లింగ వివక్ష ధోరణులు ఎంత లోతుగా ఉన్నాయంటే.. అవి బాలికల విద్యను నిర్లక్ష్యం చేయడంతో పాటు, వారి వృత్తి పరమైన, జీవన పరమైన ఆకాంక్షలను చాలా వరకు కుదించి వేస్తున్నాయని, లింగ సమానత్వాన్ని సాధించడానికి అవి "పరోక్షమైన అడ్డంకి"గా ఉన్నాయని యునెస్కో చెప్తోంది.

పాఠాల్లోని వాక్యాలు, పేర్లు పెట్టిన పాత్రలు, శీర్షికల్లో ప్రస్తావనలు, సూచికల్లో ప్రస్తావనలు, ఇతరత్రా అంశాల్లో లెక్కించి చూస్తే.. "పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా చాలా తక్కువగా ఉంది" అని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బనీకి చెందిన ఆరన్ బెనావట్ పేర్కొన్నారు. యునెస్కో 2016 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (జీఈఎం) నివేదికకు ఆమె డైరెక్టర్‌గా పనిచేశారు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ఇది ముప్పేట సమస్యని నిపుణులు చెప్తున్నారు.

ఇందులో చాలా ముఖ్యమైన కోణం.. మానవాళి మొత్తానికి ప్రతినిధిగా పురుషులను మాత్రమే ఉపయోగించే లింగ వివక్షతో కూడిన భాషను ఉపయోగించడం.

రెండో అంశం.. విస్మరణ. పాఠ్యాంశాల్లో తరచుగా మహిళలకు చోటు ఉండదు. చరిత్రలోనూ రోజువారీ జీవితంలోనూ మహిళల పాత్రలు కూడా పురుష పాత్రలలో కలిసిపోతాయి.

"నాకు ప్రత్యేకంగా గుర్తున్న ఒక పాఠ్యపుస్తకం ఉంది. అందులో ఉన్న ఏకైక మహిళ మేరీ క్యూరీ" అని ప్రొఫెసర్ బ్లూమ్‌బర్గ్ తెలిపారు.

"మరి ఆమె రేడియం కనుగొన్నట్లు చూపారా అంటే.. అదీ లేదు. ఆమె ఎంతో గొప్పగా కనిపిస్తున్న తన భర్త వెనుక బిడియంగా నిల్చుని ఉన్నట్లు.. అతడు ఎవరితోనో మాట్లాడుతుంటే ఆమె వెనుక నుంచి చూస్తున్నట్లు చిత్రించారు" అని బ్లూమ్‌బర్గ్ వివరించారు.

ఇక మూడో విషయం.. ఇంటా బయటా పురుషులు, స్త్రీలు చేసే పనుల గురించి సంప్రదాయ మూస పాత్రలు.. స్త్రీ, పురుషుల నుంచి ఆశిస్తున్నట్లుగా వ్యక్తీకరించే సామాజిక ఆకాంక్షలు, లింగాన్ని బట్టి ఆపాదించే లక్షణాలు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ఒక ఇటాలియన్ పాఠ్యపుస్తకం ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆ పుస్తకంలోని ఒక పాఠ్యాంశం విభిన్న వృత్తులకు సంబంధించిన పదాలను బోధిస్తుంది. అందులో పోస్ట్‌మాన్ నుంచి దంత వైద్యుడి వరకూ పది విభిన్న వృత్తుల్లో పురుషులను చూపారు. కానీ మహిళలను ఒక్క వృత్తిలో కూడా చూపలేదు.

మరోవైపు.. వంట చేయడం నుంచి బట్టలు ఉతకడం.. పిల్లలు, వృద్ధుల సంరక్షణ చూసుకోవడం వంటి ఇంటి పనుల్లో ఎక్కువగా మహిళలనే చిత్రీకరిస్తున్నారు.

"ఈ లింగపరమైన మూస పాత్రలను నిర్వర్తించే నిష్క్రియాపరులుగా, విధేయులుగా మహిళలను చూపుతుండటం ఆందోళనకరమైన విషయం" అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా లెక్చరర్ కేథరీన్ జేర్ పేర్కొన్నారు. విద్యా రంగ నిపుణురాలైన ఆమె కూడా జీఈఎం నివేదికలో పాలుపంచుకున్నారు.

ఫొటో సోర్స్, AFP

"గ్రహాంతర వాసులు భూమికి వస్తే..."

ఈ సమస్య ఇప్పటిది కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో సంస్కరణల కోసం స్త్రీవాదం ఒత్తిడి తెచ్చిన 1980ల నుంచీ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా విశ్లేషిస్తున్నారు.

2011లో అమెరికా చేపట్టిన ఒక అధ్యయనంలో.. శీర్షికల్లో మహిళల కన్నా రెండు రెట్లు ఎక్కువగా పురుషుల ప్రాతినిధ్యం ఉందని, ప్రధాన పాత్రల్లో మహిళల కన్నా పురుషుల ప్రాతినిధ్యం 1.6 శాతం అధికంగా ఉందని అంచనా వేశారు. 20వ శతాబ్దంలో ప్రచురించిన 5,600 పైగా పిల్లల పుస్తకాలను పరిశీలించి నిర్వహించిన ఆ అధ్యయనాన్ని ఈ రంగంలో నిర్వహించిన అతి పెద్ద పరిశోధనగా అభివర్ణిస్తుంటారు.

ఈ సమస్యను మొదట గుర్తించినప్పటి నుంచీ లింగ వివక్షను తగ్గించడంలో కొంత పురోగతి ఉంది కానీ అది "చాలా నెమ్మది"గా ఉందని నిపుణులు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

పరిశీలించిన పాఠ్యపుస్తకాల్లో కొన్ని చాలా కాలం కిందట ప్రచురించినవి. అయినా వాటిని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి కొత్త పాఠ్యపుస్తకాలను తేవడానికి అవసరమైన నిధులు లేని అల్పాదాయ దేశాలు, పాఠశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

"విద్యలో ఈ లింగ వివక్ష వల్ల పరిస్థితి ఏటేటా దిగజారుతోంది. ఎందుకంటే ప్రపంచం పురోగమిస్తోంది. మహిళలు కొత్త వృత్తుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇంట్లో నిర్వహించే పాత్రలు మారుతున్నాయి. కానీ అదే వేగంతో పుస్తకాలు మారడం లేదు. దీనివల్ల వాస్తవానికి - పాఠాలకు మధ్య తేడా ఇంకా పెరుగుతోంది" అని ప్రొఫెసర్ బ్లూమ్‌బర్గ్ అంటారు.

"ఒకవేళ మన దగ్గరికి గ్రహాంతరవాసులు వచ్చి ఈ పాఠ్యపుస్తకాలు చదివితే.. ఇక్కడ మహిళలు నిజానికి వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏం చేస్తారు అనేది వారికి ఏమాత్రం అర్థం కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇది విశ్వవ్యాప్త సమస్య

ఈ సమస్య దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉందని పరిశోధన చెప్తోంది. తీవ్రతలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ అల్పాదాయ, అధికాదాయ దేశాలన్నిటి పాఠ్యపుస్తకాల్లోనూ లింగ వివక్ష ఒకే తరహాలో ఉంది.

ఆ సమాచారం విడివిడిగా ఉంది. కానీ గత దశాబ్ద కాలంలో ప్రచురితమైన అధ్యయనాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి.

ఉదాహరణకు భారతదేశంలో మూడో తరగతిలో బోధించే చరిత్ర పుస్తకంలో ప్రధానమైన స్త్రీ పాత్ర ఒక్కటీ లేదు.

కెన్యాలో బోధనకు ఉపయోగించే ఒక ఇంగ్లిష్ పుస్తకంలో పురుషులకు "ఆసక్తికరమైన ఆలోచనలు" ఉన్నట్లుగాను, మహిళలు, బాలికలు అన్నం వండుతూ, బొమ్మ జుట్టు దువ్వుతూ ఉన్నట్లుగానూ చిత్రించారు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ఇరాన్‌లో విద్యాశాఖ రూపొందించిన పుస్తకాల్లో 80 శాతం పాత్రలు పురుషులవే. భారతదేశం రూపొందించిన పుస్తకాల్లో మహిళలను చూపే చిత్రాలు 6 శాతం మాత్రమే ఉన్నాయి. జార్జియాలో ఇది 7 శాతంగా ఉంది.

2007లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కామెరూన్, ఐవరీ కోస్ట్, టోగో, ట్యునీసియాల్లోని గణిత పాఠ్యపుస్తకాల్లో పురుష పాత్రలతో పోల్చిచూసినపుడు మహిళల పాత్రలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి.

యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్), చైనాలలో సైన్స్ పుస్తకాలను పరిశీలించినపుడు.. 87 శాతం పాత్రలు పురుషులవేనని వెల్లడైంది.

ఫొటో సోర్స్, MOHAMMED HUWAIS / AFP

ఆస్ట్రేలియాలో 2009లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. పాఠ్యపుస్తకాల్లోని పాత్రల్లో 57 శాతం మంది పురుషులే ఉన్నారు. నిజానికి ఆ దేశంలో పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువ.

"అధికాదాయ దేశాల్లో పాఠ్యపుస్తకాలు కొంచెం ఎక్కువగా ప్రగతిదాయకంగా ఉంటాయని ఎవరైనా భావిస్తారు. కానీ ఆస్ట్రేలియాలో మేనేజర్ పోస్టుల్లో మహిళల కన్నా రెండింతల మంది పురుషులను చిత్రీకరించారు. ఇక రాజకీయాలు, ప్రభుత్వం విషయానికొస్తే మహిళల కన్నా పురుషులను నాలుగు రెట్లు ఎక్కువగా చిత్రీకరించారు" అని ప్రొఫెసర్ జేర్ వివరించారు.

"ఇక ఒక చైనా పుస్తకం మరీ విడ్డూరంగా ఉంది. అందులో 1949 కమ్యూనిస్టు విప్లవంలో కేవలం ఒకే ఒక్క కథానాయకిని చూపించారు" అని ప్రొఫెసర్ బ్లూమ్‌బర్గ్ తెలిపారు.

"పైగా ఆమెను చట్టం కోసం పోరాడుతున్నట్లుగానో, మావోతో కలిసి ముందు వరుసలో పోరాటం చేస్తున్నట్లుగానో చూపలేదు. వర్షంలో నిలుచున్న ఒక పురుష గార్డుకి ఆ మహిళ పాత్ర గొడుగు అందిస్తుంది.. అంతే" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

ప్రభావవంతమైన పాఠాలు...

స్కూలు పిల్లలకు సమాజంలో మామూలు విషయాలు ఏమిటనే అవగాహనను ఈ పుస్తకాలు కల్పిస్తాయని, ఇది పిల్లల ఆలోచనలను వివక్షాపూరితంగా రూపొందిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

దేశంలోని విద్యా రంగంలో పాఠ్యపుస్తకాలు శక్తిమంతమైన పనిముట్లు.

విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు పాఠ్యపుస్తకాల్లో 32,000 పేజీలు చదువుతారని పరిశోధన చెప్తోంది. క్లాస్ వర్క్‌లో దాదాపు 75 శాతం, హోంవర్క్‌లో 90 శాతం విద్యార్థులే చేస్తారు. ఇంకా ఉపాధ్యాయుల ప్రణాళికలో చాలా వరకూ విద్యార్థులు పూర్తిచేస్తారు.

ఇంటర్నెట్, ఇతర డిజిటల్ వనరులు అందుబాటులోకి రావడం వల్ల అభ్యాస పరికరాల శ్రేణి విస్తృతమవుతున్నా కూడా.. "చాలా దేశాల్లో ప్రత్యేకించి పేద దేశాల్లో పాఠ్యపుస్తకాలే ప్రధానంగా ఉన్నాయి" అని ఆరన్ బెనావట్ పేర్కొన్నారు.

"బాలురు, బాలికలు ఏమేం చేయాలి అనే దాని మీద పాఠ్యపుస్తకాలు చాలా సంకుచిత భానలను చూపుతున్నపుడు.. స్కూలు పిల్లలు సమాజం అలాగే ఉంటుందని, ఉండాలని భావిస్తారు" అని ప్రొఫెసర్ జేర్ వివరించారు.

ఫొటో సోర్స్, ARIF ALI / AFP

పిల్లల ప్రాపంచిక దృక్పథం మీద పాఠ్య పుస్తకాలు చూపగల ప్రభావాన్ని విద్యారంగ పరిశోధనలు ఇప్పటికే వివరంగా నమోదు చేశాయి.

ఉదాహరణకు ఇజ్రాయెల్‌లో మొదటి తరగతి విద్యార్థులను అధ్యయనం చేసినపుడు.. పురుషులను, మహిళలను సమానంగా చిత్రీకరించిన పుస్తకాలు చూసిన విద్యార్థులు.. చాలా వృత్తులు బాలురు, బాలికలు ఇద్దరికీ సరిపోతాయనే ఆలోచనలను వెలిబుచ్చారు. అయితే లింగ వివక్ష గల పాఠ్యపుస్తకాలను చదివిన వారు.. లింగపరమైన మూస పాత్రల కోణంలో ఆలోచిస్తున్నారు.

అలాగే.. ప్రపంచ వ్యాప్తంగా స్టెమ్ విద్యా రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ విద్యాభ్యాసం కోసం వెళ్లే బాలికల సంఖ్య తక్కువగా ఉండటానికి - పాఠ్యపుస్తకాల్లో మహిళా శాస్త్రవేత్తలను తక్కువగా చిత్రీకరించడానికి సంబంధం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

వివక్షను తగ్గించే దిశగా ప్రగతి...

అయినాకూడా ఈ వివక్షను తగ్గించడంలో గత దశాబ్ద కాలంలో కొంత పురోగతి కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో లింగ సమానత్వానికి సంబంధించిన అంశాలు పెరిగాయని యునెస్కో జీఈఎం నివేదిక చెప్తోంది. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికా, సబ్-సహారా ఆఫ్రికా దేశాల్లోని పాఠ్యపుస్తకాల్లో మహిళల హక్కులు, లింగ వివక్షకు సంబంధించిన విషయాల ప్రస్తావన పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.

కొన్ని దేశాలు ఈ మార్పునకు సారథ్యం వహిస్తున్నాయి. లింగ సమానత్వం విషయంలో అగ్రస్థానంలో ఉన్న స్వీడన్ ఈ విషయంలో కూడా అగ్రభాగాన ఉంది.

ఆ దేశంలోని కొన్ని పాఠ్యపుస్తకాల్లో లింగ భేదం లేని పాత్రలు, సర్వనామాలను చేర్చడంతో పాటు.. రోజువారీ జీవితాలను మరింత సమానత్వంతో చిత్రీకరించారు.

"ఒక స్వీడిష్ పాఠ్యపుస్తకంలో ఎవరైనా కుండలో గరిటె తిప్పుతున్నట్లో, ఏప్రాన్ ధరించినట్లో ఏదైనా చిత్రం ఉందంటే అది ఎక్కువగా పురుషుల చిత్రమే అయివుంటుంది" అని ప్రొఫెసర్ బ్లూమ్‌బర్గ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Adam Berry / Getty Images

హాంగ్‌కాంగ్‌లో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాల్లో పురుషులు, మహిళల పాత్రల సంఖ్య సమానంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది.

జోర్డాన్, పాలస్తీనా ప్రాంతాలు, వియత్నాం, ఇండియా, పాకిస్తాన్, కోస్టారికా, అర్జెంటీనా, చైనాల్లో కూడా ఈ తరహా పురోగతి ఉంది.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

కానీ జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించడం సుదీర్ఘమైన, వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఇలాంటి పనికి ప్రధానంగా నిధుల కొరత, అధికార యంత్రాంగం అలసత్వం అవరోధాలుగా ఉంటాయి.

"కొన్ని మార్పులు పై పై మెరుగులే. ఇక ప్రభుత్వాలు మారితే ఈ విషయంలో నిబద్ధత కూడా కొనసాగదు" అని బెనావట్ అంటారు.

ఈ పరిస్థితుల్లో పాఠ్యపుస్తకాల్లో కనిపించే వివక్షను తిప్పికొట్టడానికి నిపుణులు కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తున్నారు.

విద్యార్థులు బృంద చర్చల్లో భాగంగా ఇటువంటి పుస్తకాల్లో గల లింగ వివక్షను గుర్తించి, మూస ధోరణులను ప్రశ్నించటం వంటి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా భారతదేశం, మలావీల్లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి.

ఫొటో సోర్స్, UNESCO / GEM Report

"ఈ లింగ వివక్షను గుర్తించేలా విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. విద్యార్థులు కూడా ఈ ‘డిటెక్టివ్ పని’ని ఆస్వాదిస్తారు" అని ప్రొఫెసర్ బ్లూమ్‌బర్గ్ చెప్తారు.

"కానీ అందుకోసం ముందుగా టీచర్లకు శిక్షణనివ్వాల్సి ఉంటుంది. చివరికి ఉత్తమ విద్య కావాలనుకుంటే ఈ పుస్తకాలను తిరగరాయాలి" అని ఆమె పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)