టిల్లర్సన్ ఐ క్యూ పరీక్షకు వెళ్లాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

  • 11 అక్టోబర్ 2017
ఎడమవైపు టిల్లర్సన్, కుడివైపు డొనాల్డ్ ట్రంప్ Image copyright AFP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్‌ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ తెలివి ఉందో తెలుసుకునేందుకు ఐక్యూ పరీక్షకూ సిద్ధమా? అంటూ టిల్లర్సన్‌కు ట్రంప్ సవాల్ విసిరారు.

గతంలో టిల్లర్సన్ ట్రంప్‌‌ను ‘మందబుద్ధి’ అని అన్నారని వార్తలొచ్చాయి. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజీన్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఆ వార్తలకు స్పందిస్తూ.. ‘‘అదో బూటకపు వార్త అనుకుంటున్నా. ఒకవేళ నిజంగానే టిల్లర్సన్ అలా అని ఉంటే, మేం ఐక్యూ టెస్ట్‌కు వెళ్లాల్సిందే. ఆ టెస్టులో ఎవరు గెలుస్తారో నేను చెప్పగలను’’ అని అన్నారు.

అది అలా ఉండగా.. ట్రంప్, టిల్లర్సన్ కలిసి మంగళవారం భోజనం చేశారు. అంతకు ముందు విలేకర్లతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా విదేశాంగ మంత్రి మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎవరినీ తక్కువగా చూడను.’’ అని చెప్పారు.

అయితే ‘‘ట్రంప్ చేసిన ఐక్యూ టెస్టు ఛాలెంజ్‌‌ ఓ జోక్. అది ఆయన హాస్య ప్రియత్వానికి నిదర్శనం’’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ అన్నారు.

ఇటీవల ఉత్తర కొరియా విషయంలో ట్రంప్, టిల్లర్సన్ మధ్య కాస్త భేదాభిప్రాయాలు కనిపించాయి. తమతో చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా కొంత ఆసక్తి చూపుతోందని టిల్లర్సన్ వెల్లడించగా, ట్రంప్ దానిని వ్యతిరేకించారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఉద్దేశిస్తూ 'ఆ లిటిల్ రాకెట్ మెన్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తూ మా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ సమయం వృథా చేసుకుంటున్నారు' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు