మెక్సికో: హీరో కావాలన్న నా కల ఇలా కూలిపోయింది

  • 13 జనవరి 2019
చేతులు కట్టేసిన పురుషుడు Image copyright iStock

"ఇలాంటి విషయం గురించి మీతో మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది" అని కార్లోస్ (పేరు మార్చాం) అన్నాడు.

తాను ఎన్నో వేధింపులకు గురయ్యానని మాత్రమే తొలుత అతను చెప్పాడు.

అతని కళ్లలోకి చూస్తే అది అబద్ధమని తెలిసి పోతుంది. మాటలకు అందని బాధేదో అతని గుండెల్లో గూడు కట్టుకుని ఉందని అర్థమవుతుంది.

చాలా రోజులు ప్రయత్నించాను అతని హృదయాంతరాలలోని చీకటిలోకి తొంగి చూడటానికి. కొన్ని నెలలు పట్టింది. అతను మనసు విప్పటానికి. మౌనం వీడటానికి.

ఇంతకు మెక్సికో ఎందుకు వచ్చావు..?

"ఒక అందమైన కల కోసం" కార్లోస్ సమాధానం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లైంగిక బానిసత్వానికి నిరసనగా వందల మంది ప్రజలు మెక్సికోలో బహిరంగ నిరసనలు తెలిపారు

దక్షిణ అమెరికాను వదలినప్పుడు అతని వయసు 20 ఏళ్లు.

మెక్సికోలో అడుగు పెట్టిన తరువాత అతని కలల సౌధం ఎలా కూలిపోయింది? భవిష్యత్తుపై కోటి ఆశలు ఉన్న ఆ కుర్రాడు ఎలా లైంగిక బానిసగా పురుష వేశ్యగా మారి పోయాడు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కార్లోస్‌ ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న ఎల్ పోజో ది వీదా స్వచ్ఛంద సంస్థను ఓసారి సందర్శించాల్సిందే. అక్కడ ఉన్న ఇలియానా రువల్కాబా.. అతను నరక కూపంలో ఎలా కూరుకు పోయాడో కనులకు కట్టారు.

"అతనిది ఓ అందమైన రంగుల కల. గొప్ప నటుడు కావాలన్నదే జీవిత ధ్యేయం. తన ప్రతిభను నిరూపించుకునేందుకు మెక్సికో సరైన వేదికగా అతనికి అనిపించింది.

అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన అతనిని ఆకర్షించింది. సినిమాలకు, నాటికలకు ఖ్యాతి కెక్కిన మెక్సికోలో అవకాశాలు బోలెడు. నువ్వు ఒక పెద్ద స్టార్‌గా మారొచ్చు అంటూ ప్రకటన ఇచ్చిన వారు నమ్మబలికారు.

గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు అతను వారి వద్దకు వెళ్లాడు. ఆ క్షణం తాను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని సమూలంగా మార్పివేస్తుందని పాపం ఆ యువకుడికి తెలియదు..?

తీరా వెళ్లాకా అతన్ని నిలువునా వంచించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఒకరిసారి కాదు రెండు సార్లు కాదు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అతని శరీరం పరుల పరమై పోయింది. అతని అందమైన కల కరిగిపోతుండగా బయటకు చెప్పుకోలేక కుమిలి పోయాడు.

Image copyright UNODC
చిత్రం శీర్షిక యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైం ప్రకారం 2004-2014 మధ్య పురుషుల అక్రమ రవాణా క్రమంగా పెరుగుతూ వచ్చింది

అతను వారికి బంధీగా మారాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

పురుష సాంగత్యం కోరుకునే విటులను తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన 'సరుకు'ను చూపించారు. ఆ తరువాత ఎవరితో ఎంత సేపు గడపాలో నిర్ణయించారు. అంతేకాదు 'డోర్ డెలివిరీ' సౌకర్యం కూడా ఉంది. విటులు కోరుకున్న చోటుకు వెళ్లి వారు ఆడుకునేందుకు అతను శరీరాన్ని అప్పగించాలి.

అతని ఆత్మ స్థైర్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. తిరగ బడాలన్న ఊహనే రాకుండా చేశారు. కనీసం బతకాలన్న ఆశ కూడా అతనిలో చచ్చిపోయింది. "పారిపోవాలని ప్రయత్నిస్తావేమో నీ తరం కాదు. ఎప్పుడూ మా వాళ్లు ఇద్దరు నిన్ను గమనిస్తూనే ఉంటారు. సరైన పత్రాలు లేకుండానే మెక్సికో వచ్చావు. బయటకు వెళ్తే నీకు ఎలాంటి గతి పడుతుందో తెలుసా?" ఇదీ వారి బెదిరింపు.

కార్లోస్ దాదాపు ఏదాడిన్నర పాటు ఒక లైంగిక బానిసగా గడిపాడు." ఒక్కసారి ఇలియానా దీర్ఘ శ్వాస తీసుకుని మళ్లీ కొనసాగించింది.

Image copyright iStock/getty images

‘‘చివరకు ఆ నరక కూపం నుంచి తప్పించుకో గలిగాడు. కానీ సరైన అనుమతి పత్రాలు లేనందుకు అతడిని మెక్సికో ప్రభుత్వం నిర్బంధించింది. అక్కడే మా సంస్థ కార్లోస్‌ను కలుసుకుంది.

అప్పటికే కార్లోస్ మానసికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నాడు. తన బతుకును నాశనం చేసిన వారిపై ప్రతీకారంతో రగిలి పోతున్నాడు. మానసిక వైద్యులు ఎంతో ప్రయత్నించిన తరువాత కానీ అతను మాములూ మనిషి కాలేదు.

గత కాలం నాటి చేదు గుర్తులను తుడిచి వేసే ప్రయత్నంలో ఇప్పుడు కార్లోస్ ఉన్నాడు. తన లాంటి యువకులు ఇలాంటి రాక్షసుల చేతుల్లో పడకుండా చూడాలని నిశ్చయించుకున్నాడు.

రంగుల కలల వెనుక పరిగెడుతూ కార్లోస్ మాదిరే వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే జరిగిన దాన్నిమరచి తమ సొంత దేశాలకు తిరిగి పోవాలని అనుకునేవాళ్లే వారిలో ఎక్కువ.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)