ఫ్లోరిడా యూనివర్సిటీకి రూ.1300 కోట్లు విరాళంగా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ కిరణ్ పటేల్

  • 15 అక్టోబర్ 2017
కిరణ్ పటేల్, ఫ్లోరిడా
చిత్రం శీర్షిక కిరణ్ పటేల్ దంపతులు

అమెరికాలో కోట్లకు పడగెత్తిన భారతీయ అమెరికన్లు దాతృత్వంలోనూ ముందుంటున్నారు. ఆ వరుసలోనే డాక్టర్ కిరణ్ పటేల్ రూ.1300 కోట్లు ఫ్లోరిడా యూనివర్సిటీకి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంచలనం సృష్టించింది.

ఈ డబ్బుతో ఫ్లోరిడాలో ఒకటి, భారతదేశంలో మరొక మెడికల్ కాలేజీలను నిర్మిస్తారు.

పటేల్ జాంబియాలో పెరిగారు. తెల్లవాళ్లు కాని వాళ్ల కోసం నిర్వహించే పాఠశాలలో చదువుకోవడానికి 80 కిలోమీటర్ల దూరం వెళ్లేవారు.

భారత్‌లో వైద్య విద్యను అభ్యసించి తన భార్యతో పాటు 1976లో అమెరికా చేరుకున్నారు.

కార్డియాలజిస్ట్ అయిన పటేల్ కొంత కాలం తర్వాత, కొంతమంది ఫిజీషియన్లతో కలిసి ఒక నెట్‌వర్క్‌ను నెలకొల్పారు.

1992లో దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న ఆరోగ్య బీమా కంపెనీని స్వాధీనం చేసుకోవడంతో ఆయన దశ తిరిగింది.

పదేళ్ల తర్వాత పటేల్ ఆ కంపెనీని విక్రయించినపుడు దానిలో 4 లక్షల మంది సభ్యులున్నారు. దాని వల్ల ఆయనకు రూ.65 వేల కోట్ల లాభం వచ్చింది.

వ్యాపారం విషయంలో తాను చాలా దూకుడుగా ఉంటానని పటేల్ చెబుతారు. తాను యాక్సిలరేటర్ అయితే తన భార్య తనకు బ్రేకులు వేస్తుందని సరదాగా చెబుతారు.

"అదృష్టదేవత తలుపు తట్టినపుడు, ముఖం కడుక్కోవడానికి పరిగెత్తొద్దు" అనే గుజరాతీ సామెతను ఆయన విశ్వసిస్తారు.

రుణం తీర్చుకుంటున్న భారతీయ అమెరికన్లు

ఇటీవల చాలా మంది భారతీయ అమెరికన్లు తమ సంపదను గుళ్లు, గోపురాలకు దానం చేయడానికి బదులుగా స్వదేశంలో, అమెరికాలో సమాజానికి ఉపయోగపడే కార్యాలకు వినియోగిస్తున్నారు.

2015లో న్యూయార్క్‌కు చెందిన చంద్రిక, రంజన్ టాండన్‌లు న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు రూ.650 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

తాను ధనవంతుడిని కాకపోయినా ఉన్నదానిలో సాయం చేయడమన్నది తన తండ్రి నుంచి వచ్చిన గుణమని పటేల్ తెలిపారు.

గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఆయన 50 పడకల ఆసుపత్రి కట్టించారు.

తాను ఫ్లోరిడా యూనివర్సిటీకి ఇచ్చిన ఆర్థికసాయంతో భారతీయ వైద్య విద్యార్థులు చాలా లాభం పొందుతారని పటేల్ అభిప్రాయపడుతున్నారు.

ఎవరి జీవితాన్ని వారే నిర్మించుకోవాలి

విలాసాలపై ఖర్చు చేయడమంటే పటేల్‌కు ఆనందం.

గత ఐదేళ్లలో ఆయన నాలుగు ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేశారు.

ఫ్లోరిడాలోని తంపా పట్టణంలో ఆయన 40 బెడ్‌రూంల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. దానికి అవసరమైన రాళ్లను మొత్తం భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారు.

సంపద ఉన్నపుడు ఖర్చు చేయడంలో తప్పేమిటని ఆయన విమర్శలను తిప్పికొడతారు.

ఒకరోజు ఆయన కుమారుడు తొమ్మిదేళ్ల సిలాన్ "నాన్నా! మనం ధనవంతులమా?" అని ప్రశ్నించాడు.

"నువ్వు కాదు, నేను" - ఇదీ.. కుమారుడికి ఆయన ఇచ్చిన సమాధానం.

ఎవరి జీవితాన్ని వారే నిర్మించుకోవాలన్నది ఆయన తత్వం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు