జాఫ్నా: మానని యుద్ధ గాయాలు, మిగిలిన ఎదురుచూపులు

  • 18 అక్టోబర్ 2017
సిమీ హడ్సన్
చిత్రం శీర్షిక సిమీ హడ్సన్

ఉత్తర శ్రీలంకలోని జాఫ్నా నగరం ఒకప్పుడు తుపాకులు, బాంబుల మోతతో దద్దరిల్లేది. 2009లో తమిళ వేర్పాటువాదుల గ్రూపు 'లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ)'ని శ్రీలంక సైన్యం తుదముట్టించిన తర్వాత దీనికి తెర పడింది.

తూటా గాయాలతో రక్తసిక్తమైన శరీరాలు ఇప్పుడు జాఫ్నా వీధుల్లో కనిపించడం లేదు. పేలుళ్లు ఆగిపోయాయి. వ్యక్తుల అదృశ్యం ఘటనలు కూడా ఆగిపోయాయి.

ఈ ఎనిమిదేళ్లలో జాఫ్నా బాగా మారిపోయింది.

జాఫ్నా నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు ఎక్స్‌ప్రెస్ వే వేశారు. నగరంలో హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు పెరిగాయి. వీధుల్లో సైనికుల గస్తీ ఇప్పటికీ ఉన్నప్పటికీ, విదేశీ పర్యాటకుల సందడి కనిపిస్తోంది.

కిలినోచ్చిలో మహిళల ఆందోళన

జాఫ్నాకు 60 కిలోమీటర్ల దూరంలో కిలినోచ్చి పట్టణం ఉంది. ఎల్‌టీటీఈ రెబల్స్ హవా సాగిన రోజుల్లో కిలినోచ్చి వారి 'రాజధాని'గా ఉండేది.

కిలినోచ్చిలో సిమీ హడ్సన్ అనే మహిళ 200 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. ఆమె కుమారుడు ఎల్‌టీటీఈలో ఫైటర్‌గా ఉండేవాడు. యుద్ధం ముగిసినప్పటి నుంచి అతడేమయ్యాడో తెలియడం లేదు. తన కొడుకు జాడ చెప్పాలని ప్రభుత్వాన్నిఆమె డిమాండ్ చేస్తున్నారు.

''యుద్ధం ముగిశాక ఒమన్‌థాయి చెక్‌పాయింట్ వద్ద నా కొడుకును అరెస్టు చేశారు. వాళ్లు (ప్రభుత్వం/సైన్యం) కావాలనుకుంటే అతడిని కోర్టుకు తీసుకెళ్లి, శిక్ష వేయించి ఉండాల్సింది'' అని చెమర్చిన కళ్లతో సిమీ హడ్సన్ చెప్పారు. కొడుకు ఛాయాచిత్రం పెద్దది ఒకటి ఆమె చేతిలో ఉంది.

తన కుమారుడిని ప్రభుత్వ రహస్య క్యాంపులో నిర్బంధించారని ఆమె నమ్ముతున్నారు.

జయ్‌శంకర్ పరమేశ్వరి అనే మరో మహిళ కూడా సిమీ హడ్సన్‌తోపాటు ఆందోళనలో పాల్గొంటున్నారు.

పరమేశ్వరి చేతిలో ముగ్గురి చిత్రాలతో కూడిన ప్లకార్డు ఉంది. ఈ చిత్రాలు ఆమె సోదరుడు నాథన్, భర్త జయ్‌శంకర్, ఆమె సోదరి కుమారుడు సత్య శీలన్‌లవి.

ఈ ముగ్గురూ యుద్ధం ముగిసినప్పటి నుంచి కనిపించడం లేదు. వీరి ఆచూకీ చెప్పండని అర్థిస్తూ పరమేశ్వరి అనేక ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేదు.

సిమీ హడ్సన్, పరమేశ్వరి నిరసన పాటిస్తున్న టెంట్‌లో మొత్తం దాదాపు పన్నెండు మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వారి వద్ద ఉన్న చిత్రాల్లో పెద్దవాళ్లతోపాటు బాలురు, బాలికలు కూడా ఉన్నారు.

అక్కడ అందరి వేదనా, నివేదనా ఒక్కటే. కనిపించకుండా పోయిన తమవారి ఆచూకీ చెప్పాలన్నదే అందరి డిమాండ్.

ఉత్తర శ్రీలంకలో సిమీ హడ్సన్ కొడుకు మాదిరి అదృశ్యమైనవారి సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతారు.

చిత్రం శీర్షిక యుద్ధం సమయంలో తమ భూములను లాగేసుకున్నారంటూ ఆందోళన చేపట్టిన శ్రీలంక తమిళులు

ఉత్తర శ్రీలంకలోనే ముల్లైత్తివు ప్రాంతంలో ఉన్న కెపాపిలో అనే గ్రామంలో ఒక నిరసన కార్యక్రమం జరుగుతోంది. యుద్ధం జరిగేటప్పడు సైన్యం తమ భూములను లాగేసుకొందని ఆరోపిస్తూ శ్రీలంక తమిళులు ఈ ఆందోళనను చేపట్టారు.

రహస్య క్యాంపుల్లో వ్యక్తుల నిర్బంధం, భూముల ఆక్రమణ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చుతోంది.

తాము రహస్య క్యాంపులేవీ నిర్వహించడం లేదని శ్రీలంక ఆరోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ రజిత్ సేనరత్నే బీబీసీతో చెప్పారు.

‘‘యుద్ధంలో తమవారు చనిపోయారనే వాస్తవాన్ని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు అంగీకరించలేరు. వారు ఎక్కడో ఒక చోట బతికే ఉన్నారని అనుకొంటుంటారు. భూముల విషయానికి వస్తే, వీటిని మా నియంత్రణ నుంచి తప్పించాం. అయితే ప్రజలకు అప్పగించే పని చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఈ విషయం మాత్రం నేను ఒప్పుకొంటా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఇచ్చే వివరణలేవీ ప్రజల్లో ఆందోళనను తొలగించలేకపోతున్నాయి. వారి భావోద్వేగాలను చల్లార్చలేకపోతున్నాయి. వారికి సాంత్వన కలిగించలేకపోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

చిత్రం శీర్షిక శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రజితా సేనరత్నే

భారత్ నుంచి ఉప్పు

ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని జాఫ్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు ఆర్.జయశేగరన్ ఆందోళన వ్యక్తంచేశారు.

‘‘ఉప్పు భారత్ నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. ఎన్నో సిమెంటు పరిశ్రమలు మూతపడ్డాయి. సముద్ర తీరం వెంబడి ఉన్న సారవంతమైన భూములు సైన్యం అధీనంలో ఉన్నాయి. శాశ్వత రాజకీయ పరిష్కారమే అన్ని సమస్యలకు పరిష్కారం. మాకు స్వతంత్రత లేదు. మాకు మరిన్ని అధికారాలు కావాలి’’ అని ఆయన తెలిపారు.

అధికార కేంద్రీకరణ తమ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని జాఫ్నా ప్రజలు భావిస్తున్నారు. పోలీసు నియామకాల్లోనూ, భూముల అమ్మకం వ్యవహారాల్లోనూ కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.

ప్రావిన్సియల్ కౌన్సిల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని ఉత్తర ప్రావిన్సియల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కె.సర్వేశ్వరన్ చెప్పారు.

‘‘గవర్నర్‌ను అధ్యక్షుడే నియమిస్తారు. పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రావిన్సియల్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రించగలదు. చీఫ్ సెక్రటరీని అధ్యక్షుడే నియమిస్తారు. గవర్నర్, సీఎస్‌లతో మొత్తం వ్యవహారాన్ని అధ్యక్షుడే నడిపించగలరు’’ అని పేర్కొన్నారు.

తండ్లాడుతున్న జాఫ్నా

జాఫ్నాలో అసలైన శాంతి లేదని, విదేశాలకు పారిపోయినవాళ్లు నేటికీ తిరిగి రాలేదని సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ దయా సోమసుందరం అభిప్రాయపడ్డారు.

ఆయన శ్రీలంక అంతర్యుద్ధం ప్రధానాంశంగా వెలువడిన ‘బ్రోకెన్ పామిరా’ పుస్తకం సహరచయిత.

ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోయిందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులను, ఆప్తులను పోగొట్టుకున్నవారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు.

జాఫ్నాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే ఇక్కడ యుద్ధ గాయాలు ఇంకా మానలేదని స్పష్టమవుతుంది. పునర్నిర్మాణం కోసం జాఫ్నా తండ్లాడుతోందని అర్థమవుతుంది.

మళ్లీ సాయుధ తిరుగుబాటు జరగాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. కానీ యుద్ధం అనంతరం తమకు దక్కుతాయని ఆశించిన పూర్తిస్థాయి ప్రయోజనాల కోసం శ్రీలంక తమిళులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు