అమ్మ టీవీ చూసే అలవాటు మాన్పించాలని గూగుల్ ఉద్యోగం వదిలేసిన కొడుకు!

  • కింజల్ పాండ్యా-వాఘ్
  • బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
నఫీస్, మునాఫ్

ఇదొక అబ్బాయి, వాళ్లమ్మ... ఇద్దరి కథ. అమ్మ పొద్దస్తమానం బుల్లితెరకు కళ్లు అప్పగించేస్తోంది. తనకు ఇష్టమైన ఛానెల్ చూడనివ్వకుండా అతనితో పోట్లాడుతోంది. ఇది అమ్మ ఆరోగ్యానికీ, తనకూ మంచిది కాదు. ఏం చేయాలా అని ఆలోచించాడా అబ్బాయి.

అమ్మ చేతి వంటలో అతనికి పరిష్కారం కనిపించింది.

ఒక రోజు తన మిత్రులను భోజనానికి ఆహ్వానించాడు. అమ్మ వంట వారికి ఎంతగానో నచ్చింది.

ప్రతి శని, ఆదివారాలు ఇది అలవాటుగా మారిపోయింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి నలుగురికి తెలియడంతో స్నేహితులతో పాటు ఇతరులు కూడా రావడం ప్రారంభించారు.

ఫొటో క్యాప్షన్,

ప్రజలు కపాడియా ఇంటికి ప్రతి వారాంతం భోజనానికి వస్తారు.

మంది పెరగడంతో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత క్రమంగా ముంబయిలోని ఆ ఇల్లే ఒక చిన్న హోటలుగా మారి పోయింది. దాని పేరు 'ది బోహ్రి కిచెన్'.

ఇదంతా జరిగింది దాదాపు మూడేళ్ల క్రితం. ఆ అమ్మ పేరు నఫీజా. ఆ కొడుకు పేరు మునాఫ్ కపాడియా. అప్పుడు అతని వయసు 25 ఏళ్లు.

భోజనానికి రూ.700 వసూలు చేసేవారు. ఏడు రకాల వంటకాలు. "తిన్న వారంతా అమ్మను హత్తుకుని మీ చేతిలో ఏదో మాయ ఉందంటూ ఆనందం వ్యక్తం చేసేవారు" అంటూ గర్వంగా చెబుతాడు కపాడియా.

ఈ ఆనందాన్ని మరింత మందికి పంచాలనే ఉద్దేశంతో 2015లో గూగుల్ కొలువును వదలుకున్నాడు. ఇంట్లో వాళ్లు వద్దని వారించినా తన నిర్ణయం మార్చుకోలేదు. 'ది బోహ్రి కిచెన్' బ్రాండ్‌ను ఆవిష్కరించాడు. అలా భోజన ప్రియుల నోటి చలవతో క్రమంగా ఆదరణ పెరిగింది.

ప్రస్తుతం ఒక్కో భోజనానికి రూ. 1500 వసూలు చేస్తున్నారు.

అంతేకాదు టేకవే, కేటరింగ్ సేవలు కూడా కపాడియా ప్రారంభించారు. ఇందుకు ముగ్గురు ఉద్యోగులను పెట్టుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

బోహ్రీ తెగలో ‘తాల్’ అనే పెద్ద పళ్లెం చుట్టూ అందరూ కూర్చోని తింటారు.

లాభాల 'రుచి'

ప్రస్తుతం 'ది బోహ్రీ కిచెన్' లాభాలు చవి చూస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు తెరవాలని కపాడియా భావిస్తున్నారు.

దావూదీ బోహ్రా అనేది ముస్లింలలో ఒక వర్గం. 'తాల్' అని పిలిచే ఒక పెద్ద పళ్లెంలో వంటకాలు పెడతారు. అందరూ చుట్టూ కూర్చొని తింటారు. సమానత్వానికి, పంచుకొని తినడానికి ఇది ప్రతీక.

ఫొటో క్యాప్షన్,

మటన్ కిచ్డా: మేక మాంసం, బియ్యం, పప్పుతో వండుతారు.

కొన్ని ప్రముఖ బోహ్రీ వంటకాలు

మటన్ కిచ్డా: బియ్యం, పప్పు, మేక మాంసం కలిపి దీన్ని వండుతారు.

చనా బటాతా తులి: చనా, బంగాళ దుంపలు, చింతపండు గుజ్జుతో తయారు చేస్తారు.

చికెన్ అంగారా: మంటపై కాల్చిన కోడి మాంసం, టమోటా గ్రేవీ, ఒక రకమైన రొట్టె ఇందులో ఉంటాయి.

ఫొటో క్యాప్షన్,

ది బోహ్రీ కిచెన్ పార్శిల్ సేవలు కూడా ప్రారంభించింది.

సమస్యలూ ఉన్నాయి

పరిచయంలేని వ్యక్తులను ఇంటికి ఆహ్వానించడంలో కొన్ని సమస్యలున్నాయని కపాడియా చెబుతున్నారు. వినియోగదారుల గురించి మంచిచెడు విచారించాక మాత్రమే వారిని ఆహ్వానిస్తామని అంటున్నారు.

"ప్రస్తుతం భారత్‌లో భోజన ప్రియులకు అనేక అవకాశాలున్నాయి. వ్యాపారం చేయడం, నిధులు సమీకరించడం ఈ రోజుల్లో సులువే. కానీ వినియోగదార్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే సవాలు" అని మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ టెక్నోపాక్ అడ్వైజర్స్‌కు చెందిన రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

చాలా సన్నగా చిన్నగా తరిగిన గొర్రె పిల్ల మాంసం, ధనియాలు, ఉల్లిపాయాలు, నిమ్మ రసంతో బోహ్రీ కిచెన్ సమోసాలు చేస్తుంది.

తాను వండడాన్ని ఎప్పుడూ వ్యాపార కోణంలో చూడలేదని నఫీజా అంటున్నారు. తనకు వండటంలో సంతోషం ఉందని, పదిమంది కళ్లలో ఆనందం చూస్తే తనకు ఎంతో తృప్తి అని చెబుతున్నారు.

మొత్తానికి మీరు టీవీ చూడటం ఆపేశారా..? అంటే "లేదు. వంట చేస్తూనే అన్ని సీరియల్సూ చూస్తున్నాను" అంటూ ఆమె చిరునవ్వుతో ఆమె సమాధానం చెప్పడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)