దిల్లీ: క్రైస్తవులుగా మారుతున్న రోహింజ్యా ముస్లింలు

  • అభిమన్యు కుమార్ షా
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

జాన్ సుల్తాన్

జాన్.. శామ్యూల్.. పీటర్..

ఈ పేర్లు ముస్లింలకు ఉంటాయంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎందుకంటే ఇలాంటి పేర్లు వారి మతంలో ఉండవు కనుక. అయితే దిల్లీలోని రోహింజ్యాలు ఇందుకు మినహాయింపు. కారణం.. వారు మతం మార్చుకుంటున్నారు కాబట్టి.

మహ్మద్ సుల్తాన్ అయిదేళ్ల క్రితం దిల్లీకి తన కుటుంబంతో వచ్చాడు. ఉత్తమ్‌నగర్‌లో నివాసం. ఇప్పుడు అతని పేరు జాన్ సుల్తాన్. తనను తాను క్రైస్తవునిగా ప్రకటించుకున్నాడు. ఆ మతాన్నే ఆచరిస్తుడున్నాడు. స్నేహితులకు, ఫేస్‌బుక్ మిత్రులకు బోధిస్తున్నాడు కూడా.

జాన్ సుల్తాన్ ఒక్కడే కాదు. ఉత్తమ్‌నగర్‌లో బతుకీడుస్తున్న దాదాపు 120 మంది రోహింజ్యా ముస్లింలు ఇప్పుడు క్రైస్తవులుగా మారారు. దగ్గర్లో ఉన్న చర్చిలో వారు ప్రార్థనలు చేస్తారు. తమ పిల్లలకు కూడా ఈ మతంలోని పేర్లే పెడుతున్నారు.

కబీర్‌కు ముగ్గురు పిల్లలు. రుబీనా(13), ఫర్మిన్(7) మయన్మార్‌లో ఉండగా పుట్టారు. దిల్లీలో ఏడు నెలల క్రితం జన్మించిన బిడ్డకు శామ్యూల్ అని పేరు పెట్టారు.

ఫొటో క్యాప్షన్,

రోహింజ్యాలు నివసించే కాలనీ అంతా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.

‘ఇక నమాజ్ పఠించేది లేదు’

హకీం తన కుమారునికి పీటర్ అని నామకరణం చేశాడు. బైబిల్‌లో ఉన్నందుకే ఈ పేరు పెట్టినట్లు అతను చెబుతున్నాడు. ఇక మేం నమాజ్ చేసేది లేదని స్పష్టం చేశాడు. మేం ఇప్పుడు ముస్లింలు కాదని, క్రైస్తవం ఎంతో మంచిదని విశ్వసిస్తున్నాడు. యేసునే ఆరాధిస్తామని బీబీసీతో చెప్పాడు.

"మా మురికివాడకు ఎదురుగా ఒక చర్చి ఉంది. కానీ అందులోకి మేం పోకూడదు. అది కేవలం కేథలిక్‌లకు మాత్రమే. మేం ప్రొటెస్టంట్స్. మా మురికివాడలో ఉన్న చర్చిలో ప్రార్థనలు చేస్తాం. వారు మేరీ మాతను ఆరాధిస్తారు. మేము యేసును పూజిస్తామ"ని జాన్ సుల్తాన్ బీబీసీకి చెప్పాడు. ప్రతి ఆదివారం అందరూ కలిసి ప్రార్థనలు చేస్తామని కరీం తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

మురికి వాడలోని చర్చిలో ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనలు ఉంటాయని కరీం చెబుతున్నారు

జాన్ ఫ్రోటేదర్ ఆంగ్లంలో మాట్లాడగలరు, రాయగలరు. రోహింజ్యాలపై దాడులు, క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఆంగ్లంలో పోస్ట్‌లు పెడుతుంటారు.

క్రైస్తవునిగా మారిన ఓ హిందువునకు సంబంధించిన దృశ్యాలను జాన్ సుల్తాన్ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.

మత సంస్థల చేయూత

అనేక మత సంస్థలు రోహింజ్యాలకు చేయూతనిస్తున్నాయి. ఇలాంటి ఒక సంస్థలో జాన్ సుల్తాన్ భాగస్వామిగా ఉన్నాడు. ఆ సంస్థలు వీరికి చదువు చెబుతున్నాయి. దూర విద్య ద్వారా జాన్ పదో తరగతి పరీక్షలు రాశాడు.

రూ.లక్షల్లో అద్దె

చుట్టూ ప్రహరీ ఉన్న విశాలమైన స్థలంలో రోహింజ్యాలు నివసిస్తున్నారు. దీనికి వారు ఏడాదికి రూ.లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

"ఇక్కడ ఏడాదిన్నరగా ఉంటున్నాం. తొలి ఏడాది అద్దె కింద రూ.2 లక్షలు చెల్లించాం. రెండో ఏడాది మరో రూ.20 వేలు పెంచారు. ఈ ఖర్చును అందరం పంచుకుంటాం. కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే వారు ఎక్కువ అద్దె చెల్లించాలి. సగటున ఏడాదికి ఒకో వ్యక్తి రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది." అని హకీం వెల్లడించారు.

భద్రత

రోహింజ్యాలు ఉండే ప్రదేశమంతా సీసీటీవీ కమెరాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం వద్ద వాచ్ టవర్ కూడా ఉంది.

ఇక్కడి మహిళలు బర్మీస్ భాషను మాట్లాడతారు. వీరు బయటకు రారు. ఇక పురుషులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లినా అక్కడ ఎవరితోనూ పెద్దగా కలవరు.

ప్రతి ఏడాది క్రిస్మస్‌ను ఇక్కడ ఎంతో సంబరంగా జరుపుకుంటారు.

అప్పట్లో ముస్లింలమనే చెప్పుకొనే వారు

తొలుత ఇక్కడి రోహింజ్యాలు తాము ముస్లింలమనే చెప్పుకొనే వారని ఓ మహిళ చెప్పారు.

కానీ ఇప్పుడు వారు చర్చికి వెళ్తున్నారు. భారత ప్రభుత్వం వారిని వెనక్కి పంపాలని చూస్తోంది. దీనికి సంబంధించిన కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

మతమనేది వ్యక్తిగత విషయం

మతమనేది వ్యక్తిగత విషయమని జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ సయ్యద్ జాఫర్ అభిప్రాయపడుతున్నారు.

రోహింజ్యాలు స్వచ్ఛందంగా క్రైస్తవులుగా మారే హక్కు వారికి ఉందని, బలవంతంగా చేయడం తప్పని చెబుతున్నారు. రోహింజ్యాల ఆదుకునేందుకు జకాత్ ఫౌండేషన్ కృషి చేస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)