ఆస్ర్టియా అధినేతగా 31 ఏళ్ల ఖర్జ్!

  • 16 అక్టోబర్ 2017
సెబాస్టయన్ ఖర్జ్ Image copyright AFP

ప్రపంచంలోనే అత్యంత చిన్నవయస్సుకల దేశ నాయకుడిని ఆస్ట్రియా చూడబోతోంది. తాజా ఎన్నికల్లో, కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ గెలుపు దిశగా అడుగు వేస్తోంది. ఈ పార్టీకి 31సంవత్సరాల సెబాస్టియన్ ఖర్జ్ నాయకత్వం వహిస్తున్నారు.

ఎన్నికల ఫలితాల్లో, పీపుల్స్ పార్టీ ముందంజలో ఉంది. ఇక సోషల్ డెమెక్రాట్స్, రైట్ ఫ్రీడమ్ పార్టీలు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యాయి.

అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేకపోవడంతో ఫ్రీడమ్ పార్టీతో పొత్తుపెట్టుకునే దిశగా ఖర్జ్ అడుగులు వేస్తున్నారు.

''ఈ దేశంలోని పరిస్థితులను, ఈ దేశాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అవకాశాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా దేశం కోసం పని చేయడం సంతోషాన్నిస్తోంది..'' అని ఖర్జ్ అన్నారు.


రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా

రాజధాని - వియన్నా

జనాభా - 8.7 మిలియన్

భాష - జర్మన్

ప్రధాన మతం - క్రిస్టియానిటీ

కరెన్సీ - యూరో

Image copyright Getty Images

ఎవరీ ఖర్జ్?

2013లో ఆస్ట్రియా విదేశాంగ మంత్రిగా ఖర్జ్ పనిచేశారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలే.

తన రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ యువ విభాగం నుంచే ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2017లో పీపుల్స్ పార్టీకి నాయకుడిగా ఎంపికయ్యారు.

ఖర్జ్‌ను అభిమానించేవారు, అతడిని ''నీళ్లపై నడిచే వ్యక్తి'' గా అభివర్ణిస్తారు.

ఫ్రాన్స్, కెనెడాల్లోని యువ నాయకులు ఎమ్మాన్యుయెల్ మ్యాక్రోన్, జస్టిన్ ట్రూడోలతో ఖర్జ్‌ను పోలుస్తారు.

ఫ్రెంచ్ నేత మ్యాక్రోన్‌లాగ ఖర్జ్ కూడా కీలకమైన మార్పులు తీసుకువచ్చారు.

30 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీని ''ది న్యూ పీపుల్స్ పార్టీ'' గా మార్చి, పార్టీ పేరునే కాకుండా, ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాలనూ మార్చారు.

ఖర్జ్ విధానాలే, పీపుల్స్ పార్టీ విజయంలో కీలకంగా మారాయి. డిసెంబర్‌లో జరిగిన ప్రెసిడెన్సీ ఎన్నికల్లో ఈ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమిని అధిగమించడానికి పీపుల్స్ పార్టీకు ఎక్కువ సమయం పట్టలేదు.

ఖర్జ్ విధానాలు ఆస్ట్రియా ప్రజలను అత్యంతంగా ఆకట్టుకుంటున్న సందర్భంలో, ఖర్జ్‌ని ఓ మోసగాడంటూ ఫ్రీడమ్ పార్టీ విమర్శించింది.

ఖర్జ్ అనుసరిస్తున్న విధానాలు తమ పార్టీవేనని, ఖర్జ్ తమ పాలసీలను కాపీ కొట్టారని పేర్కొంది.

వాట్ నెక్స్ట్??

ఎన్నికల్లో మెజారిటీ ఓట్లను పీపుల్స్ పార్టీ సాధించినా.. ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం, ఫ్రీడమ్ పార్టీ సహకారం అవసరమవుతుంది.

ఫ్రీడమ్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

పొత్తు విషయంపై మాట్లాడ్డానికి ఖర్జ్ నిరాకరించారు. తమకు సహకరించే పార్టీలతో మాత్రమే ఈ విషయాలను చర్చిస్తామని ఆయన అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు