చైనాలో ఇంటర్నెట్‌‌పై కఠిన ఆం‌‌క్షలు

ఇంటర్నెట్‌, నియంత్రణ

ప్రజల భావవ్యక్తీకరణను నియంత్రిస్తే అది వారి ఆలోచనా తీరునే మార్చేస్తుంది. అలవాట్లు, జీవనశైలిపై ప్రభావం చూపుతుంది. ఈ సూత్రాన్ని చైనా ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే ఇంటర్నెట్‌ను తన గుప్పిట ఉంచుకుంది.

ప్రతి అయిదేళ్లకు ఓ సారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నియంత్రిస్తోంది.

అక్కడి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినా లేదా వారికి వ్యతిరేకంగా మాట్లాడినా బ్లాక్ చేస్తోంది.

చివరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఫన్నీ స్టిక్కర్లను చాటింగ్ గ్రూపుల్లో పంపించినా వాటిని బ్లాక్ చేస్తున్నారు.

వీచాట్.. చైనాలో వాడే చాటింగ్ అప్లికేషన్. ఆ చాటింగ్ అప్లికేషన్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడే కొన్ని పదాలు ఉండవు.

ఫొటో సోర్స్, AFP/Getty Images

అదే చైనా గ్రేట్ వాల్

ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ను ఎవరూ తమ అధీనంలోకి తీసుకోలేరని చాలా మంది అంటుంటారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం ఇంటర్నెట్‌ను నియంత్రించొచ్చని రుజువు చేసింది.

ఇంటర్నెట్‌ను చైనా ఇంట్రానెట్ రూపంలో అందిస్తుంది. అంటే పరిమితంగానే నెట్ ఇస్తుంది.

చైనాలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి వెబ్ సైట్లు పనిచేయవు.

అక్కడ అవి వీపీఎన్ ద్వారానే పనిచేస్తాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల సందర్భంగా చైనా ఈ వీపీఎన్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించింది.

చైనీస్ అప్లికేషన్ స్టోర్ నుండి అన్ని వీపీఎన్‌లను తొలగించాలని యాపిల్ కంపెనీని చైనా ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలు గూగుల్‌లో ఏం శోధిస్తున్నారో తెలుసుకునేందుకు తమను అనుమతించాలని ఆ కంపెనీని కోరింది.

కానీ గూగుల్ కాదనడంతో ఆ సంస్థను అక్కడ నిషేధించారు.

ఇలా చైనాలో ఇంటర్నెట్ కూడా అక్కడి గ్రేట్ వాల్ లానే దుర్భేద్యంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP/Getty Images

మీడియాపై అతి నియంత్రణ

చైనాలో ఉన్న ప్రతీ దినపత్రిక, టీవీ చానెల్ అక్కడి ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. గతేడాది చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పీపుల్స్ డైలీ న్యూస్ పేపర్, జిన్హువా, ప్రభుత్వ ప్రసారక ఛానెల్ సీసీటీవీ కార్యాలయాలను సందర్శించారు.

ఈ సందర్భంగా టీవీ రిపోర్టర్లు చైనా ప్రభుత్వానికి సంపూర్ణ విధేయత చూపించాలని అన్నారు.

కేవలం సున్నితమైన అంశాలే కాకుండా మీడియాలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలోనూ ప్రభుత్వ జోక్యం ఉంటుంది.

ఆన్ లైన్ బుక్ స్టోర్లు కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహించాలి.

ప్రముఖుల కుంభకోణాలను వివరించే బ్లాగులు కూడా మూతబడ్డాయి.

టీవీపైనా పట్టు

గత నెల చైనా ప్రభుత్వం టీవీ చానెళ్లకు కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రసార కార్యక్రమాలు సాంస్కృతిక అభిరుచిని పెంచే విధంగా, ఆధ్యాత్మికత నాగరికతను పటిష్టం చేసే విధంగా ఉండాలని స్పష్టం చేసింది.

టీవీ కార్యక్రమాలలో వివాహేతర సంబంధాలు, జూదం, డ్రగ్స్, స్వలింగ సంపర్క పాత్రలు, అనైతిక ప్రవర్తన వంటి పాత్రలు ఉండకూడదని తెలిపింది.

చైనాలో ఎలాంటి కార్యక్రమాలు టీవీలో ప్రసారమవ్వాలో, ప్రసారం కాకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

గతంలో అక్కడి ప్రసార మాధ్యమాలకు విదేశీ ప్రదర్శనలు ప్రసారం చేయొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

స్థానిక చానెళ్లు కూడా ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగానే కార్యక్రమాలను ప్రసారం చేయాలి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)