మీకు తెలియని సమోసా సంగతులు!

సమోసా

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్,

ఇరాన్ నుంచి భారత్ వచ్చిన సమోసా

సమోసా ఇష్టపడని వారు ఉండరు. ప్రాంతాన్ని బట్టి పేరు, రూపం, రుచి వేరుగా ఉన్నా దాదాపు అందరికీ పసందైన వంటకం ఇది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. అందుకే సమోసా భారత్‌లోనే పుట్టిందని అందరూ భావిస్తారు. కానీ దానికి మించి ఇంకేదో ఉందని చరిత్ర చెబుతోంది.

నిజానికి సమోసా వేల మైళ్లు ప్రయాణించి భారతదేశం చేరింది. ప్రాచీన ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చింది.

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్,

హిందూకుష్ మంచు పర్వతాల మీదుగా భారత ఉపఖండానికి చేరిన సమోసా

సమోసా తొలి ప్రస్తావన!

సమోసా తొలిసారి భారతదేశానికి ఎప్పుడొచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ పర్షియన్ పదం 'సనుబాబాద్' నుంచి సమోసా పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

11వ శతాబ్దంలో తొలిసారిగా సమోసా ప్రస్తావన కనిపిస్తుంది. పర్షియన్ చరిత్రకారుడు అబ్దుల్ ఫజల్ బెహౌకీ తన రచనల్లో తొలిసారిగా సమోసా పదం ఉపయోగించారు.

గజాన్వీ సామ్రాజ్యంలోని న్యాయస్థానంలో ఉప్పగా ఉండే పదార్థం వడ్డించేవారని చరిత్రకారుడు అబ్దుల్ ఫజల్ బెహౌకీ పేర్కొన్నాడు. దానిని కరకరలాడేలా నూనెలో వేయించేవారని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

పంజాబ్‌లో పన్నీర్ సమోసా.. బిహార్‌లో స్వీట్ సమోసా

ఆ పదార్థమే సమోసాగా మారిందట.

అయితే, ఇరాన్ నుంచి భారత్‌కు వర్తకుల రాకపోకలు పెరగడంతో సమోసాలో అనేక మార్పులు వచ్చాయి.

ఇప్పుడు అఫ్ఘనిస్తాన్‌గా పిలుస్తున్న మధ్య ఆసియాలోని పర్వతాల మీదుగా సమోసా భారత్ చేరింది. విదేశీయుల రాకపోకలతో భారత్‌లోని అనేకరంగాల్లో మార్పులు వచ్చాయి. సమోసా విషయంలోనూ ఇదే జరిగింది.

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్,

ప్రాంతంతో పాటే సమోసా రూపం, రుచీ మారాయి

హిందూకుష్ పర్వతాల మీదుగా భారత ఉపఖండంలోకి!

కాలక్రమేణా సమోసా తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అక్కడ పెను మార్పులకు లోనైంది. క్రమంగా సమోసా రైతులకు ప్రధాన ఆహారంగా మారిందని ఆహార నిపుణులు ఫ్రొఫెసర్ పుష్పేష్‌ పంత్‌ చెప్పారు.

శతాబ్దాల తర్వాత హిందూకుష్ మంచు పర్వతాల మీదుగా ప్రయాణించి సమోసా భారత ఉపఖండానికి చేరింది.

ఇప్పుడు సమోసా హై కేలరీ వంటకం. మొదట్లో కూరగాయలతో సాదాసీదా సమోసా తయారు చేసేవాళ్లు. ఇప్పుడు మాంసం, డ్రై ఫ్రూట్స్, ఉల్లి మిక్స్ చేసి తగినంత ఉప్పు దట్టించి మరింత స్పైసీగా సమోసా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్,

తుగ్లక్ రాజ్యంలో సమోసా విందు

కూరగాయల స్థానంలో మాంసం!

ఫ్రొఫెసర్ పంత్‌ ప్రకారం సమోసా భారత్‌ చేరిన తర్వాత సమూలంగా మారిపోయిందట. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సమోసాను మార్చేశారు. దాంతో ప్రపంచంలోనే తొలి ఫాస్ట్‌ఫుడ్‌గా సమోసా రికార్డు కొట్టింది.

సమోసా తయారీలో అల్లం, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు.. ఇలా ఎన్నో ఉపయోగిస్తారు. సమోసాపై ఎవరికి వారు నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

సమోసా రుచి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో దాని రుచి వేర్వేరుగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఉన్న వేర్వేరు షాపుల్లో కూడా సమోసా టేస్ట్ భిన్నంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP

తుగ్లక్ కోర్టులో సమోసా విందు!

కాలక్రమేణా పెళ్లి విందులు, శుభకార్యాల్లో సమోసా భాగమైపోయింది. మొరాకో ట్రావెలర్‌ బాటుటా చెప్పిన ప్రకారం మహమ్మద్ బిన్ తుగ్లక్ న్యాయస్థానంలో సమోసాను వడ్డించేవారట.

బఠానీలు, బీన్స్‌తో పాస్తా చేసి సమోసాల్లో పెట్టి నూనెలో వేయించేవారట.

పంజాబ్‌లో పన్నీర్ సమోసా కామన్. ఢిల్లీలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి చేసే సమోసాలు ఫేమస్.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

సమోసా రుచి అమోఘం

బెంగాల్‌లో స్వీట్ సమోసా ఇష్టపడతారు. ఢిల్లీలోని రెస్టారెంట్లలో చాక్లెట్ సమోసాలు కూడా దొరకుతాయి.

సమోసా కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. బ్రిటీషర్లు కూడా సమోసాలు ఇష్టంగా తింటారు. బ్రిటన్ వెళ్లిన భారతీయులు అక్కడి వారికి సమోసాలను పరిచయం చేశారు.

ఒకప్పటి ఇరాన్ రాజుల వంటకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైంది. పేరు ఏదైనా సమోసా రుచి మాత్రం అమోఘం అంటారు తిన్నవాళ్లు. ఏ ప్రాంతంలో దొరికినా.. సమోసాలో భారతీయత కనిపిస్తుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)