అభిప్రాయం: 'ఆర్థిక వ్యవస్థ చెబుతున్నంత బలంగానే కనిపిస్తోందా?'

  • 16 అక్టోబర్ 2017
మోదీ, ఆర్థిక వ్యవస్థ, ఐఎంఎఫ్, వృద్ధి రేటు

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సారథి క్రిస్టీన్ లగార్డే ఇటీవల మోదీ సంస్కరణలను ప్రశంసించారు. పెద్దనోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) వంటివి ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకొస్తాయని కొనియాడారు. గత కొద్ది సంవత్సరాలుగా భారత్ బాగా రాణిస్తోందని, ప్రగతి పథంలో వేగంగా దూసుకు పోతోందని అన్నారు.

అదే లగార్డే నేతృత్వంలోని ఐఎంఎఫ్ ఇటీవల భారత్ వృద్ధి రేటు అంచనాలను తగ్గించి లెక్కగట్టింది. అంచనాలను తగ్గించినప్పటికీ మధ్య, దీర్ఘకాలంలో భారత్ రాణిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీతో భారత ఆర్థిక వ్యవస్థ మందగించినట్లు ఇటీవల కొన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అంతా బాగుందని లగార్డే చెబుతున్నారు. ఆమె చెప్పినంత బాగా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎందుకు లేదు?

ఇదే ప్రశ్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అర్థశాస్త్ర ప్రొఫెసర్ అరుణ్ కుమార్‌ను బీబీసీ కరస్పాండెట్ కుల్‌దీప్ మిశ్రా అడిగారు. ఇందుకు అరుణ్ కుమార్ తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

Image copyright REUTERS / YURI GRIPAS

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి వాటి వద్ద భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరైన సమాచారం ఉండదు. ప్రభుత్వ గణాంకాలపైనే అవి ఆధారపడతాయి.

ప్రపంచవ్యాప్తంగా 5.7 శాతం వృద్ధి రేటును మంచిదని భావిస్తారు. గత ఏడాది మన వృద్ధి రేటు 6.1 శాతం. అంటే మన ఆర్థిక వ్యవస్థ గతి స్వల్పంగానే తగ్గిందనేది దీని అర్థం.

ఒక్కసారి అసంఘటిత రంగాన్ని తీసుకోండి. గత ఏడాదిలో ఎంతగానో క్షీణించింది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే వృద్ధిరేటు దాదాపు ఒక శాతం మాత్రమే. కాబట్టి ఐఎంఎఫ్ విశ్లేషణలు మన ఆర్థిక వ్యవస్థ వాస్తవ పనితీరును ప్రతిబింబించడం లేదు.

దేశాన్ని వృద్ధి పథంలో నడిపేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇంకా మరిన్ని సంస్కరణలు చేపట్టాలని ఐఎంఎఫ్ ప్రోత్సహిస్తోంది.

Image copyright REUTERS / AMIT DAVE

అంటే ఐఎంఎఫ్‌వి సొంత లెక్కలు కాదన్నమాట

భారత ఆర్థిక వ్యవస్థలో ఇంకా 45 శాతం అసంఘటితంగానే ఉంది. ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వేలు నిర్వహించదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలపై మాత్రమే ఐఎంఎఫ్ లాంటి సంస్థలు పూర్తిగా ఆధారపడుతున్నాయి.

మరోవైపు ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని లగార్డే చెబుతున్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవారంగం వాటా 60 శాతంగా ఉంది. అయినా దీనికి సంబంధించి సరైన లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు.

బడి ఫీజులు, బీమా ప్రీమియం, టెలిఫోన్ బిల్లులు ఇలాంటి సేవలెన్నో ఖరీదైనవిగా మారుతున్నాయి. జీఎస్‌టీలో సేవలపై పన్నును 15 నుంచి 18 శాతానికి పెంచారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మన ద్రవ్యోల్బణం కనీసం 6-7 శాతమైనా ఉంటుంది.

Image copyright REUTERS / DANIAN SIDDIQUI

మంచి రోజులు వస్తాయా?

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల కలిగే ఇబ్బందులు తాత్కాలికమేనని ప్రభుత్వ మద్దతుదార్లు అంటున్నారు. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

నిజానికి ఒకవేళ అంసఘటిత రంగం క్షీణిస్తే ఉపాధి అవకాశాలు తగ్గి పోతాయి. దీంతో వినియోగం తగ్గి గిరాకీ మందగిస్తుంది. ఈ ఏడాది జులై-ఆగస్టులో రుణాల వితరణ దారుణంగా పడిపోయింది. గత 70-80 ఏళ్లలో ఇలాంటిది చోటు చేసుకోలేదు.

Image copyright AFP PHOTO / INTERNATIONAL MONETARY FUND / STEPHEN

ఉత్పత్తి తగ్గుతుంది

రుణాలు తీసుకోవడం తగ్గిపోవడం అంటే అర్థం పెట్టుబడి మదుపు తగ్గిపోతున్నట్టు. ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది.

వ్యవస్థాగత మార్పుల వల్ల లాభాలుంటాయని చెప్పడం సరికాదు. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయంటే తర్వాత కూడా నష్టాలే వస్తాయి.

ఈ స్థితి నుంచి ఎప్పటికి బయటపడతామో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఐఎంఎఫ్ చెబుతున్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక కాలావధి ఏమిటో చెప్పడం కష్టం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)