లక్ష్మీస్ ఎన్‌టీఆర్‌పై వర్మ పటాసులు

  • 20 అక్టోబర్ 2017
రామ్ గోపాల్ వర్మ, సోషల్ మీడియా, ఎన్‌టీ‌ఆర్, లక్ష్మీ Image copyright FACEBOOK

"చింపేస్తే చిరిగి పోవడానికి.. కాల్చేస్తే బూడిద కావడానికి ఇది కాగితం కాదు చరిత్ర"

అబ్బా! ఏం డైలాగ్‌రా బాబు. ఇంతకూ ఏ సినిమాలోది అంటారా?

సినిమాలోది కాదు కానీ, సినిమా డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మది. సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఆయన పేల్చిన 'లక్ష్మీ' టపాసుల్లో ఇదొకటి.

లక్ష్మీస్ ఎన్‌టీఆర్. ఇటీవలే ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన వర్మ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అలజడి సృష్టించారు.

ఎన్‌టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించాక చోటు చేసుకున్న పరిణామాలను ఈ చిత్రం ద్వారా ప్రజలకు వెల్లడించనున్నట్లు వర్మ తెలిపారు.

అయితే దీనిపై తెలుగు దేశం పార్టీ నాయకులు వర్మని విమర్శిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా వర్మ వారి ప్రశ్నలకు ఫన్నీ కామెంట్లు, వ్యంగ్య సమాధానాలు ఇస్తున్నారు.

"లక్ష్మీస్ ఎన్‌టీఆర్‌లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు" అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే.. "అందుకే కదా జరిగిన నిజాలనే నేను తీస్తున్నాను" అని వర్మ చమత్కరించారు.

"ఎన్‌టీఆర్ జీవితం తెరచిన పుస్తకం" అని చంద్రబాబు అనగా.."ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చించి వేసిన చాలా పేజీలను తిరిగి అతికిస్తా" అన్నది వర్మ సమాధానం.

Image copyright FACEBOOK

ఇక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్మను "సైకో"గా అభివర్ణించగా.."అవునా డాక్టర్ గారు మీకు సైకియాట్రీలో డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువురాని వారనుకున్నాను" అని వర్మ అమాయకంగా బదులిచ్చారు.

"వర్మ నా సినిమా నా ఇష్టం అంటే చూస్తూ ఊరుకోం" అని ప్రభాకర్ చౌదరి హెచ్చరించగా.."ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పాడతారా?" అని వర్మ సెటైర్ వేశారు.

అంతే కాదు "ఎన్‌టీఆర్ ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లేకు సహకరిస్తోంది" అని వర్మ చిచ్చు బుడ్లు పేల్చారు.

Image copyright FACEBOOK

"ఎన్‌టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే వర్మఇంటి ముందు ధర్నాకు దిగుతా" అని సినీనటి వాణీవిశ్వనాధ్ అనగా.."వాణీ గారు, నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా.. నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?" అంటూ ఆమెపై వర్మ చాలా జాలి చూపించారు.

"మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమాజహితం" అని టీడీపీ ఎమ్మెల్యే అనిత సలహా ఇవ్వగా.. "ఆహా క్లాప్సు విజిల్స్ !!!" అంటూ వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

"వర్మ తెలివితేటలను లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా సక్సెస్‌పై చూపమను" అని ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి అనగా.. "వావ్! ఏం జీనియస్ సార్ మీరు. మీరు చెప్పేవరకు నాకు ఈ విషయం తట్టనే లేదు. సోమి టీచర్ గారు, కనీవినీ ఎరుగని గొప్ప పాఠం చెప్పారు. దయచేసి ఫీజు ఏ అడ్రస్‌కు పంపాలో చెప్పండి?" అని వర్మ రిప్లై ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా పేలుతున్న ఈ 'లక్ష్మీ' టపాసులు ప్రస్తుతం తెగ సందడి చేస్తూ వినోదాన్ని పంచుతున్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు