చైనా: ఐదేళ్లలో వచ్చిన మార్పులు.. ఆరు చార్టుల్లో

చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు రానున్న ఐదేళ్ళలో ఆ దేశ భవిష్యత్తు విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి.
ఈ తరుణంలో గత ఐదేళ్ళలో చైనా ఎంతవరకూ అభివృద్ధి సాధించిందనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అధ్యక్షుడు షి జిన్పింగ్ సారథ్యంలో గత ఐదేళ్ళలో చైనాలో జరిగిన మార్పులు అక్కడి ప్రజాజీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయనే విషయం చాలా కీలకం.
అక్కడి ప్రజా జీవితంలో చోటు చేసుకున్న మార్పులపై కొన్ని సర్వే ఫలితాలను, గణాంకాలను బీబీసీ సేకరించి, విశ్లేషించింది.
దెబ్బకొట్టిన లింగనిష్పత్తి
చైనాలో ఎన్నో ఏళ్లుగా అమలులో ఉన్న ఏక సంతానం విధానానికి అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం 2015లో స్వస్తి పలికింది. చైనాలో జనాభా నియంత్రణకు ఏక సంతాన విధానాన్ని అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఈ నిర్ణయంతో లింగనిష్పత్తి పడిపోయింది.
ఇప్పుడు చైనాలో ఒకటికి మించి ఎక్కువ పిల్లలు కనే అవకాశంమున్నా అక్కడ వివాహాలు, విడాకుల విషయంలో పరిస్ధితులు మారుతున్నాయి. ఇప్పుడు వివాహాలు తగ్గి, విడాకులు పెరిగిపోతున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
"చైనాలో ఇప్పటికీ అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల కంటే తక్కువ విడాకుల రేటు ఉంది" అని న్యూయార్క్ యూనివర్శిటీ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ షుఆన్ లి అన్నారు.
" పొరుగు ప్రాంతాలు, దేశాలతో పోలిస్తే, చైనాలో చాలా మంది వివాహం చేసుకుంటారు. అయితే చైనాలో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయని అనడం సంఖ్యాపరంగా నిరాధారం" అని ఆయన అన్నారు.
పెళ్లికాని పురుషులు
2015లో చైనా ప్రభుత్వం ‘ఒకే సంతానం’ విధానాన్ని రద్దు చేసినా దీని ప్రభావం నుంచి బయట పడటం చైనాకు అంత సులభం కాదు. అందుకే ఇక్కడ 30 ఏళ్ళు దాటి పెళ్లికాని యువకులను "మిగులు పురుషుల"ని అంటారు.
పరిస్థితి ఎంతదారుణమంటే 2015లో ఒక చైనా వ్యాపారి తనకోసం సరైన అమ్మాయిని వెతకలేదని షాంఘైలో ఉన్న ఓ వివాహ పరిచయ సంస్థపై కోర్టులో దావా వేశాడు. ఎందుకంటే అతడు తనకోసం అమ్మాయిని వెతకమని 10 లక్షల డాలర్లు ఆ సంస్థకు చెల్లించాడు.
"చైనాలో ఒకే బిడ్డ విధానం అక్కడి జనాభాపై తీవ్ర ప్రభావం చూపింది. జననాల రేటు పడిపోయి, వృద్ధుల జనాభా తీవ్రంగా పెరిగింది. దీంతో అది కార్మిక వర్గంపై తీవ్ర ఒత్తిడికి దారి తీసింది. చివరికి ఆర్థిక వృద్ధి మందగించింది" అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్కు చెందిన లూయిస్ కోయిజ్ అన్నారు.
జనవరి 2016 నుంచి చైనాలో ఒకే బిడ్డ విధానానికి బదులు ఇద్దరు పిల్లల్ని కనే అవకాశం కల్పించినా, చైనా అవలంబించిన ఈ విధాన ప్రభావం మాత్రం కార్మిక వర్గంపై రెండు దశాబ్దాల వరకూ ఉండొచ్చని లూయిస్ అభిప్రాయపడ్డారు.
అయితే ప్రస్తుతం చైనాలో లింగనిష్పత్తిలో మార్పు వస్తోందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఫ్యామిలీ అండ్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్ మూ షాంగ్ తెలిపారు.
"చైనాలో ఇప్పుడు పిల్లలు కనే విషయంలో కొత్త విధానం అమలులో ఉంది. ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతోంది. చదువు నుంచి ఉద్యోగాల వరకూ మహిళా భాగస్వామ్యం పెరుగుతోంది. సామాజిక భద్రత మరింత పటిష్టంగా ఉంది" అని ఆయన అన్నారు.
కానీ చైనాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పురుషులకు అమ్మాయి దొరకడం మాత్రం కష్టంగా మారింది.
సొంతిల్లు ప్రభావం!
సొంతిల్లు కలిగి ఉండే విషయంలో మాత్రం చైనా యువత అమెరికా, యూరోప్ దేశాల యువతకన్నా ముందున్నారు. చైనాలో 2000 తర్వాత పుట్టిన 70 శాతం యువతకు సొంతిల్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సొంతిల్లు కొనివ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే అక్కడ సొంతిల్లుంటే తమ పిల్లలకు త్వరగా పెళ్లవుతుంది కాబట్టి.
చైనాలో సొంతిల్లు కలిగి ఉండే విషయంలో హెచ్ఎస్బీసీ ఓ సర్వే నిర్వహించింది. "చైనాలో పెళ్లి విషయంలో సొంతిల్లు కీలకం" అని ఎస్ఓఏఎస్ చైనా ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ జియు లియు బీబీసీతో అన్నారు.
"ఎన్నో ప్రేమ కథలు సొంతిల్లు లేదనే కారణంతోనే పెళ్లి పీటలెక్కవు" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కారణంతోనే చైనాలో పురుషుడికి ఇల్లు లేదంటే అమ్మాయి దొరకడం చాలా కష్టం. పెళ్లవ్వాలంటే ఆస్తులుండటం చాలా ముఖ్యం.
స్మార్ట్ ఫోన్ బతుకుబండి !
చైనాలో సమాచార వ్యవస్థలో కూడా ఖర్చులు పెరిగాయి. చైనాలో స్మార్ట్ ఫోన్ చాలా సర్వ సాధారణం. వి చాట్ ఇక్కడి జనజీవితంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ఇక్కడ స్మార్ట్ ఫోన్ లేదంటే బతుకుబండి నడవదు.
చైనాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఆదాయం పెరిగింది. గత దశాబ్దాలలో ఆహార అవసరాలపై ఖర్చులు తగ్గి, ఆరోగ్యం, దుస్తులు, రవాణా తదితర ఖర్చులు మాత్రం పెరిగాయి.
విదేశీ చదువు
పెరుగుతున్న ఆదాయంతో చైనా ప్రజలు తమ పిల్లల చదువుపై మరింత ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపించేందుకు సైతం వెనుకాడటం లేదు. చైనా విద్యార్థులు విదేశాలలో చదువుకున్నా, తిరిగి తమ తమ దేశాలకు తిరుగుబాట పడుతున్నారు.
"విదేశాల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థులు చైనా తిరిగి వచ్చేస్తున్నారు. 2016లో 4,33,000 విద్యార్థులు తిరిగి వచ్చేశారు" అని ఏపిఏసి చీఫ్ ఆర్థికవేత్త రాజీవ్ బిస్వాస్ తెలిపారు.
"విదేశాల్లో చదివిన ఈ విద్యార్థులు రాబోయే తరంలో చైనా వ్యాపార, రాజకీయ రంగాల్లో నాయకులుగా తయారవుతారు. చైనా రాబోయే దశాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యే తరుణంలో వీరి అంతర్జాతీయ స్థాయి ఆలోచన, వివిధ సంస్కృతుల పట్ల అవగాహన దేశానికి ఎంతో తోడ్పడుతుంది" అని ఆయన అన్నారు.
ఐరోపా లేదా అమెరికన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టాతో జాబ్ మార్కెట్లో ఉద్యోగం దొరకడంతో పాటు అది తగిన జీవిత భాగస్వామి దొరకడానికి కూడా తోడ్పడుతుంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)