శ్రీలంకలో ఆర్థిక ప్రయోజనాల కోసం భారత్, చైనాల పోటీ

  • 19 అక్టోబర్ 2017
చైనా, భారత్, శ్రీలంక, పోర్టు, రవాణా, పెట్టుబడులు
చిత్రం శీర్షిక మత్తాలా విమానాశ్రయం నిర్వహణను భారత్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు శ్రీలంక ఆరోగ్య మంత్రి రాజిత సేన రత్నచెబుతున్నారు

భారత్, చైనా చాలా దేశాల్లో తమ ఆర్థిక ప్రయోజనాల కోసం పోటీపడుతున్నాయి. శ్రీలంక వీధుల్లో ఈ పోటీ ప్రత్యక్షంగా కనిపిస్తోంది.

శ్రీలంక రాజధాని కొలంబో. దీనికి దక్షిణంగా ఉండే మత్తాలా విమానాశ్రయ నిర్వహణ భారత్‌కు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

దీన్ని వ్యతిరేకిస్తూ తాజాగా అక్కడి విపక్షాలు భారత రాయబార కార్యాలయం ముందు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్నఅల్లర్లలో ముగ్గురు పోలీసులు గాయపడగా, 28 మంది అరెస్టయ్యారు.

శ్రీలంకతో చైనా ఆర్థిక ప్రయోజనాలు అడుగడుగునా ముడిపడి ఉన్నాయి.

హాంబంటోటా హార్బర్, మత్తాలా విమానాశ్రయం, కొలంబోలో కొత్తగా నిర్మిస్తున్నభవనాలు, రహదారులు.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ చైనా కంపెనీలు శ్రీలంకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

రాజధాని కొలంబో నుంచి ఒక ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణించి హాంబంటోటా నగరానికి చేరుకున్నాం. ఈ రహదారిని కూడా చైనా సహకారంతోనే శ్రీలంక నిర్మించింది.

నష్టాల్లో ప్రాజెక్టులు

శ్రీలంకలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే గిరాకీ తగ్గడంతో లాభాలు ఆశించనంతగా రావడం లేదు.

ఇక్కడ రహదారి వెంట నిర్మించిన హైటెక్ కాన్ఫరెన్స్ సెంటర్ ప్రస్తుతం దుమ్ము కొట్టుకు పోయి ఉంది.

హాంబంటోటాలో క్రికెట్ స్టేడియం కూడా ఉంది. అక్కడ అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయి.

హాంబంటోటా సముద్ర తీరంలో చైనా పెద్ద నౌకాశ్రయాన్ని నిర్మించింది. తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యాన్ని అనుసంధానం చేసే ఎంతో కీలకమైన సముద్ర మార్గంలో ఇది ఉంది.

ఎల్‌టీటీ సివిల్ వార్ ముగిశాక ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు శ్రీలంక చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చాయి.

హాంబంటోటా విమానాశ్రయానికి కొద్ది నిమిషాల దూరంలో ఉన్నమత్తాలా విమానాశ్రయానికి రోజుకు ఒక విమానం మాత్రమే వస్తుంది. మిగతా సమయమంతా అక్కడి ఉద్యోగులు ఖాళీగా కూర్చుంటారు.

శ్రీలంకలో పెరుగుతున్న చైనా పెట్టుబడులతో భారత్‌ ఆందోళన చెందుతోంది. దీంతో భారత్‌ను శాంతపర్చేందుకు శ్రీలంక నష్టాల్లో ఉన్నమత్తాలా విమానాశ్రయ నిర్వహణను భారత్‌కు ఇవ్వాలని నిర్ణయించింది.

"మత్తాలా విమానాశ్రయ నిర్వహణను భారత్‌కు ఇవ్వాలనుకుంటున్నాం" అని శ్రీలంక ఆరోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ రాజిత సేనరత్నతెలిపారు.

భారత్, చైనాలతో మంచి సంబంధాలను కలిగి ఉండటం శ్రీలంకకు ఎంతో ముఖ్యం.

"ప్రతి ఏడాదీ చైనా మాకు రూ.వేల కోట్లు ఇస్తోంది. అభివృద్ధి పనుల కోసం సులభ రుణాలను భారత్ మంజూరు చేస్తోంది. అయితే చైనా ఇచ్చినంతగా భారత్ భారీ రుణాలు ఇవ్వదు" అని సేనరత్న చెబుతున్నారు.

అయితే భారత్‌తో మంచి సంబంధాలు లేకపోతే శ్రీలంక మనుగడ సాగించలేదనే విషయం వారికి బాగా తెలుసు.

భారత్ సంస్థలతో పోలిస్తే చైనా కంపెనీల వద్ద పెట్టుబడులు పెట్టేందుకు భారీ నిధులున్నాయి. శ్రీలంక ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతూ ఉంది.

'చైనా ఆధునిక వలసవాదం'

'ఒన్ బెల్ట్ - ఒన్ రోడ్' అనేది చైనా నినాదం. సాధ్యమైనంతగా ఇతర దేశాలతో తమ వ్యాపార సంబంధాలను పెంచుకోవడమే దీని పరమార్థం.

ఇతర దేశాలకు చైనా రుణాలు ఇస్తున్న తీరును చూసినా, అధిక వడ్డీ రేట్లను గమనించినా ఇది ఆధునిక వలస వాదంగా కనిపిస్తుంది. అంటే పరోక్షంగా ఒక దేశాన్ని తమ అధీనంలో ఉంచుకోవడం.

చైనా రుణాలతో నిర్మించిన పోర్టులు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి. దీంతో రుణాలు తీర్చలేని పరిస్థితుల్లో శ్రీలంక ఆ పోర్టులను చైనాకే లీజుగా ఇస్తోంది.

"హాంబంటోటా నౌకాశ్రయానికి సంబంధించి ఏడాదికి రూ. 920 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2020 నుంచి ఇది రూ.1520 కోట్లకు పెరుగుతుంది. దీన్నుంచి మాకు లాభాలు రావడం లేదు. అందువల్ల దీని నిర్వహణను ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నాం" అని సేన రత్న చెప్పారు.

చిత్రం శీర్షిక శ్రీలంక ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమని నమల్ రాజపక్ష అంటున్నారు

శ్రీలంకకు ఇచ్చే వాణిజ్య రుణాలపై చైనా అయిదు శాతం కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేస్తోంది.

మహీంద్ర రాజపక్సె అధ్యక్షునిగా ఉన్నకాలంలో శ్రీలంకలో చైనా చాలా ప్రాజెక్టులు చేపట్టింది.

"మా విధానం ఒకటే. శ్రీలంక ప్రజల ప్రయోజనాలకే మా తొలి ప్రాధాన్యం. ఇదే సమయంలో చైనాను గౌరవిస్తాం." అని నమల్ రాజపక్సె చెబుతున్నారు. ఆయన మహీంద్ర రాజపక్సె కుమారుడు. ప్రస్తుతం అక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.

'నాణేనికి ఆ వైపు'

చైనాతో జరిపి వాణిజ్య సంబంధాల్లో నియమాలు పాటించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. "శ్రీలంకతో చైనా వాణిజ్యం విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం నిబంధనలు పట్టించుకోకుండా అనుమతులు జారీ చేయడమే. అందువల్ల వ్యయాలు పెరుగుతున్నాయి" అని ఆర్థిక విశ్లేషకుడు నిశాన్ దా మిల్ ఆరోపిస్తున్నారు.

Image copyright Empics
చిత్రం శీర్షిక శ్రీలంక నిబంధనలు పాటించకుండానే చైనాకు అనుమతులు ఇస్తోందని నిశాన్ ఆరోపిస్తున్నారు

అయితే ఎన్నో కారణాల దృష్ట్యా శ్రీలంక ప్రజలు భారత్‌ను అనుమానాస్పదంగా చూస్తున్నారు.

"తమ అంతర్గత వ్యవహారాల్లో భారత్, అమెరికా జోక్యం చేసుకుంటున్నాయని శ్రీలంక ప్రజలు భావిస్తున్నారు. చైనా విషయంలో ఇటువంటి భావనేమి వారి మదిలో లేదు. అయితే తమ ఆస్తులను ఇతర దేశాలకు కట్టబెట్టడంపై వారు ఆందోళన పడుతున్నారు" అని నిశాన్ వెల్లడించారు.

చైనా మాత్రం ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఇక భారత అధికారులు వెంటనే చేయాల్సింది అందులోని మంచి చెడులను బేరీజు వేసుకోవడమే. ట

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)