రోజా: శివగామి పాత్రకు న్యాయం చేయలేను

  • 19 అక్టోబర్ 2017
రోజా, సినిమాలు, బీబీసీ తెలుగు, దీపావళి, ప్రభాస్, మహేశ్ Image copyright FACEBOOK/ROJA
చిత్రం శీర్షిక పిల్లలకు నా చేతితో తినిపిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది

రోజా అందమైన నటీమణే కాదు. ధైర్యం కలగిన రాజకీయ నాయకురాలు కూడా.

ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రజా ప్రతినిధిగా తలమునకలై ఉండే ఆమె దీపావళి రోజున సరదాగా బీబీసీ తెలుగుతో ముచ్చటించారు.

బాహుబలి నుంచి రాజుగారి గది-2 వరకు ఎన్నో విషయాలు మా ప్రతినిధి బళ్ల సతీశ్‌తో ఆమె పంచుకున్నారు. ఆ విశేషాలు రోజా మాటల్లోనే..

నా చేతిలో ఏదో మాయ ఉంది

నేను పెద్దగా వంట చేయను కానీ కేసరి మాత్రం చాలా బాగా చేస్తాను. నేను చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నిజంగా. బహుశా నా చేతిలో ఏదో మాయ ఉందనుకుంటా. ఒకవైపు షూటింగ్‌లు, మరోవైపు రాజకీయాల వల్ల వంట చేయడానికి అసలు వీలు చిక్కడం లేదు. వెజిటేరియన్ కంటే నాన్-వెజ్ బాగా చేస్తాను. స్వీట్ల విషయానికి వస్తే కజ్జికాయలు వంటి సంప్రదాయ వంటకాలు చేయగలను.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇంటర్వ్యూ: ఎమ్మెల్యే రోజాతో దీపావళి స్పెషల్

ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం

ఎప్పుడైన తీరిక దొరికితే నేనే స్వయంగా వండి, నా చేతితో పిల్లలకు వండి పెడతాను. అది చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారు.

రమ్యకృష్ణలా నేను చేయలేను

బాహుబలిలో శివగామి పాత్ర రమ్యకృష్ణకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది. ఇంతకు ముందు రమ్య పేరు చెబితే నరసింహా సినిమాలో నీలాంబరి పాత్ర గుర్తుకు వచ్చేది. ఇప్పుడు శివగామి దాన్ని మించి పోయింది. నా స్నేహితులు నేను చేస్తే బాగుండేది అన్నారు. కానీ శివగామి పాత్రకి రమ్యకృష్ణనే కరెక్ట్. నేను దానికి న్యాయం చేయలేను. రానా, ప్రభాస్‌కు నేను తల్లిగా నటిస్తే తేలిపోతాను. ఎందుకంటే ఆ పాత్రలోని గాంభీర్యం అటువంటిది.

సమంత ఏడ్పించింది

నాలాగే మా అబ్బాయికి సినిమాలా పిచ్చి. ఏ సినిమా విడుదలైనా మేం చూడాల్సిందే. క్షణం తీరిక లేకుండా గడిపే నేను సినిమాలతోనే కాస్త సేద తీరుతాను. సినిమా చూసేటప్పుడు నేను కూడా అందరిలాగే ఎమోషన్స్‌కు లోనవుతుంటాను. నవ్వుతాను. ఏడుస్తాను. ఈ మధ్య రాజుగారి గది-2 సినిమాలో సమంత పాత్ర చాలా ఏడుపు తెప్పించింది. బోరున ఏడుస్తుంటే మా అమ్మాయి చాలా భయపడింది.

Image copyright FACEBOOK/ROJA

అరుంధతి లాంటి పాత్ర చేయాలనుంది

అరుంధతి లాంటి పాత్రలు అంటే నాకు ఇష్టం. ఆ సినిమాలో అనుష్క నటన అద్భుతం. అయ్యో! నేను హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో ఇలాంటి కథ రాలేదే అని చాలా బాధపడ్డాను.

మహేశ్ అంటే చాలా ఇష్టం

ఇప్పుడున్న హీరోలలో మహేశ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ నటన, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ నచ్చుతాయి. అల్లు అర్జున్ స్టైల్ బాగుంటుంది. చిన్న సినిమాలైనా.. నాని, శర్వానంద్ ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. వారి సినిమాలు అన్నీ చూస్తాను. ఇప్పుడు సినిమా బాగా ఆడితే వారే పెద్ద హీరో. అంతే కానీ పెద్ద, చిన్నా అనే హీరోలు ఇప్పుడు లేరు. కథే హీరో.

అవకాశాలు వస్తున్నాయి

దాదాపు 26 ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నాను. ఇది నా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడుకూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ పిల్లల కోసం ఒప్పుకోవడం లేదు.

చిత్రం శీర్షిక నాలాగే మా అబ్బాయికి కూడా సినిమాల పిచ్చి

అనుకోకుండా వచ్చాను

రాజకీయాల్లోకి కావాలని రాలేదు. మా ఆయన ప్రోద్బలంతో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. తొలి రెండు సార్లు ఓడి పోవడం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.

అప్పుడే కదా న్యాయం జరిగేది

చాలా మంది నేను చాటా గట్టిగా మాట్లాడతాను అంటారు. అప్పుడే కదా ప్రజలకు న్యాయం చేయగలం. మెత్తగా ఉంటే మహిళల మాట ఎవరు పట్టించుకుంటారు.

అప్పుడే మన మాట వింటారు

భార్యకు వంట బాగా వస్తే ఆ కుటుంబం అంతా ఆమె చెప్పినట్లే వింటారు. (నవ్వుతూ..) నిజంగా.. నేను చాలా మందిని చూశాను. భర్త, పిల్లలు వారి మాట జవదాటరు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు