2015లో వాయు కాలుష్యంతో 25 లక్షల మంది మృతి

ఆయువు తీస్తున్న వాయువు

ఫొటో సోర్స్, Getty Images

2015లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 90 లక్షల మరణాలు కాలుష్యం ఫలితంగా జరిగినవేనని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు వాయు కాలుష్యానికి బలవుతున్నారని అర్థం.

పేద, మధ్య స్థాయి ఆదాయాలు గల దేశాల్లోనే కాలుష్యం ఎక్కువ మందిని బలిగొంటోందని ఈ నివేదిక తెలిపింది.

వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, సోమాలియా అగ్రస్థానంలో ఉన్నాయి. వీటికి భిన్నంగా బ్రూనై, స్వీడన్‌లో గాలి కాస్త స్వచ్ఛంగా ఉందని లాన్సెట్ నివేదిక తెలిపింది. వాయు కాలుష్యంలో ఈ దేశాలు చిట్టచివరన ఉన్నాయి.

కాలుష్యం వల్ల మరణిస్తున్న వారిలో రెంటింట మూడొంతులు వాయు కాలుష్యం వల్లే చనిపోతున్నారు. కలుషిత గాలి పీల్చడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి.

మానవాళి మనుగడకు వాతావరణ మార్పుల కంటే వాయు కాలుష్యమే పెను సవాలు విసురుతోందని న్యూయార్క్‌లోని ఇకాహ్న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫ్రొఫెసర్ ఫిలిప్ లాండిగ్గాన్ అన్నారు.

వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 60లక్షల మంది అర్ధాంతరంగా చనిపోతున్నారు.

కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 18లక్షల మంది మరణిస్తున్నారు.

వాయు కాలుష్య మరణాల్లో ఐదో స్థానంలో భారత్

కాలుష్యం కారణంగా పేద దేశాల్లోనే 92 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వాయు కాలుష్య మరణాల్లోనూ ముందే ఉంది. 188 దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. 2015లో భారతదేశంలో 25 లక్షల మంది కాలుష్యం మూలంగా చనిపోయినట్లు లాన్సెట్ నివేదిక తేల్చింది.

భారత్‌కంటే చైనా మెరుగైన స్థితిలో ఉంది. ఈ జాబితాలో డ్రాగన్ దేశానిది 16వ స్థానం.

బ్రిటన్‌లో వాయు కాలుష్యం కారణంగా ఏటా 50 వేల మంది చనిపోతున్నారని అంచనా. ఈ జాబితాలో బ్రిటన్‌ 55వ స్థానంలో ఉంది. అమెరికా, యూరప్ దేశాల కంటే బ్రిటన్‌లో ఎక్కువ వాయు కాలుష్యం ఉంది.

వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరిందని బ్రిటిష్ లంగ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ పెన్నీ వుడ్స్ చెప్పారు. అమెరికా, పశ్చిమ యూరప్‌ దేశాల కంటే బ్రిటన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన తెలిపారు.

డీజిల్ వాహనాల వినియోగం, విష వాయువుల వల్ల గాలి కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. ఫలితంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయి.

అమెరికాలో కాలుష్యం వల్ల ఏటా 1,55,000 మంది చనిపోతున్నారు. పేద దేశాల్లో మాదిరిగానే అమెరికాలోని పేదలు కాలుష్యం బారిన పడుతున్నారు.

'కాలుష్యం, పేదరికం, అనారోగ్యం, సామాజిక అసమానతలు అవిభక్త కవలల' వంటివని పెరూ ఎర్త్‌ సంస్థకు చెందిన రచయిత కార్తీ శాండిల్యా అన్నారు.

జీవించే హక్కును కాలుష్య భూతం హరించి వేస్తోంది. చిన్నారులు, వయో వృద్ధులు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.

భవిష్యత్‌లో ఈ పరిస్థితి మరింత విషమిస్తుందని అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు మరింత ముమ్మరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)