జపాన్ ఎన్నికలు: మళ్లీ షింజేకే పట్టం అంటున్న సర్వేలు

షింజో అబే
ఫొటో క్యాప్షన్,

జపాన్ స్వీయ రక్షణ సైనిక విధానాన్ని రాజ్యాంగంలో సవరణ ద్వారా అంతర్జాతీయంగా మోహరించేందుకు వీలు కల్పించాలని షింజో ప్రయత్నిస్తున్నారు

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన ప్రభుత్వ పదవీ కాలం ముగియడానికి ఇంకా ఏడాది సమయమున్నా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సెప్టెంబర్ నెలలో నిర్ణయించారు. ఆదివారం తుపాను వర్షాల మధ్య ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

జపాన్ ఎదుర్కొంటున్న 'జాతీయ సంక్షోభాన్ని' పరిష్కరించడానికి తనకు ప్రజల నుంచి తాజా తీర్పు కావాలంటూ సెప్టెంబర్ 25వ తేదీన షింజో ఈ మధ్యంతర ఎన్నికలను ప్రకటించారు. ఉత్తర కొరియా నుంచి పొంచివున్న దాడి ప్రమాదాన్ని ఆయన సీరియస్‌గా పరిగణిస్తున్నారు. జపాన్‌ను సముద్రంలో 'ముంచేస్తా'నని హెచ్చరించిన ఉత్తర కొరియా.. జపాన్‌కు చెందిన హొక్కాయిడో దీవి మీదుగా రెండు క్షిపణులను కూడా ప్రయోగించింది.

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా నుంచి జపాన్‌కి దాడి ప్రమాదం పొంచివుందని షింజో భావిస్తున్నారు

ప్రధాన ప్రతిపక్షం అంతర్గత కుమ్ములాటలతో కకావికలమైన పరిస్థితుల్లో.. ''షింజోకి చెందిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేయడం మినహా ప్రత్యామ్నాయం లేద''ని ఒక పరిశీలకుడు బీబీసీతో పేర్కొన్నారు.

2006లో కొద్ది కాలం పాటు ప్రధానిగా పనిచేసిన షింజో 2012 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో కూడా గెలిస్తే యుద్ధానంతర జపాన్ చరిత్రలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు సృష్టించేందుకు ఆయనకు అవకాశం లభిస్తుంది.

ఫొటో క్యాప్షన్,

తుఫానులో పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి జపాన్ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు

ఎందుకు మధ్యంతర ఎన్నికలు?

 • ఈ ఏడాది ఆరంభంలో పలు కుంభకోణాలు, ఆరోపణల నేపథ్యంలో ప్రధాని షింజో ప్రజాదరణ రికార్డు స్థాయిలో పడిపోయిందని సర్వేలు పేర్కొన్నాయి. ఇందులో ఆయన అనుసరిస్తున్న పలు విధానాల ప్రభావం కూడా ఉందని చెప్తున్నారు.
 • తన మిత్రుడొకరు ప్రైవేటు యూనివర్సిటీ స్థాపించడానికి షింజో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన తిరస్కరించారు. అలాగే ప్రభుత్వ భూమిని కారు చౌకగా అమ్మేసిన ఒక అతివాద జాతీయవాద స్కూలుతో షింజేకు సంబంధాలున్నాయనీ ఆరోపణలు వచ్చాయి. వీటినీ ఆయన ఖండించారు.
 • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ సైనిక విధానం స్వీయ రక్షణ విధానంగా మారింది. దీనిని జాతీయ సైన్యంగా మార్చి, రాజ్యాంగం ద్వారా గుర్తించాలని షింజో ప్రయత్నించారు. దీనిపట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.
 • జపాన్‌ను మళ్లీ అణ్వస్త్ర శక్తిగా మార్చాలని షింజో భావిస్తున్నారు. అయితే ఫుకుషిమా అణుకేంద్రం ప్రమాదం అనంతరం ఈ అణు విధానం మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. షింజో ప్రవేశపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక చట్టం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
 • ఈ పరిణామాల నేపథ్యంలో జూలై నెలలో షింజో ప్రజాదరణ 30 శాతానికి పడిపోయింది. దీంతో సొంత పార్టీలోనూ షింజో మీద ఒత్తిడులు పెరిగాయి. అయితే సెప్టెంబర్‌లో షింజో ప్రజాదరణ పుంజుకుని 50 శాతానికి పెరిగింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం అంతర్గత కలహాలతో కకావికలమైంది.
 • ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకుని ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో షింజో మధ్యంతర ఎన్నికలను ప్రకటించారన్నది పరిశీలకుల విశ్లేషణ. మంచి మెజారిటీతో విజయం సాధిస్తే ఇంటా బయటా విమర్శకుల నోరు మూతపడుతుందని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు.
ఫొటో క్యాప్షన్,

ప్రధాని షింజోకి టోక్యో గవర్నర్ యూరికో కోయికె నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది

ఎన్నికల బరిలో ఎవరున్నారు?

 • అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి చెందిన షింజో అబే మూడోసారి ప్రధాని కావడం కోసం పోటీ చేస్తున్నారు.
 • సంప్రదాయంగా ఎల్‌డీపీకి ప్రధాన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీగా ఉండేది. కానీ ఆ పార్టీలో గత జూలైలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. సెప్టెంబర్ చివరి నాటికి అది కకావికలమైంది.
 • ఆ పార్టీ మాజీ నాయకులు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగానో, ఇతర చిన్న పార్టీల తరఫునో పోటీ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఈ నెల ఆరంభంలో స్థాపితమైన కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీపీజే) ముఖ్యమైనది.
 • షింజో మాజీ పార్టీ సహచరి, మాజీ మంత్రివర్గ సభ్యురాలు అయిన ప్రస్తుత టోక్యో గవర్నర్ యూరికో కోయికె నుండి షింజో కొత్త సవాలును ఎదుర్కొంటున్నారు. ఆమె గత నెలలో 'పార్టీ ఆఫ్ హోప్' పేరుతో ఒక జాతీయ పార్టీని స్థాపించారు.
 • యూరికోకి మొదట ప్రజల నుంచి బలమైన మద్దతు లభించినప్పటికీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం లేనందున తను స్వయంగా పోటీ చేయకూడదని ఆమె నిర్ణయించుకోవడంతో ఆ మద్దతు బలహీనపడినట్లు చెప్తున్నారు.
 • షింజో పార్టీ, యూరికో పార్టీ ఎన్నికల హామీల్లో పెద్దగా తేడాలేదు. అయితే అమ్మకం పన్ను పెంచాలన్న ప్రణాళికను నిలిపివేస్తామని, అణుశక్తి నుంచి 2030 నాటికి వైదొలగుతామని యూరికో పార్టీ హామీ ఇస్తోంది.
 • యూరికో కోయికె భవిష్యత్తులో ఎల్‌డీపీకి గట్టి సవాలు విసురుతుందని, తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూరికో పోటీ చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.
ఫొటో క్యాప్షన్,

ఈ ఎన్నికల్లో గెలిస్తే యుద్ధానంతర జపాన్‌లో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడుగా షింజో చరిత్ర సృష్టించగలరు

సర్వేలు ఏం చెప్తున్నాయి?

 • ఎన్నికల పోరులో షింజే ముందంజలో ఉన్నట్లు గత వారం సర్వే ఫలితాలు చెప్తున్నాయి. మొత్తం 465 సీట్లు ఉన్న దిగువసభలో షింజే ఎల్‌డీపీకి సుమారు 300 సీట్లు వస్తాయని సర్వేల అంచనా.
 • షింజో మిత్ర పక్షాలు, సంకీర్ణ భాగస్వాములు అయిన కొమియిటో మరో 30కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుండటంతో తర్వాతి ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ లభించే అవకాశముందని సర్వేలు చెప్తున్నాయి.
 • రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి నేపథ్యంలో జపాన్ సైన్యం స్వీయ రక్షణ విషయంలో మినహా.. అంతర్జాతీయ సంఘర్షణల పరిష్కారం కోసం బలప్రయోగం చేయరాదని ఆ దేశ రాజ్యాంగం నిషేధిస్తోంది.
 • అయితే తన మిత్రపక్షాలతో పాటు జపాన్ సైనిక బలగాలను కూడా అంతర్జాతీయ ఆపరేషన్లలో ప్రపంచ వ్యాప్తంగా మోహరించేందుకు వీలు కల్పించేలా రాజ్యాంగాన్ని మార్చాలని షింజో భావిస్తున్నారు. అలా రాజ్యాంగాన్ని సవరించాలంటే ప్రభుత్వానికి డయట్ (జపాన్ పార్లమెంటు) దిగువసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.
 • యూరికో కొయికె కొత్త పార్టీ 'పార్టీ ఆఫ్ హోప్' 50 సీట్లు గెలుచుకుని.. సుదూరంలోనే అయినా రెండో స్థానంలో నిలుస్తుందని సర్వేల అంచనా.
 • అయితే ఈ సర్వేలు ఎల్లవేళలా విశ్వసనీయమైనవి కావని పరిశీలకులు చెప్తున్నారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం చాలా రిస్కులతో కూడుకుని ఉంటుందని అంటున్నారు. బ్రిటన్‌లో ప్రధానమంత్రి థెరెసా మే ఇదే తరహా వ్యూహంతో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి మెజారిటీని కోల్పోవడం, అధికారంలో కొనసాగేందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)