తిరిగి వెళుతున్న ఐఎస్ తీవ్రవాదులతో ప్రపంచానికి ముప్పెంత?

ధ్వంసమైన నగరం

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు మూడేళ్లుగా ఇస్లామిక్ స్టేట్‌ (ఐఎస్)కు ఆయువు పట్టుగా ఉన్న రఖ్ఖా ప్రాంతంపై ఐఎస్ క్రమంగా పట్టును కోల్పోతోంది. సంకీర్ణ దళాల దాడులతో ఇరాక్, సిరియాలలో అది పతనం అంచులకు చేరుకుంటోంది.

ఐఎస్ పోరాటాలలో క్రియాశీలకంగా ఉన్నది విదేశాల నుంచి వచ్చిన వారే. ఐఎస్ కోట కూలిపోతున్నతరుణంలో వీరంతా ఎక్కడికి పోతున్నారు? భవిష్యత్తులో వారు ఏం చేయనున్నారు? డాక్టర్ లొరెంజో విదినో ఈ అంశాలను విశ్లేషిస్తున్నారు.

వారు ఎక్కడ ఉన్నారు?

ఇరాక్, సిరియాలలో క్రమంగా కనుమరుగైపోతున్న ఐఎస్ ప్రపంచ భద్రతకు పెను సవాలును విసురుతోంది.

ఐఎస్‌లో దాదాపు 30,000 మంది విదేశీయులు చేరారు. వీరు ఇప్పుడు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఐఎస్ ఖలీఫా రాజ్యాన్నికూల్చి వేసినందుకు చాలా మంది ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయి. ఊహించడం కష్టం అయినప్పటికీ ప్రపంచ భద్రతపై ఇది ఎంతో ప్రభావం చూపుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్,

గత మే నుంచి ఫిలిప్పీన్స్‌లోని మారావి‌లో కొంత ప్రాంతం ఐఎస్‌తో అనుబంధం కలిగిన వ్యక్తుల అధీనంలో ఉంది.

మరణ శిక్షకు చేరువగా

ఐఎస్‌ కోసం పని చేస్తున్న విదేశీయులు ఇంకా కొంత మంది ఇరాక్, సిరియాలలోనే ఉన్నట్లు అమెరికా కౌంటర్ టెర్రరిజం అధికారులు అంచనా వేస్తున్నారు.

"బ్రిటన్ పౌరులు 800 మంది ఐఎస్‌లో చేరారు. వీరిలో కొద్ది మంది మాత్రమే తిరిగి స్వదేశానికి వెళ్లారు. మరో 130 మంది దాడుల్లో చనిపోయారు." అని బ్రిటన్ భద్రతా సంస్థ ఎంఐ5 అధిపతి చెప్పారు.

ఇరాక్, సిరియాలలో ఉండి పోయిన విదేశీ ఉగ్రవాదులు ఐస్‌తోనే ముందుకు నడిచే అవకాశం ఉంది.

మోసుల్, రఖ్ఖా పోరాటాలలో విదేశీ ఉగ్రవాదులే క్రియాశీలక పాత్ర పోషించారు. వీరిలో చాలా మంది తమ సొంత దేశాలకు తలవంపులు తెస్తూ ఇప్పుడు ఇరాక్ కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరికి మరణ శిక్ష కూడా పడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గతంలో ఐఎస్‌కు పని చేసిన వారు పారిస్‌లో దాడులకు పాల్పడ్డారు

టర్కీలో మద్దతుదార్లు

టర్కీ, సిరియా మధ్య ఉన్న 822 కిలోమీటర్ల సరిహద్దు గుండా చాలా మంది విదేశీ ఉగ్రవాదులు సురక్షితంగా బయపడుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడ టర్కీ బలగాలు గస్తీ మరింత పెంచాయి. అయితే వారి కన్నుకప్పి తప్పించుకునేందుకు పర్వత సానువులు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

టర్కీలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదార్లు చాలా మంది ఉన్నారు. ఉగ్రవాదులు సిరియా నుంచి బయటపడేందుకు వీరు ఎంతో సహాయపడుతున్నారు.

టర్కీని ఈ విషయం ఎంతో ఆందోళనకు గురి చేస్తోంది. ఇరుగు పొరుగు దేశాలైన జోర్డాన్, లెబనాన్‌లది కూడా ఇదే పరిస్థితి.

ఫొటో సోర్స్, Getty Images

స్థానిక ఉగ్రవాద సంస్థలు బలోపేతం?

సిరియా నుంచి యెమెన్, సినాయ్ పెనిన్సులా, నార్త్ కాకసస్, తూర్పు ఆసియా వంటి ప్రాంతాల్లో ఐఎస్ ఏర్పాటు చేసిన ప్రావిన్స్‌లకు వెళ్తున్నట్లు రుజువులు కనిపిస్తున్నాయి.

లిబియాలో ఇలాంటి వారు దాదాపు 6,500 మంది ఉన్నట్లు అమెరికా బలగాల అంచనా. అఫ్ఘనిస్తాన్‌లో వందల్లో ఉన్నారని తమ దాడుల్లో కనీసం 94 మంది చనిపోయినట్లు అమెరికా వెల్లడించింది.

కాంగో, మయన్మార్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వలస పోతున్న సంఘటనలూ ఉన్నాయి.

వీరు తిరిగి రావడం ఆయా దేశాల్లోని స్థానిక ఉగ్రవాద సంస్థలకు ఎంతో బలాన్ని చేకూర్చుతుంది.

ఫొటో సోర్స్, GettyImages

ఈ దేశాలకు పెను ముప్పు

స్వదేశాలకు తిరిగి వస్తున్న వారిలో కొంత మంది మిలిటెంట్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు రహస్యంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను అవకాశంగా తీసుకొని విధ్వంసానికి పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉత్తర ఆఫ్రికా దేశాలకు ప్రధానంగా ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఒక్క ట్యూనీషియా నుంచే దాదాపు 6,000 మంది ఐఎస్‌లో చేరారు.

అరబ్ దేశాలు, రష్యా, కాకసస్, మధ్య ఆసియా వంటి ప్రాంతాలదీ ఇదే పరిస్థితి.

ఐఎస్‌లోదాదాపు 6,000 మంది యూరప్ నుంచి ఉన్నట్లు అంచనా. వీరిలో కొందరు వెనక్కి వస్తున్నట్లు యూరప్ అధికారులు చెబుతున్నారు.

న్యాయపరమైన చిక్కులు

తిరిగి వస్తున్న ఐఎస్ ఉగ్రవాదులను గుర్తించేందుకు టర్కీ‌తో కలిసి యూరప్ అధికారులు పని చేస్తున్నారు.

కొందరు యూరప్‌లోకి శరణార్థులుగా అక్రమంగా ప్రవేశిస్తున్నారు. మరి కొందరు గతంలో తాము కలిగి ఉన్న యూరప్ పాస్ పోర్ట్‌తోనే అధికారింగా వస్తున్నారు.

గత ఏడాదిలో దాదాపు 400 మంది వచ్చినట్లు బ్రిటన్ హోం శాఖ తెలిపింది. అయితే వీరిలో 54 మంది మాత్రమే దోషులుగా తేలారు.

వీరిని గుర్తించడం, అరెస్టు చేయడంలో అధికారులకు న్యాయపరమైన చిక్కులున్నాయి.

వీరిలో చాలా మంది ఐఎస్ తొలినాళ్లలో అందులో చేరారు. అప్పటికి ఇంకా అది ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందలేదు. అందువల్ల ఇందుకు సంబంధించి యూరప్ దేశాలు ఎటువంటి చట్టాలు చేయలేదు.

ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పటికీ నాడు ఐఎస్‌లో చేరినవారికి ఈ చట్టాలు వర్తించవు. అంతే కాక అక్కడ జన్మించిన వారి పిల్లల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GettyImages

పునరావాస కేంద్రాలు

ఐఎస్ కోసం పని చేసి తిరిగి వచ్చిన వారిని తిరిగి జనజీవన స్రవంతిలో చేర్చేందుకు డెన్మార్క్ పునరావాసం కల్పిస్తోంది.

ఇటువంటి 12 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఫ్రాన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

భవిష్యత్తు ఏమిటి?

తన అధీనంలోని చాలా ప్రాంతాలను కోల్పోయినంత మాత్రాన ఐఎస్ అంతరించి పోతుందని అనుకోలేం. తనకు ఉన్నవిస్తృతమైన నెట్‌వర్క్ ఏదో ఒక రూపంలో పని చేస్తూనే ఉంటుంది.

ఐఎస్ ఖలీఫా సామ్రాజ్య పతనం ఒక అధ్యయానికి ముగింపు పలుకుతుంది. ఇదే సమయంలో మరో కొత్త అధ్యయానికి తెర తీస్తుంది.

(గమనిక: బీబీసీ అందిస్తున్న ఈ కథనంలో విశ్లేషణలు డాక్టర్ లొరెంజో విదినోవి. ఆయన జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో తీవ్రవాద కార్యకలాపాలపై అధ్యయనం చేసే ఒక ప్రోగ్రామ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. డంకన్ వాకర్ ఈ కథనాన్ని ఎడిట్ చేశారు.)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)