గుజరాత్‌ ఎన్నికల ప్రకటనలో జాప్యంపై సీఈసీ వివరణ

  • 24 అక్టోబర్ 2017
వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షిస్తున్న భద్రతా దళాలు Image copyright Getty Images

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ తేదీని ప్రకటించింది. కానీ గుజరాత్‌లో ఎన్నికల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ అంశం ఇప్పుడు వివాదంగా మారింది.

గుజరాత్‌ ఎన్నికల తేదీని ప్రకటించక పోవడం ద్వారా నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీ (భాజపా)కి ఎన్నికల సంఘం మేలు చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇదే విషయంపై భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అచల్ కుమార్ జోతి బీబీసీ గుజరాతీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

గుజరాత్ ఎన్నికల తేదీని ఇంకా వెల్లడించలేదు కదా. తద్వారా భాజపా ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సహకరిస్తోందా?

ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ స్వతంత్రంగా నడుస్తుంది. గుజరాత్‌లో వరదలు వచ్చాయి. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పునరావాస పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల తేదీని ప్రకటిస్తే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది కాబట్టి ఆ పనులకు ఆటంకం కలుగుతుంది. అందువల్లే తేదీలు ప్రకటించలేదు.

Image copyright Getty Images

పునరావాస పనులకు ఇబ్బంది కలుగుతుందని మీరెందుకు అనుకుంటున్నారు?

ఇందుకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. సెప్టెంబరు 27న ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. ఉత్తర గుజరాత్‌లో 45 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే ఇక్కడ పునరావాస పనులకు తీవ్ర అవరోధం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నాం.

అంతే కాకుండా, దీపావళిని గుజరాతీయులు ఎంత ఘనంగా జరుపుకొంటారో తెలుసు. అందువల్ల పండుగలు అయిపోయిన తరువాత ఎన్నికల తేదీని ప్రకటించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం.

సాధారణంగా నిబంధనల ప్రకారం పోలింగ్ తేదీకి 21 రోజుల ముందు ఎన్నికల తేదీని ప్రకటించేందుకు అవకాశం ఉంది. కానీ 2012లో 60 రోజుల ముందే ఎన్నికల తేదీని ప్రకటించింది. దీంతో చాలా రోజుల పాటు ఎన్నికల నియమావళి అమల్లో ఉండాల్సి వచ్చింది.

ఈ నిర్ణయం నరేంద్ర మోదీకి, భాజపా ప్రభుత్వానికి లబ్ధి చేకూరుస్తుందని మీరు భావించడం లేదా?

మోదీనే కాదు రాహుల్ గాంధీ కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల తేదీని వెల్లడించిన తరువాత కూడా ఎవరైనా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనచ్చు.

Image copyright Election Commission of India
చిత్రం శీర్షిక ఏకే జ్యోతి గతంలో గుజరాత్ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు

ఈ విషయంలో మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?

గుజరాత్‌లో ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు 26,000 మంది సిబ్బంది కావాలి. ఇంత మందిని ఎన్నికల కోసం కేటాయిస్తే వరద బాధితుల పునరావాస పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆయా రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఒకేసారి ప్రకటించాల్సిన అవసరం మాకు లేదు.

Image copyright ECI

మీరు గుజరాత్ ప్రభుత్వం నుంచి ప్రయోజనాన్ని ఆశించినట్లు 'ది వైర్' కథనాన్ని రాసింది. ఇందులో సత్యమెంత?

ఆ కథనంలో వాస్తవం లేదు. గుజరాత్ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన రోజుల్లో నాకు ప్రభుత్వం ఒక ఇంటిని కేటాయించింది. ఆ తరువాత నేను ఎన్నికల కమిషనర్‌గా వెళ్లాను. అయితే భారత ప్రభుత్వం నాకు ఎటువంటి అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేయలేదు.

అందువల్ల కేంద్రం బసను ఏర్పాటు చేసే వరకు ఆ ఇంటిలోనే కొనసాగేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని కోరాను. అంతే తప్ప ఇందులో ప్రయోజనం ఆశించి చేసింది ఏమీ లేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు