జిహాద్: ఓ బాలుడి పేరుపై ఫ్రాన్స్‌లో అయోమయం

  • 25 అక్టోబర్ 2017
చిన్నారి Image copyright AFP
చిత్రం శీర్షిక ఫ్రాన్స్‌లో గతంలో ఆమోదనీయమైన చిన్నారుల పేర్ల అధికారిక జాబితా ఉండేది

ఫ్రాన్స్‌లోని తొలూజ్ నగరంలో దంపతులు తమ కుమారుడికి జిహాద్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అధికారులు ఈ పేరు విషయాన్ని పరిశీలించాలని న్యాయస్థానానికి నివేదించారు.

ఈ పేరు ఆమోదనీయమా కాదా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఫ్రాన్స్ చీఫ్ ప్రాసిక్యూటర్ తల బద్దలు కొట్టుకుంటున్నారు.

కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ఫ్రాన్స్ న్యాయమూర్తి ఈ కేసులో తీర్పు ఇవ్వాల్సి రావచ్చు.

అరబిక్‌లో ‘జిహాద్’ అంటే ‘ప్రయత్నం’ లేదా ‘సంఘర్షణ‘ అని అర్థం. ‘పవిత్ర యుద్ధం’ అనే నిర్దిష్ట అర్థం లేదు.

నిజానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో ఫ్రాన్స్ చట్టాలు ఎలాంటి నియంత్రణలూ విధించవు. అయితే ఆ పేరు సదరు చిన్నారి ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉండకూడదు. అలాగే ఆ పేరుకు గల గౌరవమర్యాదల ప్రాతిపదికగా ఇతర కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉండకూడదు.

‘జిహాద్‘ అని పేరు పెట్టిన ఈ తొలూజ్ బాలుడు గత ఆగస్టులో జన్మించాడు. ఇంతకుముందు ఫ్రాన్స్‌లో ఇతర బాలురకు ఆ పేరు పెట్టుకోవడానికి అనుమతించారు కూడా.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫ్రాన్స్‌లో గత రెండేళ్లలో ఇస్లామిక్ తీవ్రవాదుల దాడుల్లో 230 మందికి పైగా ప్రజలు చనిపోయారు

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అని చెప్పుకుంటున్న సంస్థ పేరుతో ఉగ్రవాద దాడులకు పాల్పడే ఇస్లామిక్ తీవ్రవాదుల గురించి మాట్లాడేటపుడు వారిని ‘జిహాదిస్టులు’ అని సాధారణంగా అభివర్ణిస్తుంటారు.

2015 ఆరంభం నుంచి ఫ్రాన్స్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల దాడుల్లో 230 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఈ దాడుల ఫలితంగా దేశంలో అత్యవసర పరిస్థితి ఇంకా అమలులో ఉంది.

ఫ్రాన్స్‌లోని నిమ్ నగరంలో 2013లో ఒక తల్లి.. జిహాద్ అనే పేరున్న తన కుమారుడికి ‘ఐ యామ్ బాంబ్.. బోర్న్ ఆన్ సెప్టెంబర్ 11 (నేను బాంబుని.. సెప్టెంబర్ 11న పుట్టాను)’ అనే పదాలు ముద్రించివున్న టీ-షర్టును తొడిగి స్కూలుకి పంపినందుకు గాను.. ఆమెకు ఒక నెల జైలు శిక్షతో పాటు 2,000 యూరోల జరిమానా విధించారు. అయితే జైలు శిక్ష అమలును నిలిపివుంచారు.

ఆమెకు ఆ శిక్ష విధించింది.. అమెరికాపై 9/11 ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ ‘రెచ్చగొట్టే’ టీ-షర్టును తొడిగిపంపినందుకే తప్ప.. ఆమె కొడుకు పేరు ‘జిహాద్’ అయినందుకు కాదు.

ఇక 2015లో ఒక జంట తమ కుమార్తెకు ‘న్యుటెల్లా’ అని పేరు పెట్టకుండా ఒక ఫ్రాన్స్ కోర్టు అడ్డుకుంది. న్యుటెల్లా అంటే ఒక విధమైన అడవి చెట్టు గింజలతో చేసిన జామ్ లాంటి ఆహార పదార్థం. ఈ పేరు పెట్టడం వల్ల ఆ బాలిక నవ్వుల పాలవుతుందని కోర్టు అభ్యంతరం తెలిపింది. ఆ పేరుకు బదులుగా ఆ పాపను ఎల్లా అని పిలవాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)