మదర్ ఇండియా@60: కాలంతో మారుతున్న సినిమా తల్లి

  • పద్మ మీనాక్షి
  • బీబీసీ తెలుగు ప్రతినిధి

నర్గీస్, సునీల్ దత్, రాజ్ కుమార్ నటించిన మదర్ ఇండియా చిత్రం విడుదలై నేటికి 60 వసంతాలు. భూస్వామ్య వ్యవస్థ నుంచి అప్పుడప్పుడే బయటకు వస్తున్న భారతీయ సమాజంలో తల్లి పాత్రను ఈ హిందీ సినిమా సరికొత్తగా నిర్వచించింది.

అప్పటి వరకు సినిమాలు తల్లిని భర్త చాటు భార్యగా, పిల్లల ఆలనా పాలనా చూసుకునే పాత్రగా మలిచేవి. తప్పు చేసిన కొడుకుని హతమార్చడానికి సైతం వెనుకాడని ఒక స్వతంత్ర మాతృమూర్తిగా మదర్ ఇండియా తల్లి పాత్రను చిత్రించింది.

గ్రామ అభివృద్ధికి ప్రజలను ఉత్తేజపరిచిన ఒక అభ్యుదయవాదిగా నర్గీస్‌ని చిత్రించి దర్శకుడు మె‌హబూబ్ ఖాన్ చరిత్ర సృష్టించారు.

ఈ నేపథ్యంలో 60వ దశకం నుంచి వెండి తెరపై తల్లి పాత్ర చిత్రీకరణలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో సినీ రంగం, రచయితలు, సామాజిక కార్యకర్తలు, సినీ అభిమానుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్,

'మ‌ద‌ర్ ఇండియా' గురించి మీకు తెలియ‌ని ఐదు విశేషాలు

"ఒకప్పుడు తల్లి పాత్ర అంటే కథలు చెబుతూ, లాలి పాటలు పాడుతూ, ఇల్లాలిగా ఆలనా పాలనా చూసుకునే వరకే పరిమితం. నేడు కుటుంబ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించే స్థాయికి తల్లి పాత్ర చేరుకుంది. అలనాటి చిత్రాలలో తల్లి పాత్ర కేవలం గ్రూప్ ఫొటోలకే పరిమితం. కానీ నేటి సినిమాలలో అమ్మ పాత్రకు ప్రాముఖ్యం ఎంతో పెరిగింది. ఇందుకు 'అమ్మ రాజీనామా' సినిమానే నిదర్శనం" అని లఘు చిత్రాల దర్శకుడు మదాల వేణు బీబీసీతో చెప్పారు.

"కేవలం ఒక తల్లి తపనను, కష్టాన్ని, త్యాగాన్ని మాత్రమే చిత్రీకరించడానికి ఈ సినిమాను తీశారంటే తల్లి పాత్రకు ఇప్పుడు ఎంత పెద్దపీట వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బాక్స్ ఆఫీసును కొల్లగొట్టిన బాహుబలి కూడా బలమైన తల్లి పాత్ర శివగామి చుట్టూ తిరిగింది." అని ఆయనన్నారు.

మా ఇతర కథనాలు:

"ఒకప్పుడు ఒంటరి అమ్మ అంటే తెల్ల చీర కట్టుకుని కష్టాల కొలిమిలో మండి పోతున్నట్లు చూపించే వారు. ఈ అర్ధ శతాబ్దంలో ఎన్నో మార్పులు. ఇప్పుడు అమ్మలను కూడా చిన్నవాళ్లుగా చూపిస్తున్నారు. గతంలో అంజలీ దేవి, కన్నాంబ లాంటి సీనియర్ నటీమణులు వేసే పాత్రలను ఇప్పుడు జయసుధ, రోహిణి లాంటి మధ్య వయసు వాళ్ళు పోషిస్తున్నారు" అని బ్లాగర్ రచయిత లక్ష్మీ వసంత అన్నారు.

"అప్పటి అమ్మ పాత్రలు కుట్టు మెషిన్ మీద బట్టలు కుడుతూ పిల్లలను పెంచినట్లు చూపిస్తే, ఇప్పుడు అమ్మలు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ పిల్లలను పోషిస్తున్నట్లు చూపిస్తూ.. ఈ తరం అమ్మలకు ఆదర్శంగా నిలుస్తున్నారు" అని ఆమె అన్నారు.

పిల్లలతో అమ్మలు చనువుగా మాట్లాడుతూ, వారి లవ్ లైఫ్ గురించి తెలుసుకుని కౌన్సెలింగ్ చేసేంత మెచ్యూరిటీ ఉన్న అమ్మ పాత్రలను చూపించడం ఈ తరం ప్రత్యేకత అని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఒకప్పుడు అమ్మ పాత్రలు భర్త దయా దాక్షిణ్యాలు మీద ఆధార పడే దీనులుగా కన్నీరు మున్నీరుగా ఏడ్చే పాత్రలే ఉండేవి. కానీ నేటి సినిమాలలో ఇష్టం లేని కాపురం నుండి బయటకు వచ్చి ఒక్కరే ధైర్యంగా పిల్లలను పెంచే విధంగా తల్లి పాత్రను చూపిస్తున్నారు. 'అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రం లో జయసుధ తన కాళ్ళ మీద తాను నిలబడి కొడుకుని ఆదర్శంగా పెంచిన అమ్మపాత్రను చూపించి ఈ తరం స్త్రీలకు మంచి సందేశం అందించారు" అని లక్ష్మీ వసంత ఉదాహరించారు.

"అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి చిత్రంలో జయసుధ , కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో రమ్యకృష్ణ పాత్రలు బలమైన వ్యక్తిత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి. ఈ సినిమాలలో ఒక ఒంటరి మహిళ వ్యక్తిత్వాన్ని, సంఘర్షణను బాగా చూపించారు." అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో అసోసియేట్ ప్రొఫెసర్ జయశ్రీ నాయుడు భావిస్తున్నారు.

"తల్లి పాత్ర చిత్రీకరణలో మార్పులు వచ్చాయి కానీ, విలువలు కూడా బాగా మారాయి. స్త్రీ స్వతంత్ర్యాన్ని స్వేచ్ఛను చూపిస్తున్నారు కానీ హింస ప్రేరేపణ కూడా బాగా పెరిగింది. తన కొడుకును శత్రువులను హతమార్చే ఒక సాధనంగా తల్లి చూడటం సమాజానికి ఎటువంటి సందేశాన్నిఅందిస్తుందో అర్థం కావటం లేదు." అని స్కూల్ రేడియో వ్యవస్థాపకురాలు అరుణ గాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రంలో తల్లిగా నటించిన జయసుధకు విలన్లకు మధ్య సంభాషణను ఆమె ప్రస్తావిస్తున్నారు.

"సినిమాలో ఏ పాత్ర అయినా సమాజాన్ని పురోగమన దిశగా తీసుకెళ్లేలా ఉండాలి. అంతేకానీ సామాజిక విలువల పతనానికి దారి తీయ కూడదు." అని సూచించారు.

"బొమ్మరిల్లు సినిమాలో జయసుధ పాత్ర భర్తను ఎదిరించాల్సిన సమయంలో ఎదిరించే పాత్రగా చిత్రీంకరించడం ఒక మార్పు. బాహుబలిలో శివగామి పాత్ర తల్లి పాత్రకి తలమానికంగా నిలిచింది." అని బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థి వంశీ అబ్బినేని చెప్పారు.

"పాత్ర మారుతోంది కానీ కేవలం తల్లి పాత్ర చుట్టూ తిరిగే సినిమాలు మాత్రం రావటం లేదని, మార్కెట్ విలువలే సినిమా నిర్మాణాన్ని నిర్దేశిస్తున్నాయి." అని సౌత్ ఆసియా యూనివర్సిటీ, న్యాయ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి రమణి అన్నారు.

మథర్ ఇండియాలో రాధ పాత్ర పోషించిన నర్గీస్ అయినా, బాహుబలిలో శివగామి పాత్రలో ఒదిగిపోయిన రమ్యకృష్ణ అయినా.. తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందే అంటూ చాటి చెప్పడం అమ్మ పాత్రలో వచ్చిన పరిణామమే! కాకపోతే ఒకటి సాంఘికం, ఇంకొకటి రాజరికం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)